చిరుధాన్యాలను వారసత్వ పంటలుగా గుర్తించాలి
ABN, Publish Date - Dec 22 , 2023 | 11:39 PM
చిరుధాన్యాలను వారసత్వ పంటలుగా గుర్తింపు పొందేలా ప్రభుత్వాలు కృషిచేయాలని డీడీఎస్ డైరెక్టర్ రుక్మిణీరావు పేర్కొన్నారు.
డీడీఎస్ డైరెక్టర్ రుక్మిణీరావు
జహీరాబాద్, డిసెంబరు 22: చిరుధాన్యాలను వారసత్వ పంటలుగా గుర్తింపు పొందేలా ప్రభుత్వాలు కృషిచేయాలని డీడీఎస్ డైరెక్టర్ రుక్మిణీరావు పేర్కొన్నారు. జహీరాబాద్ పట్టణ పరిధిలోని పస్తాపూర్‌లో ఉన్న డీడీఎ్‌సలో చిరుధాన్యాలతో ఆహార సార్వభౌమత్వం అనే అంశంపై ఎన్జీవోల ప్రతినిధులతో సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరుధాన్యాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని, మద్దతు ధరలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. చిరుధాన్యాలు సాగు చేస్తున్న రైతులకు ప్రాసెసింగ్ యంత్రాలను అందించాలని సూచించారు.
చిరుధాన్యాల రైతులపై చిన్నచూపు
చిరుధాన్యాలను పండిస్తున్న పేద రైతులను ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఆమె విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధరకాల ఎన్జీవోలు ఉన్నప్పటికి కేవలం డీడీఎ్‌సలో చిన్న, సన్నకారు మహిళా రైతులు ఉన్నారని పేర్కొన్నారు. వారందరూ కల్పి పంటల పేరుతో 100 రకాల వరకు చిరుధాన్యాలను సాగుచేస్తున్నారని చెప్పారు. డీడీఎ్‌సలోని మహిళా రైతుల వద్ద అన్నిరకాల చిరుధాన్యాల విత్తనాలు దొరకడం అభినందనీయమని కొనియాడారు. వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడే చిరుధాన్యాల వంగడాలను ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం పరిశోధనలను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. ఉన్న విత్తనాలను చెరిపేయకుండా మార్కెట్లోకి కొత్తరకం విత్తనాలను పరిచయం చేయాలని సూచించారు.
ప్రత్యేక గుర్తింపు ఇచ్చి సహకరించాలి
ప్రభుత్వాలు వాణిజ్య పంటలను సాగుచేసే రైౖతులకు వివిధరకాల ప్రోత్సహకాలను అందజేఊ్త, చిరుధాన్యాలను సాగుచేసే రైతులను పట్టించుకోవడంలేదని విచారం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం, భూముల ఆరోగ్యం, ఆహార పంటల విస్తరణ, వాతావరణ మార్పులు తదితరాలు వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాలను పక్కన పెడుతూ చిరుధాన్యాల రైతులను ప్రభుత్వాలు అజ్ఞానులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్పొరేట్ వ్యవసాయంచేసే రైతులకు ప్రభుత్వాలు సహకరించడాన్ని ఆమె తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా 76 శాతం మంది ప్రజలకు ఆహారభద్రత లేదన్నారు. గ్రామాల్లో పశుసంపదను పెంపొందించేలా కృషిచేస్తే సేంద్రియ ఎరువుల ఆధారంగా పండే పంటల్లో పోషకాలు అధికంగా ఉంటాయని, భూమి కూడా బాగుంటుందన్నారు. అనంతరం వ్యవసాయశాఖ ఏడీఏ భిక్షపతి మాట్లాడుతూ డీడీఎస్ ఎన్జీవోతోపాటు వివిధ ఎన్జీవోలకు చెందిన ప్రతినిధుల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామన్నారు. చిరుధాన్యాలల్లో పోషక సమతుల్యత ఉంటుందన్నారు. చిరుధాన్యాల రైతులు మార్కెట్లో చిరుధాన్యాల డిమాండ్ పెంచేలా సృష్టికర్తలు తయారుకావాలన్నారు. అన్నిరకాల పంటలకు ప్రభుత్వ పరంగా వచ్చే నష్టపరిహారాలను అందిస్తున్నామన్నారు. అనంతరం వివిధ ఎన్జీవోల సభ్యులు, ప్రముఖ జర్నలిస్టులు సజేయ, రమేష్ తదితరులు మాట్లాడుతూ చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా తగినంత ఉత్పత్తులను పండించలేకపోతున్నారన్నారు. కార్యక్రమంలో పీస్ డైరెక్టర్ నిమ్మయ్య, పిలుపు డైరెక్టర్ అమరేంద్ర, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, వికారాబాద్, యాదాద్రిభువనగిరి తదితర జిల్లాల రైతులు పాల్గొన్నారు.
Updated Date - Dec 22 , 2023 | 11:39 PM