అత్యవసర సేవకులకు కనీస సౌకర్యాలు కరువు
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:19 PM
రోడ్లపై ప్రమాదం జరిగినా.. మహిళలు ప్రసవ వేదనతో బాధపడుతున్నా.. ఎవరైనా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా.. మనకు వెంటనే గుర్తుకు వచ్చేది 108 అంబులెన్స్. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులు, బాధితులకు వైద్య సేవలందించేందుకు, వారి ప్రాణాలు రక్షించేందుకు ఒక్క ఫోన్‌కాల్‌తో స్పందించి హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రిలో చేర్పించేందుకు 108 సిబ్బంది తీసుకునే చొరవ అంతా ఇంతా కాదు.
మరుగుదొడ్లు, మూత్రశాలలు లేని వైనం
శిథిలావస్థకు చేరుకున్న భవనంలో విశ్రాంతి
ఇబ్బందులు పడుతున్న 108 సిబ్బంది
కేశంపేట, డిసెంబరు 16 : రోడ్లపై ప్రమాదం జరిగినా.. మహిళలు ప్రసవ వేదనతో బాధపడుతున్నా.. ఎవరైనా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా.. మనకు వెంటనే గుర్తుకు వచ్చేది 108 అంబులెన్స్. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులు, బాధితులకు వైద్య సేవలందించేందుకు, వారి ప్రాణాలు రక్షించేందుకు ఒక్క ఫోన్‌కాల్‌తో స్పందించి హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రిలో చేర్పించేందుకు 108 సిబ్బంది తీసుకునే చొరవ అంతా ఇంతా కాదు. అలాంటి అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి సేద తీరడానికి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కేశంపేట మండలానికి ప్రభుత్వం ఏడాది క్రితం 108 అంబులెన్స్ కేటాయించింది. స్థానిక ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి ప్రజలకు సేవలు అందుతున్నాయి. కాగా, రోజూ ఎక్కడో ఓ ప్రమాదం జరగడం, క్షతగాత్రులను, బాధితులను కాపాడేందుకు 108 సిబ్బంది వారిని వివిధ ఆసుపత్రులకు తరలించడం జరుగుతుంది. ఇలా 24/7 అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బంది కనీస సౌకర్యాలకు నోచుకోలేకపోతున్నారు. కేశంపేట మండలంలోని అంబులెన్స్‌లో ఇద్దరు ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్)లు ఇద్దరు పైలెట్లు(డ్రైవర్లు) విధులు నిర్వహిస్తున్నారు. వీరు 12 గంటలు చొప్పున ఒక టీంగా ఏర్పడి 24/7 విధుల్లో ఉంటారు. అయితే, వారు సేద తీరడానికి ఆసుపత్రి ఆవరణలో శిథిలావస్థలో ఉన్న గదిని వాడుకుంటున్నారు. అందులో మూత్రశాలలు, మరుగుదొడ్డి సౌకర్యం లేదు. దీంతో ఆరుబయటకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గదిలో నిద్రపోవడానికి అనుకూలంగా లేదని, పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో తరచూ దోమలు, విషపురుగులు వస్తున్నాయని వాపోతున్నారు. ఆరుబయట భోజనం చేస్తున్నామని, నిద్ర సరిగా పట్టకపోవడంతో వాహనం నడపడానికి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
కనీస సౌకర్యాలు కల్పించాలి
108 అంబులెన్స్‌లో విధులు నిర్వహిస్తున్న తమకు కనీస సౌకర్యాలు కల్పించాలి. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. సేద తీరడానికి ఇచ్చిన గది శిథిలావస్థకు చేరుకుంది. అందులో కనీసం భోజనం చేయాలన్నా, పడుకోవాలన్నా ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఆరుబయటే భోజనం చేస్తున్నాం. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించాలి.
- రాంచందర్, 108 ఈఎంటీ, కేశంపేట
నిద్ర సరిగా పట్టడం లేదు
108 అంబులెన్స్ అంటేనే ఎమర్జెన్సీ సర్వీసు, సరిగా నిద్రపోకుంటే వాహనం నడపడం కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి రాత్రి వేళ సర్వీస్ చేయాల్సి వస్తుంది. అత్యవసరం ఉంటే క్షతగాత్రుడిని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించాల్సి వస్తుంది. నిద్ర సరిగా లేకపోతే వాహనం నడపడం కష్టం. కనీస సౌకర్యాలు కల్పించాలి. చిన్న షెడ్ వంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
- శ్రీనివాస్, 108 పైలెట్, కేశంపేట
Updated Date - Dec 17 , 2023 | 11:19 PM