విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:31 PM
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యా శాఖ అధికారులు కృషి చేయాలని, నాణ్యమైన విద్యనందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశించారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం
షాద్‌నగర్, డిసెంబరు 18 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యా శాఖ అధికారులు కృషి చేయాలని, నాణ్యమైన విద్యనందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశించారు. సోమవారం షాద్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని మండల విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక వసతులు, విద్యారంగంలో నెలకొన్న సమస్యల గురించి పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఎంఈవోలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశించారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖ మంత్రితో పాటు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వీర్లపల్లి తెలిపారు. విద్యను మించిన సంపద లేదన్న విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. మండల విద్యాశాఖ అధికారులు, షాద్‌నగర్ ఎమ్మార్వో తదితరులున్నారు.
కార్యకర్తల అభిమానాన్ని గుర్తుంచుకుంటా
కొత్తూర్ : కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తనపై చూపుతున్న అభిమానాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకుంటానని వీర్లపల్లి శంకర్ అన్నారు. ఇటీవల ఎన్నికల్లో వీర్లపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మున్సిపాలిటీలోని స్టేషన్‌తిమ్మాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు వసుపుల మహేందర్ 25మంది కార్యకర్తలతో కలిసి తిరుపతికి పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నారు. ఈమేరకు స్థానిక శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. వీర్లపల్లి మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో తనపై ఎంతో విశ్వాసంతో పనిచేసి గెలుపునకు కారకులయ్యారని, వారందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని, తన గెలుపు పట్ల కార్యకర్తలు తిరుపతికి వెళ్లి మొక్కులు తీర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పాదయాత్ర చేస్తున్న కార్యకర్తలను పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 20రోజుల పాటు పాదయాత్ర నిర్వహించి ఎమ్మెల్యే గెలుపు మొక్కును తీర్చుకుంటామని పాదయాత్ర నిర్వహకుడు వసుపుల మహేందర్ తెలిపారు. కౌన్సిలర్ హేమ దేవేందర్‌ముదిరాజ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గొంగళ్ల హరినాథ్‌రెడ్డి, తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ జనార్ధన్‌రెడ్డిలున్నారు. వసుపుల మహేందర్, పాశం కృష్ణ, మల్లేష్, శ్రీకాంత్, శాఖపురం కిట్టుగౌడ్, వసుపుల చైతన్య త దితరులు తిరుపతికి వెళ్లారు. కాగా, మున్సిపాలిటీలోని పెంజర్ల రోడ్డులో గల బందోని మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. సర్పంచ్ వసుంధర శంకర్‌ను సన్మానించారు.
Updated Date - Dec 18 , 2023 | 11:31 PM