కొనుగోళ్లు నామమాత్రం!
ABN, First Publish Date - 2023-12-10T22:54:17+05:30
రైతులు పండించిన పత్తిని అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. జిల్లాలో 12 జిన్నింగ్ మిల్లులుండగా అందులో 8 మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే మార్కెట్ కమిటీ అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో రైతులు పత్తిని విక్రయించే క్రమంలో భారీగా మోసపోతున్నారు. పత్తి నాణ్యతగా లేదని కొనుగోలు కేంద్రాల్ల్లో కొర్రీలు పెడుతున్నారు. దీంతో దళారులకు అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారు. అసలే ప్రకృతి వైపరీత్యాలతో సాగు చేసిన పంట దెబ్బతిన్నదని, ఉన్న పంటను అమ్ముకున్నా పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
మార్కెట్‌లోకి వచ్చిన పత్తి..
జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాలకు 8 మాత్రమే ప్రారంభం
తూకాల్లో మోసం.. మరో పక్క దళారుల ప్రవేశం
సిండికేట్‌తో తక్కువ ధరలకు కొనుగోళ్లు
కొరవడి మార్కెట్ కమిటీ అధికారుల పర్యవేక్షణ
జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
ఇప్పటి వరకు 20 వేల మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు
రైతులు పండించిన పత్తిని అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. జిల్లాలో 12 జిన్నింగ్ మిల్లులుండగా అందులో 8 మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే మార్కెట్ కమిటీ అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో రైతులు పత్తిని విక్రయించే క్రమంలో భారీగా మోసపోతున్నారు. పత్తి నాణ్యతగా లేదని కొనుగోలు కేంద్రాల్ల్లో కొర్రీలు పెడుతున్నారు. దీంతో దళారులకు అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారు. అసలే ప్రకృతి వైపరీత్యాలతో సాగు చేసిన పంట దెబ్బతిన్నదని, ఉన్న పంటను అమ్ముకున్నా పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
పరిగి, డిసెంబరు10 : పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం జాప్యం కారణంగా రైతులు దగాకు గురవుతున్నారు. ఈ సారి అధిక వర్షాలతో పత్తి పంట దెబ్బతినడంతో పాటు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. చేతికొచ్చిన పత్తిని కూడా విక్రయించుకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో పత్తి పంటను రైతులు విస్తారంగా సాగు చేసినా ప్రకృతి, వైపరీత్యాల కారణంగా పత్తిపంట దిగుబడి పూర్తిగా పడిపోయింది. ఎక్కడా చూసిన ఎకరాకు నాలుగు నుంచి ఆరు క్వింటాళ్ల వరకు వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ నిర్ణయాలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంటుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం కారణంగా ఏటా జిల్లాలో దాదాపు 50శాతం పత్తిని దళారుకు విక్రయించి రైతులు నష్టపోతున్నారు. జిల్లాలో ఎక్కువగా పత్తి పంటను పరిగి నియోజకవర్గంలో పండిస్తారు. ఇక్కడే అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. అయితే సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఇక్కడ ఇంకా ప్రారంభించనేలేదు. జిల్లాలోని పరిగి, వికారాబాద్,తాండూరు, కొడంగల్, కోట్‌పల్లి, మర్పల్లి ప్రాంతాల్లో మొత్తం 12 కాటన్ మిల్లులున్నాయి. జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభించకపోవడంతో దళారుల రంగప్రవేశం చేస్తున్నారు. వారు చెప్పిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ పత్తి క్వింటాల్‌కు రూ.7,020 బీగ్రేడ్‌కు రూ.6,970గా నిర్ణయించింది. అయితే ప్రభుత్వ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో జాప్యంతో రైతులు బయటమార్కెట్‌లో విక్రయిస్తున్నారు. జిల్లాలో కొన్ని కేంద్రాలు ప్రారంభించినా కొన్ని సీసీఐ కేంద్రాల్లో కొర్రీలు పెడుతుండడంతో రైతులు గత్యంతరం లేక దళారులకు అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారు.
