బస్ షెల్టర్‌లేక ప్రయాణికుల అవస్థలు
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:04 AM
శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టు చౌరస్తాలో బస్‌షెల్టర్‌లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు చౌరస్తాలో నెలకొన్న ఇక్కట్లు
శంషాబాద్, డిసెంబరు 25: శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టు చౌరస్తాలో బస్‌షెల్టర్‌లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్‌లో ప్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించకముందు అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఉన్న బస్టాండు నుంచి శంషాబాద్, షాబాద్, మహేశ్వరం, కొత్తూర్, కందుకూర్, షాద్‌నగర్ వైపు పోయే ప్రయాణికులు బస్టాండులో వేచి ఉండేవారు. అయితే 12సంవత్సరాల క్రితం బస్టాండుకు 9 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ప్రారంభమైంది. దీంతో ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఉండాలని శంషాబాద్-బెంగళూరూ జాతీయ రహదారిపై బస్ స్టాండలోకి బస్సులు సరిగా రావడం లేదు. బస్టాండు నుంచి గ్రామంలోకి వెళ్లే రోడ్డుకు డివైడర్లు ఏర్పాటు చేశారు. బస్టాండు నుంచి షాద్‌నగర్ వైపు వెళ్లే బస్సులు రహదారిపైకి రావాలంటే అరు కిలోమీటర్ దూరంలో ఉన్న కూరగాయల మార్కెట్ వద్ద యూ టర్న్ తీసుకోవాల్సి వస్తోంది. హైదరాబాద్ వైపునుంచి షాద్‌నగర్ వైపు వెళ్లే బస్సులతో పాటు అదే మార్గంలో వెళ్లే జూకల్, పాల్మాకుల, అమీర్‌పేట, కొత్తపేట వైపునకు వెళ్లే బస్సులు బస్టాండుకు పోకుండా రోడ్డుపైనే నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు బస్సులు ఆగే చోట నిల్చుంటున్నారు. సాధారణ ప్రయాణికులు, వందలాది మంది విద్యార్థులు రోడ్డు పక్కన ఎండలో నిలబడుతున్నారు. అధికారులు ఎయిర్‌పోర్ట్ ప్రయాణికుల మీద చూపిన శ్రద్ధ గ్రామీణ ప్రజలపై చూపడంలేదు. 12ఏళ్లుగా రోడ్డు పక్కనే బస్సుల కోసం వేచి ఉంటున్నారు. కొత్త ప్రభుత్వం అయినా గ్రామీణ ప్రయాణికుల బాధలను పట్టింకొని షెల్టర్ నిర్మించడంతో పాటు అన్ని బస్సులు బస్టాండ్‌లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Dec 26 , 2023 | 12:04 AM