నేటి నుంచి ప్రజా పాలన
ABN, Publish Date - Dec 28 , 2023 | 12:00 AM
ఆరు గ్యారంటీల పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. నేటి నుంచి జనవరి 6 వరకు గ్రామాలు, పట్టణాల్లో సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ప్రతి టీంలోనూ రెవెన్యూ, వ్యవసాయ,
విద్య, వైద్య, విద్యుత్, పౌరసరఫరాల శాఖల అధికారులు
పర్యవేక్షకులుగా నోడల్ అధికారుల నియామకం
గ్రామాలు, పట్టణాల్లో సభలు నిర్వహించి దరఖాస్తుల స్వీకరణ
సిద్దిపేట అగ్రికల్చర్,డిసెంబరు 27: ఆరు గ్యారంటీల పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. నేటి నుంచి జనవరి 6 వరకు గ్రామాలు, పట్టణాల్లో సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వంద కుటుంబాలకు ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేసి, స్వీకరించిన దరఖాస్తులను ఏరోజుకారోజు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఇందుకు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఎంఈవోల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించగా, పర్యవేక్షకులుగా జిల్లాస్థాయి అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రతి టీంలోనూ రెవెన్యూ, వ్యవసాయ, విద్య, వైద్య, విద్యుత్, పౌరసరఫరాల శాఖల అధికారులు ఉంటారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం దశల వారీగా ఆరు గ్యారెంటీల అమలుకు అర్హులను ