ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Revanth met with Modi : మోదీతో రేవంత్‌ భేటీ

ABN, Publish Date - Dec 26 , 2023 | 01:37 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని కలుసుకోనున్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో రేవంత్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. సాధారణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన

నేడు ప్రధానిని కలవనున్న సీఎం

విభజన హామీలను నెరవేర్చాలని, రాష్ట్రానికి పెండింగ్‌ గ్రాంట్లను విడుదల చేయాలని కోరనున్న ముఖ్యమంత్రి

ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విన్నపం.. కొత్త ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీని కలవనున్న రేవంత్‌

కాంగ్రెస్‌ పెద్దలనూ కలిసే చాన్స్‌.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం, రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టులపై చర్చించే అవకాశం

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సైతం ఢిల్లీకి

హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని కలుసుకోనున్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో రేవంత్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. సాధారణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వెళ్లి ప్రధాన మంత్రిని కలవడమన్నది సంప్రదాయం. దీన్ని రేవంత్‌ కూడా కొనసాగించనున్నారు. వాస్తవానికి రాజకీయ వైరుధ్యాలతో సంబంధం లేకుండా.. కేంద్ర ప్రభుత్వంతో పాలనా పరమైన సఖ్యతను సీఎం రేవంత్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఈ మేరకు గతంలోనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి స్వయంగా ఫోన్‌ చేసి తాను మర్యాదపూర్వకంగా కలిసేందుకు ప్రధాని మోదీ వెసులుబాటు గురించి ఆరా తీశారు. ఈ నెల 26 (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు కలిసేందుకు ప్రధాని సమయం ఇచ్చారు. కాగా, ప్రధానితో సీఎం భేటీ మర్యాదపూర్వకమేనన్న అభిప్రాయాలున్నప్పటికీ.. ఈ సందర్భంగా రేవంత్‌ రాష్ట్ర ప్రయోజనాలను మోదీ దృష్టికి తీసుకెళతారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతోపాటు రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్లను ప్రధానికి వివరించవచ్చని తెలుస్తోంది. నిజానికి విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు కావడంలేదు. తెలంగాణలోని కాజిపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని, బయ్యారంలో స్టీల్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. వీటిని ప్రధాని మోదీ వద్ద రేవంత్‌రెడ్డి ప్రస్తావించవచ్చని తెలుస్తోంది.

ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం..

రాష్ట్రంలోని ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ కూడా నెరవేరడంలేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఆ తర్వాత.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని, కొత్తగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరింది. కాగా, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది. దీనిపై విచారణ జరిపిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కాకుండా ప్రాణహిత-చేవెళ్లకుగానీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకుగానీ జాతీయ హోదా ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరే అవకాశాలున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రకాల గ్రాంట్లు రావాల్సి ఉంది. వీటిని విడుదల చేయాలంటూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసింది. కానీ, ఇప్పటివరకు అవి విడుదల కాలేదు. విభజన చట్టంలోని నిబంధనల మేరకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉంది. ఈ పథకం కింద హైదరాబాద్‌ మినహా అప్పటి ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున రూ.450 కోట్లు రావాలి. ఇలా మూడు సంవత్సరాలకు (2019-20, 2020-21, 2021-22) సంబంధించి రూ.1,350 కోట్ల గ్రాంటు పెండింగ్‌లో ఉంది. దీనిని విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి కోరే అవకాశాలున్నాయి.

రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం..

కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎ్‌సఎస్‌) కింద తెలంగాణకు రావాల్సిన వాటా నిధులు రూ.495.20 కోట్లు పొరపాటున ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయి. ఈ పొరపాటును సరిదిద్ది, తమ సొమ్మును తమకు ఇవ్వాలని కోరే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.817.61 కోట్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. 2020-21లో పన్ను వసూళ్లు తగ్గిన నేపథ్యంలో రాష్ట్రానికి రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంటును ఇవ్వాలంటూ 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. ఇవి కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు. ఇక కొన్ని కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటును విడుదల చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వ వాటా రాలేదని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. నిజానికి కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద ఈసారి బడ్జెట్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.41,259.17 కోట్లను ఆశిస్తూ పొందుపరిచింది. కానీ, ఈ ఏడాది అక్టోబరు నాటికి దీని కింద రూ.3,835.91 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. ఆశించిన గ్రాంట్లలో వచ్చింది 9.30 శాతమే. ఈ నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని సీఎం కోరే అవకాశాలున్నాయి.

సీఎం రేవంత్‌కు గొంతు నొప్పి

మాట్లాడొద్దని సూచించిన వైద్యులు

ఇంటి వద్దే విశ్రాంతి తీసుకున్న సీఎం

హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గొంతునొప్పితో బాధపడుతున్నారు. సోమవారం ఆయన్ను మరోమారు వైద్యులు పరీక్షించినట్లు సమాచారం. గొంతు నొప్పి ఎక్కువ కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దని సీఎం రేవంత్‌కు వైద్యులు సూచించారు. గొంతుకు విశ్రాంతినివ్వాలని అడ్వైయిజ్‌ చేశారు. దీంతో ఆయన సోమవారం ఎటువంటి కార్యక్రమంలోనూ పాల్గొనకుండా ఇంటికే పరిమితమయ్యారు. విజిటర్స్‌ను కూడా పెద్దగా కలువలేకపోయారు. మంత్రి కోమటిరెడ్డి.. ఎన్‌ఆర్‌ఐ పైళ్ల మల్లారెడ్డితో కలసి సీఎం రేవంత్‌ ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. గత శుక్రవారం నుంచి సీఎం జ్వరం, దగ్గు, గొంత నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొంటూ వస్తున్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో చాలాసేపు మాట్లాడారు. దానివల్ల కూడా సీఎంకు గొంతునొప్పి ఎక్కువ అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

సీఎంను కలిసిన మెగాస్టార్‌

సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన స్వగృహంలో మెగాస్టార్‌ చిరంజీవి కలిశారు. మలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారి మధ్య సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి కొంత చర్చ జరిగినట్లు తెలిసింది.

దీపాదాస్‌ మున్షీని కలవనున్న రేవంత్‌

సీఎం రేవంత్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల నూతన ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీనీ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఆమెను జనవరి మొదటి వారంలో జరగనున్న పార్టీ సమావేశానికి ఆహ్వానించనున్నారు. ఈ పర్యటనలో అధిష్ఠానం పెద్దలను కూడా రేవంత్‌ కలిసే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28న నాగ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. మంగళవారం రాత్రికే ఆయన తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 01:37 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising