ప్రజాపాలన సభలను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Dec 28 , 2023 | 11:46 PM
ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు ఉద్దేశించిన ప్రజా పాలన గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ సి.నారాయణరెడ్డి అన్నారు.
వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి
ధారూరు, డిసెంబరు 28: ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు ఉద్దేశించిన ప్రజా పాలన గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ సి.నారాయణరెడ్డి అన్నారు. రాజాపూర్‌లో గురువారం నిర్వహించిన ప్రజా పాలన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం ఆరు గ్యారంటీల అమలుకు ప్రజల నుంచి గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 57 టీమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆరు గ్యారంటీలకు ఒకే దరఖాస్తు ఇవ్వాలని, ఏమైనా కారణాలతో గ్రామ సభలో దరఖాస్తు చేసుకోని వారు పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వాలని తెలిపారు. ప్రజల నుంచి దరఖాస్తులను జనవరి 6వ తేదీ వరకు స్వీకరిస్తామని, గ్రామ సభల్లో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. దరఖాస్తుదారులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు. అంతకు ముంద ముఖ్యమంత్రి సందేశాన్ని గ్రామసభలో చదివి వినిపించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, ఆర్డీవో విజయకుమారి, ఎంపీపీ విజయలక్ష్మి, జెడ్పీటీసీ సుజాత, వాలీబాల్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు జె.హన్మంత్‌రెడ్డి, తహసీల్దార్ భువనేశ్వర్, ఎంపీడీవో చెన్నారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తొలి రోజు వంద సభలు.. 19,865 దరఖాస్తులు
వికారాబాద్(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రజాపాలన కార్యక్రమంలో గురువారం తొలిరోజు మంచి స్పందన లభించింది. 19,865 దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో 19 మండలాలు, 4 మునిసిపాలిటీల్లో 100 గ్రామ, వార్డు సభలు జరిగాయి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తమ నియోజకవర్గాల పరిధి సభల్లో పాల్గొన్నారు. మోమిన్‌పేట మండలం బూర్గుపల్లిలో జెడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్ పాల్గొన్నారు. ప్రజా పాలనలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సభల్లో ప్రజలు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. 13 వార్డులు, 87 గ్రామ సభల్లో 19,865 దరఖాస్తులు వచ్చాయి.
‘ప్రజాపాలన’తో ప్రజలకు మేలు
మేడ్చల్(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలనతో ప్రజలకు మేలు జరుగుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి అన్నారు. భోగారం, తుర్కపల్లి, యాడారం, కాచివానిసింగారం గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాపాలనను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. అదనపు కలెక్టర్ గ్రామ సభలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. దరఖాస్తు ఫారాలు అందాయా లేదా? ఎలా నింపారు? తదితర వివరాలను ప్రజలను అడిగారు.
రేషన్ కార్డులపై అయోమయం
ప్రజా పాలన కార్యక్రమంలో అధికారులు స్వీకరించిన దరఖాస్తుల్లో రేషన్ కార్డుకు ఎటువంటి ఆప్షన్ ఇవ్వకపోవడంతో ప్రజలు, అధికారులు అయోమయానికి గురయ్యారు. రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు పెద్దఎత్తున గ్రామసభల వద్దకు చేరుకున్నారు. రేషన్ కార్డులపై అధికారులకు కూడా స్పష్టత లేకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పలేక ఇబ్బందులకు గురయ్యారు. ఫారంలో రేషన్ కార్డు నంబరును నింపాల్సి ఉండటంతో అక్కడ ఏం రాయాలో తెలియక ప్రజలు అయోమయానికి గురయ్యారు. కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో అధికారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Updated Date - Dec 28 , 2023 | 11:46 PM