వాడివేడిగా!
ABN, Publish Date - Dec 17 , 2023 | 04:54 AM
అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. విమర్శకు ప్రతి విమర్శ.. ఆరోపణకు ప్రత్యారోపణ.. సామెతకు సామెతలతోనే సమాధానం అన్నట్లుగా సభ్యుల తీరుతో శాసనసభ శనివారం వాడివేడిగా సాగింది.
అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్
సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు
సీఎం రేవంత్, కేటీఆర్ మాటల తూటాలు
ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి
అర్థం కాదంటూ రేవంత్ విమర్శ
రేవంత్ ప్రజలెన్నుకున్న సీఎం కాదు..
నామినేటెడ్ సీఎం అన్న కేటీఆర్
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. విమర్శకు ప్రతి విమర్శ.. ఆరోపణకు ప్రత్యారోపణ.. సామెతకు సామెతలతోనే సమాధానం అన్నట్లుగా సభ్యుల తీరుతో శాసనసభ శనివారం వాడివేడిగా సాగింది. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు... సిరిసిల్లలో పార్టీని నిర్మించుకున్న కె.కె.మహేందర్‌రెడ్డికి అన్యాయం చేసి, ఎన్‌ఆర్‌ఐ, మేనేజ్‌మెంట్ కోటాలో టికెట్ తీసుకుని, గెలిచి ఇక్కడి వచ్చారంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ విమర్శిస్తే.. కేటీఆర్ అదే స్థాయిలో తిప్పికొట్టారు. మా భట్టి అన్న.. మా ప్రభాకరన్న.. మా ఉత్తమన్న.. మా దామోదరన్న ఉన్న పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న వ్యక్తి చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చండాలంగా ఉంటుందని రేవంత్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఇలా.. నువ్వు ఒకటంటే నేను రెండు అంటా? అన్న చందంగా సభ్యుల మధ్య వాదోపవాదనలు, ఎత్తిపొడుపులు, హేళనలు సాగాయి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న శాసన సభలో ఇంతటి వాడివేడి చర్చను ఎవరూ ఊహించలేదు. సాదాసీదాగా సమావేశాలు ముగుస్తాయని అంచనా వేశారు. కానీ శనివారం అందుకు భిన్నమైన వాతావరణం సభలో నెలకొంది. ఈనెల 9న ప్రారంభమైన శాసన సభ... 14న రెండో రోజూ కొనసాగింది. కానీ... ఆ రెండు రోజుల పాటు ఎలాంటి అలజడి, ఆరోపణలు, ప్రత్యారోపణలు, పదునైన వ్యాఖ్యలు లేకుండా స్తబ్దుగా సాగింది. మొదటి రోజు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారాలు చేయించడం, ఇతర కార్యకలాపాలను చేపట్టకపోవడంతో సాఫీగానే ముగిసింది. రెండో రోజు గవర్నర్ ప్రసంగానికే పరిమితం కావడంతో పరిస్థితి అదుపులోనే ఉంది.
ఇక మూడో రోజు శనివారం మాత్రం సభ హీటెక్కింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే సందర్భంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు ఒక పట్టున ముగియకపోవడంతో సభ సాయంత్రం 5.37 గంటల వరకు కొనసాగాల్సి వచ్చింది. 2014కు ముందు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, టి.హరీశ్‌రావు విమర్శిస్తే, 2014 నుంచి తొమ్మిదేళ్ల కాలంలో మీ బీఆర్‌ఎస్ పార్టీ ఎలాంటి విధానాలను అమలు చేసిందో, ఎలా అణగదొక్కిందో ప్రజలు గమనించారంటూ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. కొంతమంది ఎన్‌ఆర్‌ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అర్థం తెలియదు అంటూ ఎన్‌ఆర్‌ఐ అంటే నాన్ రిలయబుల్ రెసిడెంట్ అనే అర్థంలో కేటీఆర్‌ను రేవంత్ దెప్పి పొడిస్తే ఎన్‌ఆర్‌ఐలకు టికెట్లు అమ్ముకున్నదెవరు? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి దామోదర జోక్యం చేసుకుంటూ.. పార్టీలో మెజారిటీ ఉన్నప్పుడు హైకమాండ్‌కు ఎంపిక బాధ్యతను అప్పజెబుతామని, అధిష్ఠానం ఏది చెబితే దాన్ని శిరసావహిస్తామని బదులిచ్చారు. కేటీఆర్ దీనికి బదులిస్తూ.. తాను కూడా అదే చెప్పానని, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి రేవంత్ కాదని, ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అనే చెప్పానని పేర్కొన్నారు. యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలన అంటే.. పడావుబడిన భూములు, పాడుబడిన ఇళ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కర్ఫ్యూలు, ఎన్‌కౌంటర్లు, కరెంటు కోతలు, కటిక చీకట్లు, నెర్రెలు బారిన నేలలు, నెత్తురుగారిన నేలలు అని కేటీఆర్ విమర్శిస్తే... పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన పైన పటారం.. లోన లోటారం.. ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ అన్నట్లుగానే సాగిందని మంత్రి పొన్నం ఘాటుగా స్పందించారు.
