రంగనాయకసాగర్‌లోకి నీటిని పంపింగ్ చేయండి
ABN, Publish Date - Dec 17 , 2023 | 10:45 PM
సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందిచాలని, అందుకు అవసరమగు నీటిని మిడ్ మానేరు నుంచి రంగనాయకసాగర్‌కి పంపింగ్ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు.
సిద్దిపేట క్రైం, డిసెంబరు 17: సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందిచాలని, అందుకు అవసరమగు నీటిని మిడ్ మానేరు నుంచి రంగనాయకసాగర్‌కి పంపింగ్ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు. ఆదివారం శాసనసభలో మంత్రిని కలిసి లేఖను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. మూడు సంవత్సరాలుగా రంగనాయకసాగర్ ద్వారా యాసంగి పంటకు సాగునీరు అందజేశామని, దీని వల్ల పంట దిగుబడి పెరిగి రైతుల బతుకుల్లో సంతోషం నిండిందని తెలిపారు. ఈ యేడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్‌లో లేక రైతాంగం ఆందోళనకు గురవుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. యాసంగికి నీరు అందించాలంటే 3 టీఎంసీల నీరు ఉండాలని, ప్రస్తుతం రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లో 1.50 టీఎంసీల నీరు మాత్రమే ఉందని లేఖలో పేర్కొన్నారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే మిడ్‌మానేరు నుంచి1.50 టీఎంసీల నీటిని రంగనాయక సాగర్‌కు వచ్చే విధంగా పంపింగ్ చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలని లేఖ ద్వారా హరీశ్‌రావు మనవి చేశారు.
Updated Date - Dec 17 , 2023 | 10:45 PM