నత్తనడకన సిద్దిపేట-సిరిసిల్ల రోడ్డు పనులు
ABN, First Publish Date - 2023-12-02T23:26:55+05:30
సిద్దిపేట-రాజన్న సిరిసిల్ల జిల్లాల సరిహద్దులో పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ప్రారంభం కాని కాజ్‌వే నిర్మాణం
చిన్న వర్షం వచ్చినా పనులకు ఆటంకం
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
నారాయణరావుపేట, డిసెంబరు 2: సిద్దిపేట-రాజన్న సిరిసిల్ల జిల్లాల సరిహద్దులో పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండు జిల్లాల్లోని గ్రామాలకు అనుసంధానంగా ప్రయాణికులకు, వాహనదారులకు సౌకర్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో మంత్రి హరీశ్‌రావు కృషితో నారాయణరావుపేట మండలం మాటిండ్ల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల గ్రామం వెళ్లే రోడ్డుకు రూ.3.73 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో 2.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు, కాజ్వే నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. ఇరుగ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం పనులు పూర్తయితే సుమారు ఐదు కిలోమీటర్ల దూర భారం తగ్గుతుంది. అయితే పనులకు సంబంధించి టెండర్లు పూర్తయి ఏడాది గడుస్తున్నా పనుల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. మాటిండ్ల సమీపంలో నక్క వాగుపై చేపట్టాల్సిన కాజ్‌వే నిర్మాణం పనులు ప్రారంభం కాకపోవడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా కాజ్‌వే నిర్మాణ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు.
కల్వర్టుల నిర్మాణంలో డస్ట్ వినియోగం
నాణ్యతా ప్రమాణాలు పాటించి నిర్మించాల్సిన మాటిండ్ల-జిల్లెల్ల రోడ్డులోని కల్వర్టుల నిర్మాణానికి ఇసుకకు బదులు డస్ట్ వినియోగించడంపై ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రోడ్డు నిర్మాణం పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు వేగవంతం చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చూడాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2023-12-02T23:26:56+05:30 IST