మహమూద్ అలీనే అనుమతించలేదు
కాంగ్రెస్ కుటుంబ పార్టీ అంటూ హరీశ్ చేసిన విమర్శను సీఎం రేవంత్ తిప్పి కొట్టారు. కేసీఆర్ కుటుంబంలో కుమారుడికి, అల్లుడికి మంత్రి పదవులు ఇవ్వలేదా? కూతురు ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చినా... బీఆర్‌ఎస్ పార్టీ శాసన సభ పక్ష నేతగా కేసీఆర్ కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ రాలేదని ఎద్దేవా చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం, కడుగుతాం అన్న శ్రీశ్రీ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ‘‘నిన్న ఇక్కడున్నవాళ్లను అక్కడికి ప్రజలు పంపారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకపోతే, పరివర్తన చెందకపోతే అక్కడి నుంచి కూడా వారిని బయటకు పంపుతారు’’ అని హెచ్చరించారు. వాళ్లు ఇక్కడ ఉంటామంటే అభ్యంతరం లేదని, తాము ఇలాగే ఉంటామంటే ఎక్కడికో పంపాల్సి వస్తుందని, అది వాళ్ల పార్టీ ఇష్టమని అన్నారు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టి ప్రజలు ప్రజావాణిని వినిపిస్తుంటే... విని భరించలేని ఈ పార్టీ, ఈ కుటుంబం ఈ రోజు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు హోంమంత్రి మహమూద్ అలీ సీఎంను కలవడానికి వెళితే ఒక హోంగార్డు వెనక్కి పంపించిన అంశం చరిత్రలో నిక్షిప్తమైందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం అమరులైన కటుంబాలను ఎన్నడైనా పిలిచి తిండి పెట్టారా? ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎన్నడైనా పట్టించుకున్నారా? సమీక్షించారా? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులను ఆంధ్రకు తరలించుకుపోతుంటే మౌనంగా మంగళహారతులు పట్టింది కాంగ్రెస్ నాయకులు కాదా? అని కేటీఆర్ ప్రశ్నిస్తే.. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నాయిని నర్సింహారెడ్డి ఉన్నారని, పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా పీజేఆర్ కొట్లాడారని, బీఆర్‌ఎస్ వాళ్లు కాదని విమర్శించారు. కొత్త ప్రభుత్వం వచ్చిందని, తొందర పడొద్దని, మూడు నెలల సమయం ఇద్దామని తమ పార్టీ అధ్యక్షుడు చెప్పారని కేటీఆర్ అంటూనే.. గత కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల పాలనలో విధ్వంసం జరిగిందని అంటున్నారని.. అలాంటప్పుడు 50 ఏళ్లలో జరిగిన విధ్వంసం గురించి తాము మాట్లాడాలా? వద్దా? అని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ పాలన అంతా బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అన్నట్లుగానే ఉండేది కదా అని ప్రశ్నించారు.
అసెంబ్లీ సైడ్ లైట్స్..
మీ నెంబర్ ప్లీజ్..!!
ఈసారి శాసనసభలోకి దాదాపు 57మంది కొత్త ఎమ్మెల్యేలు అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయా ఎమ్మెల్యేలంతా వారి పక్క నియోజకవర్గం వారిని పరిచయం చేసుకోవడంతోపాటు ఫోన్ నెంబర్లు అడిగి తీసుకున్నారు. కొంతమంది సభ్యులను ఫొటో తీసి మరీ వారి కాంటాక్ట్‌కు జత చేసుకున్నారు.
మంత్రి పొన్నం, మాజీ మంత్రి వేముల ముచ్చట్లు
మధ్యాహ్నం 3గంటల సమయంలో శాసనసభకు కొద్దిసేపు టీ బ్రేక్ ఇచ్చారు. ఆ సమయంలో అందరికంటే ముందుగా సభలోకి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. స్పీకర్ పోడియం ముందు కాసేపు ముచ్చట్లు పెట్టారు.
‘అన్నా.. నువ్వాగు’..
సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రసంగిస్తుండగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆయన్ను పలుమార్లు అడ్డుకున్నారు. ఆ సమయంలో పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్ సభ్యులకు దీటుగా సమాధానం ఇస్తూ వచ్చారు. ఓ దశలో సీఎం తన ప్రసంగాన్ని ఆపి మరీ ‘‘అన్నా.. నువ్వాగు’’ అంటూ రామ్మోహన్‌రెడ్డిని నిలువరించారు.
వీ వాంట్ జస్టిస్.. పోడియం వద్ద బీఆర్‌ఎస్ సభ్యుల నినాదాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం అనంతరం స్పీకర్ సభను వాయిదా వేస్తుండడంతో తమకు అవకాశం ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారంటూ హరీశ్ రావు ఆగ్రహంతో ఊగిపోయారు. మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ ‘వీ వాంట్ జస్టిస్’’ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రెండుసార్లు పోడియం వద్దకు వెళ్లారు. ఒకసారైతే ఏకంగా పోడియం ముందు కూర్చున్నారు.
‘అన్నా నువ్వు ఎంత లేచినా నీకు మంత్రి పదవి రాదులే’
శాసనసభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏదో సమాధానం చెప్పబోతుండగా స్పందించిన హరీశ్ రావు.. ‘అన్నా నువ్వు ఎంత లేచినా నీకు మంత్రి పదవి రాదులే అన్నా.. కూర్చో’ అంటూ సెటైర్ వేశారు.
Updated Date - Dec 17 , 2023 | 06:41 AM