ఘనంగా వైకుంఠ ఏకాదశి పూజలు
ABN, Publish Date - Dec 23 , 2023 | 11:51 PM
వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకుని శనివారం షాద్‌నగర్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం గోవిందనామస్మరణతో మార్మోగింది. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వేకువ జాము నుంచే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. తెల్లవారుజామున ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించిన వైకుంఠద్వార దర్శనానికి అనుమతించారు.
ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
పలు వైష్ణవాలయాల్లో ఉత్తరద్వార దర్శనం
భక్తిశ్రద్ధలతో హోమాలు, అభిషేకాదులు
షాద్‌నగర్‌అర్బన్, డిసెంబరు 23: వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకుని శనివారం షాద్‌నగర్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం గోవిందనామస్మరణతో మార్మోగింది. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వేకువ జాము నుంచే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. తెల్లవారుజామున ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించిన వైకుంఠద్వార దర్శనానికి అనుమతించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, శంషాబాద్ డీసీపీ రాంచందర్‌రావులతో పాటు ఇతర ప్రజాప్రజాప్రతినిధులు, నాయకులు, పట్టణ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠద్వార దర్శినానికి వచ్చిన భక్తులకు ఆల్ఫాహారంగా ప్రసాదాలను పంపిణీ చేశారు. కాగా, శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్న ప్రజా సేవకే నా జీవితాన్ని అంకితం చేస్తున్నాని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఎమ్మెల్యే శంకర్‌ను సన్మానించగా, ఆలయ పూజారులు ఆశీర్వదించారు. అనంతరం భక్తులకు ఎమ్మెల్యే ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను తన కుటుంబం బతకడానికి ఎలాంటి సంపాదన అవసరం లేదని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని షాద్‌నగర్ ప్రాంత అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికే వినియోగిస్తానని అన్నారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, వారికి సేవ చేసుకోవడానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవున్ని కోరుకున్నట్టు తెలిపారు. బక్కని నర్సింహులు మాట్లాడుతూ ఈ ఒక్క రోజు శ్రీమన్నారాయునుడే భక్తులను వైకుంఠానికి ఆహ్వానిస్తారని అన్నారు. ప్రతీఒక్కరు కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవర్చుకోవాలని కోరారు.
ఆమనగల్లు/కడ్తాల్/తలకొండపల్లి : ఆమనగల్లు పట్టణంతో పాటు కడ్తాల్, తలకొండపల్లి మండలాలు, గ్రామాల్లోని ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులతో ఆలయాలు పోటెత్తాయి. ఆమనగలు వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ నిర్వాహకుడు, ప్రధాన అర్చకుడు కృష్ణమాచార్యులు(కిట్టయ్య) ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం ధనుర్మాస పూజ, అర్చనలు, హోమం, విష్ణుసహస్రనామ పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, ఆకుతోటపల్లి సర్పంచ్ రజిత, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కడ్తాల మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు దేవాలయాలలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు. కడ్తాల లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో అర్చకులు వేణుగోపాల్, శ్రీధర్‌ల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. సర్పంచ్ లక్ష్మీనర్సింహ రెడ్డి, ఉపసర్పంచ్ రామకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, తదితరులున్నారు. మైసిగండి మైసమ్మ, శివాలయంలో జరిగిన పూజల్లో ఆలయ పౌండర్ ట్రస్టీ సిరోలిపంతూ, ఈవో స్నేహలత, ఎంపీపీ కమ్లీమోత్యనాయక్, పీసీసీ సభ్యుడు శ్రీనివా్‌సగౌడ్, సర్పంచ్ తులసీరామ్ నాయక్‌లు పాల్గొన్నారు. మక్తమాదారం గ్రామంలో స్వామివారి పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ నిర్వహకులు రామాంజాచార్యులు, ఆదిత్య చారి, రంగరాజ్ చారి, బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు యాట నర్సింహ్మ సర్పంచ్ సులోచన సాయిలు తదితరులున్నారు. తలకొండపల్లి మండలం దేవునిపడకల్ వేంకటేశ్వరాలయంలో అర్చకుడు రామానుజాచార్యులు, పద్మనాభాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఆలయ చైర్మన్ రాజ్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్ శ్రీశైలం, ఉప సర్పంచ్ తిరుపతి, నాయకులున్నారు. రాంపూర్ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సర్పంచ్ శ్యాంసుందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ మోహన్‌రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి స్నేహలత, మాజీ ఎంపీటీసీ యాదయ్య భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నందిగామ : ఉప్పల బ్రదర్స్ షాద్‌నగర్ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరాలయంలో భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేశారు. ఉప్పల బ్రదర్స్ శివకుమార్‌గుప్త, శశికుమార్‌గుప్త, వెంకటే్‌షగుప్త భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
