ఊరించి.. ఉసూరుమనిపించి
ABN, First Publish Date - 2023-11-10T23:32:56+05:30
అసెంబ్లీ ఎన్నికల రాజకీయం సంగారెడ్డి జిల్లాలో ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల్లో టికెట్ల పంచాయితీ ఉత్కంఠను రేపింది.
‘కాటా’కే పటాన్‌చెరు కాంగ్రెస్ టికెట్
బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నీలం మధు
‘ఖేడ్’ టికెట్ సంజీవరెడ్డికి వదిలేసిన సురేష్ షెట్కార్
టీ-20 మ్యాచ్‌ను తలపించిన బీజేపీ సంగారెడ్డి టికెట్ వ్యవహారం
ఉదయం దేశ్‌పాండేకు.. మధ్యాహ్నం పులిమామిడి రాజుకు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, నవంబరు 10 : అసెంబ్లీ ఎన్నికల రాజకీయం సంగారెడ్డి జిల్లాలో ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల్లో టికెట్ల పంచాయితీ ఉత్కంఠను రేపింది. చివరి క్షణం వరకు టికెట్ ఎవరికి వస్తుందో తెలియలేదు. కాంగ్రె్‌సలో పటాన్‌చెరు, నారాయణఖేడ్ టికెట్ల కేటాయింపు వ్యవహారం పలు మలుపులు తిరుగుతూ నామినేషన్ల చివరి రోజు కొలిక్కివచ్చింది. సంగారెడ్డి బీజేపీ టికెట్ మ్యూజికల్ చైర్‌ను తలపిస్తూ క్షణానికో పేరు మారింది. టికెట్ తమకేనని ధీమా ఉన్నవారు తీరా బీ-ఫామ్ ఇచ్చే సమయానికి ఉసూరుమన్నారు.
పంతం నెగ్గించుకున్న శ్రీనివాస్‌గౌడ్
పటాన్‌చెరు కాంగ్రెస్ టికెట్ కోసం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటా శ్రీనివా్‌సగౌడ్‌తో పాటు ఇటీవలే ఆ పార్టీలో చేరిన చిట్కుల సర్పంచ్ నీలం మధు పోటీపడ్టారు. చివరకు నీలం మధుకే టికెట్ ఖారారు చేసినట్టు ఈ నెల 8వ తేదీ రాత్రి అధిష్ఠానం ప్రకటించింది. దీంతో కాటా శ్రీనివాస్‌గౌడ్ వర్గం నుంచి తీవ్ర నరిసన వ్యక్తమైంది. అర్ధరాత్రి ఆందోళనలతో హంగామా చేసిన కాటా వర్గీయలు మరుసటి రోజు హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ ఇంటిని ముట్టడించారు. గాంధీభవన్‌లో ఆందోళన చేశారు. శ్రీనివా్‌సగౌడ్‌కు టికెట్ ఇవ్వకపోతే తాను కూడా పార్టీకి గుడ్‌బై చెతుతానని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి సి.దామోదర్‌రాజనర్సింహ అధిష్ఠానాన్ని హెచ్చరించారు. దీంతో దిగివచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం కాటాకే టికెట్ కేటాయిస్తూ గురువారం రాత్రి నిర్ణయం ప్రకటించింది. దీంతో శ్రీనివా్‌సగౌడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరోవైపు బీఆర్‌ఎస్‌లో టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు ముధిరాజ్.. కాంగ్రెస్ టికెట్ కూడా వచ్చినట్టే వచ్చి చేజారిపోవడంతో భగ్గుమన్నారు. చివరికి ఆయన బీఎస్పీలో చేరి నామినేషన్ వేయడం గమనార్హం.
