చలి కాలం..జర పైలం..
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:31 AM
టౌన్‌వయసుతో సంబంధం లేకుండా పెరుగుతున్న గుండెపోటు మరణాల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చల్లగా వీస్తున్న శీతల గాలులు హృద్రోగులను కలవరపెడుతున్నాయి.
పెరుగుతున్న గుండెపోటు మరణాలు
సీపీఆర్‌పై 10 లక్షల మందికి శిక్షణ
మిర్యాలగూడ: టౌన్‌వయసుతో సంబంధం లేకుండా పెరుగుతున్న గుండెపోటు మరణాల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చల్లగా వీస్తున్న శీతల గాలులు హృద్రోగులను కలవరపెడుతున్నాయి. చల్లగా వీస్తున్న గాలులతో శరీర ఉష్ణోగ్రతలు పడిపోతాయని, తీవ్రమైన చలి, శీతల గాలులతో రక్తం చిక్కపడే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే గుండె నిబ్బరంగా ఉంటుందంటున్నారు.
ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతిచెందిన వారిని గమనిస్తే అందులో అన్ని వ యసుల వారున్నారు. సీనియర్ సిటిజన్లతో పాటు యుక్త వయసు వారు, చివరికి విద్యార్థులూ హృద్రోగంతో మృతి చెందుతున్నారు. బీపీ, షుగర్, కొలస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు హృద్రోగంతో మృతిచెందుతున్నారు. అయితే తేలికపాటి వ్యాయామం, ఆహారపు అలవాట్లలో కొ ద్దిపాటి మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలికాలంలో ఎక్కువగానే..
సాధారణ రోజులతో పోలిస్తే చలికాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నట్టు వైద్య నివేదికలు సూచిస్తున్నాయి. అందుకే చలికాలంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చన్నీటితో స్నానం చే యకూడదని వైద్యులు చెబుతున్నారు. చల్ల టి నీటితో తలస్నానం చేస్తే హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న తరుణంలో రక్తం చిక్కగా మారుతుంది. ఆ తరుణంలో చల్లటి నీరు తలపైన పోసుకుంటే శరీరంలో మార్పులు జరిగి రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉంది.
సీపీఆర్‌పై 10లక్షల మందికి శిక్షణ
గుండెపోటు మరణాలను నివారించేందుకు కేంద్ర ప్రభు త్వం చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి మన్‌సుఖ్‌మాండవీయ ఇప్పటికే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అర్బన్, రూరల్ హెల్త్ సెంటర్స్‌తో పాటు జిమ్‌లలో పని చేసే ట్రైనర్లకు సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చే 10లక్షల మందిలో 2లక్షల మంది ఉపాధ్యాయులు, కళాశాలల సిబ్బంది ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఉమ్మడి జిల్లాలో సైతం రాష్ట్ర ప్రభుత్వం పలువురికి సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చింది.
అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ రవితేజారెడ్డి, మిర్యాలగూడ
చలికాలం గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. హైబీపీ, షుగ ర్, కొలస్ట్రాల్ తదితర సమస్యలతో బాధపడుతున్న వారు చన్నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచిది. గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న వారు చల్లని నీటి జోలికి వెళ్లవద్దు. శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి. శీతల గాలి సోకని ప్రాంతంలో వాకింగ్, తేలికపాటి వ్యాయామం చేయాలి. ఆరోగ్య సమస్యలున్న వారు సూర్యోదయం అనంతరమే బయటకు రావాలి.
గజ..గజ
చల్లని గాలులతో ప్రజల ఇబ్బందులు
17.4డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
నల్లగొండ, డిసెంబరు 17: ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమా బాధితులు ఎక్కువగా చలి తో తల్లిడిల్లుతున్నారు. ఉష్ణోగ్రతలు అత్యల్పానికి పడిపోవడంతో గజగజా వణుకుతున్నారు. ఆదివా రం ఉమ్మడి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 28.5డిగ్రీలు నమోదుకాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 17.4డిగ్రీలుగా నమోదైంది. చల్లగాలుల నుంచి బయటపడటానికి ప్రజ లు ప్రత్యామ్యాయాలు వెతుకుతున్నారు. చలినుంచి తట్టుకునేందుకు స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, హెడ్ ప్యాడ్‌లు, గ్లౌజులు ధరిస్తున్నారు. అయినప్పటికీ చలిని తట్టుకోవడం కష్టంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. చలి గాలులు నెలన్నరపాటు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంటోంది. వీలైనంతమేర ప్రజలు చల్లని గాలలు వీచే సమయంలో అవసరం ఉంటే తప్పా బయటకు వెళ్ళవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇంట్లో పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్థులు చలిగాలుల నుంచి రక్షణకు జాగ్రతలు తీసుకోవాలని చెబుతున్నారు. వీలైనంత మేర చలికాలంలో ఆహార పదార్థాలను వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సీజన్‌లో చల్లని పానీయాలు, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్, చల్లని నీటికి దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.
వారం రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా...
తేదీ గరిష్ఠం కనిష్ఠం
11న 29,5 17,8
12న 29.0 17.4
13న 29.0 17.0
14న 28,5 16.4
15న 28.0 16.2
16న 27.5 17.0
17న 28.5 17.4
Updated Date - Dec 18 , 2023 | 12:31 AM