మట్టి రోడ్డుకు బీటీ వేయరూ?
ABN, First Publish Date - 2023-12-10T22:59:20+05:30
పనికి ఆహార పథకం కింద డొంక దారిని కొంత మేర కంకర, మరికొంత మట్టి రోడ్డు వేసి వదిలేశారు. 25ఏళ్లుగా మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చకపోవడంతో రెండు మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రెండు మండలాలను కలిపే మట్టిదారికి ఏళ్లుగా బీటీలేదు!
బీటీగా మారిస్తే కొన్ని కిలోమీటర్ల దూరభారం తగ్గుదల
రోడ్డు వేస్తారని కొత్త ప్రభుత్వంపై స్థానికుల ఆశలు
యాచారం, డిసెంబరు 10: పనికి ఆహార పథకం కింద డొంక దారిని కొంత మేర కంకర, మరికొంత మట్టి రోడ్డు వేసి వదిలేశారు. 25ఏళ్లుగా మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చకపోవడంతో రెండు మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యాచారం మండలం గడ్డమల్లాయగూడ-మంచాల మండలం జలాల్‌మియాపల్లె వరకు 1993లో మూడున్నర కిలోమీటర్ల మట్టి రోడ్డు వేశారు. దీనికి అప్పట్లోనే పదిన్నర లక్షల వరకు ఖర్చు చేశారు. గడ్డమల్లాయగూడ నుంచి జలాల్‌మియాపల్లె వెళ్లాలంటే రంగాపూర్ మీదుగా పోవాలి. కానీ నేరుగా ఉన్న మట్టిరోడ్డును బీటీగా మారిస్తే వాహనదారులకు రెండు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. మట్టి రోడ్డు గుంతలుగా, ముళ్ల పొదల మయంగా మారింది. ఈ రోడ్డును బీటీగా మారిస్తే గడ్డమల్లాయగూడ వాసులు జలాల్‌మియపల్లె మీదుగా మాల్‌కు వెళ్లేందుకు పదిన్నర కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అలాగే చింతపట్ల, నల్లవెల్లి, మొండిగౌరెల్లి, యాచారం వెళ్లడానికీ సౌకర్యంగా ఉంటుంది. బీటీ రోడ్డు వేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని, కలెక్టర్ ఇతర అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ రోడ్డు వేపి ఇబ్బందులు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
వెంటనే నిధులు విడుదల చేసి రోడ్డు వేయాలి : అచ్చన జంగయ్య, సర్పంచ్, గడ్డమల్లాయగూడ
గడ్డమల్లాయగూడ-జలాల్‌మియాపల్లె వరకు బీటీ రోడ్డు వేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ఈ మట్టి రోడ్డును బీటీగా మారిస్తే ఈ రోడ్డు పక్కన పొలాల రైతులకు కూడా మేలు కలుగుతుంది. మా గ్రామం నుంచి మాల్‌కు వెళ్లడానికి పది కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీనిపై మేం త్వరలో ముఖ్యమంత్రిని కలిసి నిధులు విడుదల చేయాలని కోరుతాం.
Updated Date - 2023-12-10T22:59:21+05:30 IST