సంజీవరెడ్డి కోసం షెట్కార్ త్యాగం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై శుక్రవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ టికెట్ కోసం సురే్‌షషెట్కార్, పట్లోళ్ల సంజీవరెడ్డి తీవ్రంగా పోటీపడ్డారు. మూడో జాబితాలో కాంగ్రెస్ అధిష్ఠానం సురే్‌షషెట్కార్‌ను అభ్యర్థిగా ప్రకటించి బీ-ఫామ్ అందజేసింది. దీంతో సంజీవరెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు దామోదర్ రాజనర్సింహ సైతం సంజీవరెడ్డికే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. మరోవైపు కాంగ్రెస్ తరఫున సురే్‌షషెట్కార్, స్వతంత్య్ర అభ్యర్థిగా సంజీవరెడ్డి శుకవ్రారం నామినేషన్ వేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే శుక్రవారం ఉదయం సురే్‌షషెట్కార్, ఆయన కుటుంబసభ్యులు, సంజీవరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు నారాయణఖేడ్ మండలం పంచగామలో సంజీవరెడ్డి బాబాయి ఇంట్లో సమావేశమై చర్చించుకున్నారు. పదేళ్లుగా వర్గ విభేదాల కారణంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నదని, కలిసికట్టుగా ఉండి ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన అవసరముందని నిర్ణయించుకున్నారు. గతంలో జహీరాబాద్ తాను ఎంపీగా పని చేసినందున వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని, ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్‌ను సంజీవరెడ్డికి ఇస్తున్నట్టు షెట్కార్ అధిష్ఠానానికి సమాచారమిచ్చారు. దీంతో పార్టీ ఆఘమేఘాలపై సంజీవరెడ్డి పేరిట భీ-ఫాంను పంపింది. దీంతో ఇద్దరు నాయకులు కలిసి తమ మద్దతుదారులు వెంటరాగా భారీ ర్యాలీగా తరలివెల్లి సంజీవరెడ్డి పేరిట నామినేషన్ దాఖలు చేశారు. 1989లో సైతం సురే్‌షషెట్కార్ తండ్రి శివ్‌రావు షెట్కార్ తనకు వచ్చిన ఎమ్మెల్యే టికెట్‌ను సంజీవరెడ్డి తండ్రి కిష్టారెడ్డికి ఇచ్చి పోటీ చేయించారు. కార్యకర్తల శ్రేయస్సు, పార్టీ భవిష్యతు కోసమే టికెట్ త్యాగం చేసినట్టు సురేష్ షెట్కార్ తెలపారు.
సంగారెడ్డి బీజేపీ టికెట్‌పై ఉత్కంఠ
సంగారెడ్డి బీజేపీ టికెట్ వ్యవహారం టీ-20 మ్యాచ్‌ను తలపించిందని పేర్కొనవచ్చు. ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లో తొమ్మిదింటికి అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ సంగారెడ్డి స్థానాన్ని చివరి రోజు వరకు ఆపింది. ఇక్కడ టికెట్ కోసం రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే తరఫున బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పట్టుబట్టారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ను వీడి పార్టీలో చేరిన పులిమామిడి రాజుకు టికెట్ ఇప్పించడానికి పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌లు ప్రయత్నాలు చేశారు. హోరాహోరీగా సాగిన పోటీలో గురువారం ఉదయం పులిమామిడిరాజుకు టికెట్ ఖరారైందని ప్రకటించారు. అదేరోజు రాత్రయ్యే సరికి టికెట్ రాజేశ్వర్‌రావు దేశ్‌పాండేకు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. మళ్లీ శుక్రవారం ఉదయం పులిమామిడిరాజు అభ్యర్థిత్వం ఖరారైనట్టు తెలిసింది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే అభ్యర్థిత్వం ఫైనల్ అయిందని, నామినేషన్ వేసుకోమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. ఆయన నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతుండగా మధ్యాహ్నం ఒంటిగంటకు దేశ్‌పాండేకు బదులుగా పులిమామిడిరాజునే ఎంపిక చేశామని అధిష్ఠానం ప్రకటించింది. ఆయన నామినేషన్ వేయడంతో ఉత్కంఠకు తెరపడింది.
Updated Date - 2023-11-10T23:32:57+05:30 IST