అకాల వర్షాలతో తీవ్ర నష్టం
ఈసారి జిల్లాలో దాదాపుగా 2.40 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. ఈసారి మొదటి నుంచి వర్షాలు కురియక విత్తనాలు ఆలస్యంగా విత్తారు. పంట చేతికొచ్చే సరికి అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టంపై సమర్పించిన నివేదికలు నామమాత్రంగానే ఉన్నాయి. జిల్లాలో దాదాపుగా లక్షన్నర ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిందని రైతులు చెబుతున్నారు. అయితే అధికారుల మాత్రం యాభైవేలలోపు ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగిందని పేర్కొంటున్నారు.
విక్రయించేందుకు రైతుల కష్టాలు
పండించిన పత్తిని రైతులు అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతుతున్నారు. జిల్లాలోని 12 కాటన్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నా అచరణలో కొనుగోళ్లు జరుగడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ ధర రూ.7,020 ఉన్నప్పటీకీ కొనుగోళ్ల సమయంలో కొర్రీలు పెడుతున్నారు. దీంతో ప్రైవేట్‌లో అమ్ముకుందామన్నా దళారులు చెప్పిన ధరకే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువకు కొంటున్నారు. దళారులు సిండికేట్ మారి ధరపెట్టడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే క్వింటాల్‌కు రూ.500 కంటే తక్కువకే కొనగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
తూకాల్లో భారీ మోసాలు
మార్కెట్ కమిటీల అధికారుల పర్యవేక్షణ లోపంతో జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాల్లో పత్తి తూకాల్లో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. పరిగి, పూడూరు, వికారాబాద్, కోట్‌పల్లి, తాండూరు, మర్పల్లి, కొడంగల్‌లో కలిసి మొత్తం 12 కాటన్ మిల్లులు కొనసాగుతున్నాయి. అడిగేవారే లేరు కదా అని తూకాల్లోను మోసాలకు పాల్పడుతున్నారు. జిన్నింగ్ మిల్లుల్లో వేబ్రిడ్జిలున్నాయి. రైతులు తెచ్చిన పత్తిని నేరుగా వేబ్రిడ్జిపై తూకం వేసినప్పుడు రైతులకు అసలు చూపించకుండా వారు చెప్పిందే తూకం బిల్లు బయటకు వస్తుంది. పత్తి అమ్మకాల్లో ఇంత భారీ స్థాయిలో అక్రమాలు జరిగినా ఎవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మార్కెట్ అధికారులకు తెలిసే ఈ తతంగం జరుగుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పత్తి క్వింటాల్‌కు రూ.12 వేలు ఇవ్వాలి
40 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిని సాగు చేశా. అధిక వర్షాలతో దిగుబడి తగ్గింది. ఉన్న దానిని అమ్ముదామని కాటన్ మిల్లుకు పోతే రకరకాల కొర్రీలు పెడుతున్నారు. నాణ్యత లేదని వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం క్వింటాలు పత్తికి రూ.7020 మద్దతు ధరను ప్రకటించి, కొనుగోళ్లు ప్రారంభించలేదు. పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో పత్తి క్వింటాల్‌కురూ.12వేలు ఇవ్వాలి
-లింగం, పత్తి కౌలురైతు, సయ్యద్‌మల్కాపూర్
జిల్లాలో 12 పత్తి కొనుగోలు కేంద్రాలు
వికారాబాద్ జిల్లాలోని 12 కాటన్ మిల్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే ఏనిమిది చోట్ల కొనుగోళ్లు ప్రారంభించాం. పరిగి పరిధిలోనే ఇంకా ప్రారంభించలేదు. రెండు లక్షల మెట్రిక్ టన్నుల పత్తి వస్తుందని అంచనా వేశాం. అయితే ఇప్పటి వరకు 20వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. మరో వారం రోజుల్లో పత్తి కొనుగోళ్లు ఊపందుకుంటాయి. తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
-సారంగపాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి
Updated Date - 2023-12-10T22:54:18+05:30 IST