వందశాత ఉత్తీర్ణతే లక్ష్యం!
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:13 PM
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఉత్తీర్ణత పెంచడానికి ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారిని వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయనున్నారు. వారి చదువులకు ఆటంకం కలగకుండా ఉపాధ్యాయుల కొరత ఉన్న ఉన్నత పాఠశాలలకు ఇతర పాఠశాలల నుంచి సర్దుబాటు చేసి విద్యాబోధన సాగేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
15 రోజులుగా ఉదయం వేళలో కొనసాగుతున్న శిక్షణా తరగతులు
జనవరి ఒకటో తేదీ నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు
గత ఏడాది ఎదురైన అనుభవాల నేపథ్యంలో ముందుగానే పకడ్బందీ కార్యాచరణ
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఉత్తీర్ణత పెంచడానికి ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారిని వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయనున్నారు. వారి చదువులకు ఆటంకం కలగకుండా ఉపాధ్యాయుల కొరత ఉన్న ఉన్నత పాఠశాలలకు ఇతర పాఠశాలల నుంచి సర్దుబాటు చేసి విద్యాబోధన సాగేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
వికారాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యా శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఉత్తీర్ణత పెంచడానికి ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేసే దిశగా ప్రణాళిక రూపొందించారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యా శాఖ ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈనెల ప్రారంభం నుంచి పదో తరగతి విద్యార్థులకు ఉదయం వేళలో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా, జనవరి ఒకటో తేదీ నుంచి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారిని వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయనున్నారు. డిసెంబరు నెలాఖరు వరకు అన్ని సబ్జెక్టుల్లో సిలబస్ పూర్తి చేసి జనవరి ఒకటో తేదీ నుంచి పునశ్చరణ తరగతులు ప్రారంభించాల్సి ఉండగా, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియతో విద్యా బోధన సక్రమంగా కొనసాగలేదు. ఈ నేపథ్యంలో జనవరి రెండవ వారంలోగా సిలబస్ పూర్తి చేయాలనే లక్ష్యం విధించినట్లు చెబుతున్నారు. సిలబస్ పూర్తి కాగానే పునశ్చరణ తరగతులు ప్రారంభించనున్నారు. పదో తరగతి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఉపాధ్యాయుల కొరత ఉన్న ఉన్నత పాఠశాలలకు ఇతర పాఠశాలల నుంచి సర్దుబాటు చేసి విద్యా బోధన సాగేలా విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. షెడ్యూల్ ప్రకారం స్లిప్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా చదువుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారి చదువులపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంది.
వచ్చేనెల నుంచి ప్రత్యేక తరగతులు
జనవరి ఒకటో తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రత్యేక తరగతులు కొనసాగనున్నాయి. ప్రత్యేక తరగతులు పకడ్బందీగా కొనసాగేలా సంబంధిత పాఠశాలల జీహెచ్‌ఎంలతో పాటు ఎంఈవోలు, సెక్టోరియల్ అధికారులు పర్యవేక్షించనున్నారు. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 8367 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. 2023లో జరిగిన పదో తరగతి .పరీక్షల్లో జిల్లా 59.46 ఉత్తీర్ణతా శాతంతో రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. అదే 2022లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో జిల్లా 90.42 ఉత్తీర్ణత సాధించినా రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచింది. గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో తాండూరులో ప్రశ్నపత్రం లీకేజీ జరిగిన సంఘటనలో నలుగురు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడమే కాకుండా జిల్లాలో ఉత్తీర్ణతాశాతం పెరిగే విధంగా జిల్లా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సన్నద్ధ కార్యక్రమాలు ఎప్పుడో?
విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే సమావేశాల జాడ లేకుండా పోయింది. పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏవిధంగా సన్నదఽ్ధం కావాలి, ఎక్కువ మార్కులు సాధించేందుకు ఏ విధంగా చదవాలి, పదో తరగతి తరువాత ఎలాంటి చదువులు ఉంటాయనేది వివరిస్తూ విద్యార్థులతో ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించేవారు. విద్యార్థుల్లో ఉత్సాహం, స్పూర్తి నింపే విధంగా వ్యక్తిత్వ వికాస నిపుణులు, ప్రముఖ వక్తలు, ఉపాధ్యాయులతో ప్రసంగాలు ఇప్పించేవారు. అసెంబ్లీ ఎన్నికల పనుల్లో అధికారులు, విద్యా శాఖ అధికారులు బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. విద్యార్థులను పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం చేయడం ఎంత ముఖ్యమో.. వారికి పదో తరగతి తరువాత ఏయే కోర్సుల్లో చేరితే ఎలాంటి అవకాశాలు వస్తాయనేది అవగాహన కల్పించడం ఎంతో అవసరం. పరీక్షల్లో సులువుగా ఎక్కువ మార్కులు సాధించేందుకు విద్యార్థులకు సబ్జెక్టు నిపుణులతో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించడమే కాకుండా వారిలో మానసిక స్థైర్యం పెంపొందించేందుకు వ్యక్తిత్వ వికాన నిపుణులతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Updated Date - Dec 17 , 2023 | 11:13 PM