చేవెళ్ల : మండల కేంద్రంలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తరద్వార దర్శనం కల్పించారు. మండలంతో పాటు షాబాద్, శంకర్‌పల్లి, హైదరాబాద్, వికారాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు ఇంటిల్లిపాది తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. ఆలయ ఈవో నరేందర్, ధర్మకర్తలు శ్రీకాంత్‌చారి, శ్రీపాదు, దేవుని వామానచార్యులు, భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. చేవెళ్ల సర్పంచ్ శైలజాఆగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. సీఐ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అలాగే చేవెళ్ల మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నంలు లక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్, శ్రీనివా్‌సరెడ్డి, అశోక్, మధుకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు సీతారెడ్డిలు తిరుమల తిరుపతిలో వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
షాబాద్ : మండలంలోని నాగర్‌గూడలో శ్రీకృష్ణదేవాలయం, షాబాద్‌లో శ్రీరామచంద్రస్వామి దేవాలయం, దైవాలగూడలో వేంకటేశ్వరస్వామి దేవాలయం, సీతారాంపూర్‌లో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనానికి భక్తులు ఉదయం నుంచే బారులుతీరారు. పూజా కార్యక్రమాల్లో శ్రీనివాసాచారి పంతులు, సర్పంచులు సుబ్రమణ్యేశ్వరీ రవీందర్, పాండురంగారెడ్డి, ఆయా గ్రామాల గ్రామస్థులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : చిలుకూరు బాలాజీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయంతో పాటు కనకమామిడి గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా కనకమామిడిలో స్వామివారిని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ పార్థసారథి దర్శించుకున్నారు. అలాగే వేంకటేశ్వరస్వామిని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి దర్శించుకున్నారు. కనకమామిడి వేంకటేశ్వరస్వామిని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కేఎస్ రత్నం, కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి భీంభరత్, నాయకులు స్వామిని దర్శించుకున్నారు.
శంషాబాద్‌రూరల్ : మండల పరిధిలోని ముచ్చింతల్ శ్రీరామనగరం దివ్యసాకేతంలోని వేంకటేశ్వరాలయంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌స్వామి ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజామున నుంచే తరలివ చ్చారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్యుల విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరద్వార దర్శనం కల్పించారు. అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయంలో జడ్పీటీసీ నీరటి తన్వీరాజు దంపతులు ప్రత్యక పూజలు నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం : వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇబ్రహీంపట్నంలో శనివారం దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. త్రిశక్తి దేవాలయం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, రామాంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు.
శంషాబాద్ : మున్సిపాలిటీలోని వివిధ బస్తీల్లో వైకుంఠ పూజలు ఘనంగా నిర్వహించారు. గొల్లపల్లి దర్వాజాబస్తీలోని వేంకటేశ్వరాలయంతో పాటు బాలానగర్ మండలం గౌతాపురంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ధర్మగిరి, కృష్ణమందిర్ ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
యాచారం : మండలంలోని తిరుమలేషుని గుట్టపై వెలసిన వేంకటేశ్వరస్వామికి, తక్కళ్లపల్లిలోని వేంకటేశ్వర గుట్టపై వెలసిన స్వామివారికి వైకుంఠ ద్వారదర్శన మహోత్సవం కనులపండువగా జరిగాయి. వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. తిరుమలేషుని గుట్టపై వెలసిన స్వామివా రికి బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు దండెం రాంరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కె.నారాయణరెడ్డి, ఎం.శ్రీనివా్‌సచారి, యాదగిరి, రాజేష్ భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
మహేశ్వరం : మండలంతో పాటు తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని ఫ్యాబ్‌సిటీ వేంకటేశ్వరాలయంలో ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలు హాజరై ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. మహేశ్వరం శివగంగం రాజరాజేశ్వరాలయం, అమీర్‌పేట వేంకటేశ్వర ఆలయం, ఘట్టుపల్లి వీరాంజనేయ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వరస్వామి కృపతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాక్షించారు.
కందుకూరు : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో శనివారం వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. కాగా, కొత్తగూడ, కందుకూరు, పులిమామిడి, లేమూరు, తిమ్మాపురం,. ముచ్చర్ల, తదితర గ్రామాల్లోని పలు దేవాలయాల్లో భక్తులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
షాబాద్ : కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్ మల్లారెడ్డిగూడ, ఎర్రోనిగూడ గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒ క్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, ఎంపీటీసీ చెన్నయ్య, సర్పంచులు జంగయ్య, జయమ్మసుదర్శన్, ఉపసర్పంచ్ ప్రతా్‌పరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
కొందుర్గు : మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజలు, అభిషేకం నిర్వహించారు. స్వామివారికి పల్లకీసేవ, సామూహిక అర్చన కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శనం చేయించారు. పూజా కార్యక్రమాల్లో ఈవో శ్రీనివాస శర్మ, మాజీ ఎంపీటీసీ యాదయ్య, సి. కృష్ణయ్య, కె.శ్రీనివాస్, జిబి.కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
చౌదరిగూడ : శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. మండల పరిధిలోని లాల్‌పహడ్‌లోని శ్రీలక్ష్మి పద్మావతి ఆలయంలో ఉత్తరద్వార దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ విజయ్‌కుమార్, అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2023 | 11:51 PM