దిక్కులేని పంటల బీమా
ABN, Publish Date - Dec 22 , 2023 | 11:59 PM
ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో పంటలు నష్ట పోయినప్పుడు రైతులకు ఆసరాగా పంటల బీమా నిలుస్తుంది. కాగా, గత ప్రభుత్వం పంటల బీమాను ఎత్తేయడంతో రైతులు నష్టపోతున్నారు. గత మార్చిలో వడగళ్లు, అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోయారు.
బీమా అమలులో చేతులెత్తేసిన గత ప్రభుత్వం
పంట నష్టం వాటిల్లితే రైతుకు కష్టమే
భువనగిరి అర్బన్, నల్లగొండ: ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో పంటలు నష్ట పోయినప్పుడు రైతులకు ఆసరాగా పంటల బీమా నిలుస్తుంది. కాగా, గత ప్రభుత్వం పంటల బీమాను ఎత్తేయడంతో రైతులు నష్టపోతున్నారు. గత మార్చిలో వడగళ్లు, అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోయారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఎకరాకు రూ.10వేలు ప్రకటించగా, అవి రైతులందరికీ అందలేదు. గత ప్రభుత్వం బీమా అవసరం లేదని చేతులెత్తేసింది. పంట నష్టం వాటిల్లినప్పుడు ఆ నష్టాన్ని రైతులే భరిస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇప్పటికైనా పంట బీమా అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా రాష్ట్రంలో మూడేళ్లుగా అమలు కావ డం లేదు. ఈ యాసంగిలో అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉండగా, నేటికీ ప్రకటించలేదు. గతంలో ఫసల్ బీమా ద్వారా వరి, మొక్కజొన్న, వేరుశనగ, పెసర, మినుము, నువ్వు లు, పత్తి, మిరప తదితర పంటలతో పాటు పండ్ల తోటలకు సంబంధించి పరిహారం రైతులకు అందేది. కొన్ని సీజన్లుగా రాష్ట్ర ప్రభుత్వం బీమాను అమలు చేయకపోవడంతో ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భాల్లో రైతులు పంట నష్టపోయారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమాకు త్వరగా నోటిఫికేషన్ విడుదల చేస్తే సంబంధించిన ప్రీమియాన్ని రైతులు చెల్లించే అవకాశం ఉంటుంది.
గతంలో..
కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన పంటల బీమాలో రైతులు సగం ప్రీమియం చెల్లిస్తే మిగిలిన సగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించేవి. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 2,66,676 మంది రైతులు ఉండ గా, అప్పట్లో ప్రభుత్వం ప్రీమియం చెల్లించింది. ఈ తరుణంలో జిల్లా, మండలం యూనిట్‌గా కాకుండా రైతుల వారిగా బీమాను అమలు చేయాలని అప్పట్లో రైతులు డిమాండ్ చేశారు. కానీ, బీమాలో మార్పునకు బదులు మూడేళ్ల క్రితం ప్రీమియం చెల్లింపు భారాన్ని రైతులపై వేసి, అమలు బాధ్యతను కంపెనీలకు అప్పగించి గత ప్రభుత్వం చేతులెత్తేసింది. పైగా చెల్లించాల్సిన ప్రీమియంపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో రైతుల్లో నమ్మకం లేక బీమా వైపు వెళ్లడం లేదు. దీంతో ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టం వాటిల్లినప్పుడు రైతులు నష్టపోతున్నారు.
బీమాతో ఎంతో ప్రయోజనం
భారీ నుంచి అతిభారీ వర్షాలు, వడగళ్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు చీడ, పీడల తీవ్రత కారణంగా పంట నష్టం ఏర్పడితే బీమాతో కొంత మేర రైతులకు పరిహారం వచ్చి ఆసరాగా నిలిస్తుంది. ఈ నేపథ్యంలో మార్పులు చేసిన బీమాను అమలు చేస్తే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల నుంచి రూ.50వేల పరిహారం అందుతుంది. అంతేగాక బీమా ప్రీమియం చెల్లించిన రైతులు, వారి కుటుంబ సభ్యులకు రూ.2,00,000 ప్రమాద బీమా, అంగవైకల్యం ఏర్పడితే రూ.1.25లక్షల పరిహారం, ట్రాక్టర్లు, పంపుసెట్లు తదితరాలకు కూడా పరిహారం అందుతుంది. కొత్త ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపి పంటల బీమా అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. యాదాద్రి జిల్లాలో 2.66లక్షల మంది రైతులు ఉన్నారు. జిల్లాలో వానాకాలం వరి సాగు విస్తీర్ణం 3.05లక్షల ఎకరాలు కాగా, యాసంగి వరి సాగు విస్తీర్ణం 2.83లక్షల ఎకరాలు. ఈ యాసంగిలో వరి సాగు అంచనాలు 2.60లక్షల ఎకరాలు. జిల్లాలో ఉద్యాన పంటలు 15,487 ఎకరాల్లో సాగవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పండ్ల తోటలు 59 హెక్టార్లలో రైతులు సాగుచేస్తారని ఉద్యాన అధికారులు అంచనా వేశారు. నల్లగొండ జిల్లాలో వానాకాలంలో 11లక్షల ఎకరాల్లో వరి, పత్తి ఇతర పంటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది వానాకాలంలో 6.60లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, ఎకరాకు కనీసం నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల పత్తి కూడా దిగుబడి రాలేదు. దీంతో రైతులకు పెట్టుబడులు కూడా దక్కలేదు. యాసంగి సిజన్‌లో 5.50లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈ సారి సాగర్ ఆయకట్టుకింది వరి నాట్లు వేసే పరిస్ధితి లేదు. సుమారు లక్షకుపైగా ఎకరాలు బీడుబారిన పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ఉద్యాన పంటలైన బత్తాయి, మామిడి ఇతర పండ్ల తోటలు సుమారు 45వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి.
బీమా.. రైతుకు ధీమా : కోడూరు రమేష్, రైతు, గుండాల
పంటల బీమాతో రైతులు ధీమాగా ఉండవచ్చు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినప్పుడు బీమాతో ఊరట కలుగుతుంది. పండించి న పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆర్థికంగా కుంగిపోయే రైతులకు బీమా పథకం ఆసరాగా నిలిచేది. కొత్త ప్రభుత్వం చొరవ తీసుకొని పంటల బీమా పథకం తిరిగి ప్రవేశపెట్టాలి.
ప్రమాద బీమాతో ఆసరా : లెల్లపాటి బంగారురెడ్డి, రైతు, నర్సాపురం, రాజపేట
పంటల బీమాతో చీడ, పీడలు, ప్రకృతి వైపరీత్యాలతోనేగాక రైతు కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా కూడా అసరాగా ఉంటుంది. దీంతో పాటు వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లు, పంపుసెట్లు తదితరాల కు పరిహారం అందేది. బీమాఅమలు చేస్తే రూ.10వేలనుంచి రూ.50 వేలవరకు పరిహారం అందే వీలుండేది. కేంద్రం చెల్లించే ప్రీమియానికి తో డు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లిస్తే దానికి రైతు కొంత ప్రీమి యం చెల్లించి పంట నష్టపోయినప్పుడు పరిహారంతో కాస్త ఊరట చెందవచ్చు.
Updated Date - Dec 22 , 2023 | 11:59 PM