ధ్యానం సహనానికి మార్గం
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:02 PM
మానవతా విలువల పెంపునకు, ఆరోగ్య సమాజ నిర్మాణానికి, ఆనందమయ జీవితానికి ధ్యానం గొప్ప మార్గమని పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోర్పోలు విజయ భాస్కర్‌రెడ్డి, పీఎస్‌ఎస్‌ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీజీ అన్నారు.
పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి
పెరిగిన ధ్యానులు, సందర్శకుల సందడి
ఆకట్టుకున్న కళాకారుల నృత్య ప్రదర్శనలు
ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
కడ్తాల్, డిసెంబర్ 26: మానవతా విలువల పెంపునకు, ఆరోగ్య సమాజ నిర్మాణానికి, ఆనందమయ జీవితానికి ధ్యానం గొప్ప మార్గమని పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోర్పోలు విజయ భాస్కర్‌రెడ్డి, పీఎస్‌ఎస్‌ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీజీ అన్నారు. ధ్యానంతో సహనం, సంకల్ప శక్తి సిద్ధిస్తుందని.. అది వ్యక్తి పురోగమనానికి బాటలు వేస్తుందని వారు పేర్కొన్నారు. కడ్తాల మండలం అన్మాస్‌పల్లి సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్‌లో పత్రీజీ ధ్యాన మహాయాగం వేడుకల్లో భాగంగా ఆరో రోజైన మంగళవారం ఉదయం 5గంటల నుంచి 8 గంటల వరకు ప్రాతఃకాలం వేణునాథ ధ్యానం నిర్వహించారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు సామూహిక ధ్యానం చేపట్టారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ధ్యానులు పత్రీజీ శక్తిస్థల్‌ను సందర్శించి సుభాష్ పత్రీజీకి ధ్యాన నివాళులర్పించారు. ధ్యాన మహాయాగం వేడుకల్లో మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్ రావు , ప్రముఖ సింగర్ గీత మాఽధురిలు పాల్గొన్నారు. ధ్యాన కేంద్రంలో వసతుల కల్పనకు, అన్నదానానికి రామేశ్వర్‌రావు రూ.కోటి విరాళం అందజేస్తానని ప్రకటించారు. అనంతరం విజయభాస్కర్ రెడ్డి, పరిమళ పత్రీజీలు మాట్లాడుతూ మనస్సులో ఉన్న వ్యతిరేక భావాలు, చెడు మార్గాన్ని తెంచుకొని ప్రశాంత జీవితం పొందడానికి ధ్యానం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. భారతదేశంలో పత్రీజీ ద్వారా మొదలైన ధ్యాన విప్లవం విశ్వవ్యాప్తం చేసి ఆయన సంకల్పం విజయవంతానికి ధ్యాన మాస్టర్లంతా కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఆలోచనలు ఉన్నతంగా ఉండి కార్యదీక్షతో ముందుకు సాగే వారు జీవితంలో అద్భుతంగా రాణిస్తారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ రెడ్డి, రాంబాబు, మాధవి, నిర్మల, సాంబశివరావు, శ్రీరాంగోపాల్, నవకాంత్, బాలకృష్ణ, హనుమంతరావు, జగపతి రాజు, విజయలక్ష్మి, ఆనంద్, అన్మాస్‌పల్లి సర్పంచ్ శంకర్ పాల్గొన్నారు.
భారీగా పెరిగిన సందర్శకులు...
కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్‌కు సందర్శకుల, ధ్యానుల రద్దీ పెరిగింది. మూడు రోజులుగా సెలవు దినాలు కావడంతో ఆంద్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు, సందర్శకులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. నిర్వాహకులు పిరమిడ్ ఆవరణలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు. పిరమిడ్‌లోని కింగ్ చాంబర్‌ను ధ్యానులు సందర్శించి ధ్యానం చేస్తున్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
మహేశ్వర మహా పిరమిడ్‌లో ధ్యాన మహాయాగంలో భాగంగా పలువురు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, గీతాలాపనలు అలరించాయి. ఆధ్యాత్మికవేత్తల, పిరమిడ్ మాస్టర్ల సందేశాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా ధ్యానులు, సందర్శకులను ఆకట్టుకున్నారు. కళాకారుల నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా వేడుకల్లో భాగంగా ధ్యానచ ఆధ్యాత్మిక పుస్తకాలను పరిమళ పత్రీజీ, విజయభాస్కర్‌రెడ్డిలు ఆవిష్కరించారు.
==================================
Updated Date - Dec 26 , 2023 | 11:02 PM