పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం
ABN, Publish Date - Dec 14 , 2023 | 11:18 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ మేరకు ఎన్నికలకు అవసరమైన సిబ్బంది వివరాల నమోదు ప్రక్రియను అధికారులు చేపట్టారు.
ప్రక్రియ ప్రారంభించిన జిల్లా యంత్రాంగం
టీ-పోల్ పోర్టల్‌లో పోలింగ్ సిబ్బంది వివరాలు నమోదు
రిటర్నింగ్ అధికారులుగా గజిటెడ్ ఆఫీసర్లు
రిజర్వేషన్లు యథాతథం
సంగారెడ్డి టౌన్, డిసెంబరు 14 : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ మేరకు ఎన్నికలకు అవసరమైన సిబ్బంది వివరాల నమోదు ప్రక్రియను అధికారులు చేపట్టారు. 2024 జనవరి 30తో ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియనున్నది. 2019 జనవరి 21, 25, 30 తేదీలలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు 2024 ఫిబ్రవరి మొదటి వారంలో జరగాల్సి ఉన్నది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించినా సన్నద్ధంగా ఉండాలని ఉద్దేశంతో అధికార యంత్రాంగం కసరత్తును చేపట్టింది.
ఎన్నికల సిబ్బంది వివరాల నమోదు
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. పోలింగ్ సిబ్బంది వివరాలను టీ-పోల్ (తెలంగాణ పోల్) పోర్టల్‌లో నమోదు చేశారు. జిల్లాలో మొత్తం 647 గ్రామ పంచాయతీలు, 5,778 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 5,778 పోలింగ్ కేంద్రాలు ఉండగా మరిన్నీ పోలింగ్ కేంద్రాలు పెరగనున్నాయని సమాచారం. 650 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో మొత్తం 428 మంది ఎన్నికల సిబ్బంది అవసరం ఉంటుందని ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో విడతల వారీగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులుగా గజిటెడ్ ఆఫీసర్లును, ప్రిసైడింగ్ అధికారులుగా సీనియర్ అసిస్టెంట్‌లు, స్కూల్ అసిస్టెంట్లను, పోలింగ్ అధికారులుగా జూనియర్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ క్యాడర్ సిబ్బందిని నియమించనున్నారు.
రిజర్వేషన్లు యథాతథం
2018 పంచాయతీ చట్టం ప్రకారం ఈసారి జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో రిజర్వేషన్లు యథాతథంగా ఉండనున్నాయి. అప్పట్లో కేటాయించిన రిజర్వేషన్లు పదేళ్లపాటు అమలులో ఉండాలన్న నిబంధనల ప్రకారం మరో ఐదేళ్లు ఈ రిజర్వేషన్లే వర్తించనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉండగా 2019 ఎన్నికల్లో ఎస్సీలకు 129 పంచాయతీలు, ఎస్టీలకు 93, బీసీలకు 138, జనరల్ 287గా రిజర్వేషన్లను కేటాయించారు. అయితే జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహీర్‌తో పాటు, పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం, ఇస్నాపూర్, గుమ్మడిదల తదితర గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఒక వేళ కొత్త మున్సిపాలిటీలు ఏర్పడితే రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల సంఖ్య మారనున్నది.
6,56,453 మంది గ్రామీణ ఓటర్లు
సంగారెడ్డి జిల్లాలోని 647 గ్రామ పంచాయతీల పరిధిలో 2019 లెక్కల ప్రకారం 6,56,453 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,32,377 మంది, మహిళలు 3,24,025 మంది, ఇతరులు 48 మంది ఉన్నారు. అయితే ఈ సారి నిర్వహించబోయే ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. కొత్త ఓటర్ల ముసాయిదా, చివరి పబ్లికేషన్ ప్రక్రియ జరగాల్సి ఉన్నందున జిల్లాలో ఓటర్ల సంఖ్య ఏడు లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Updated Date - Dec 14 , 2023 | 11:18 PM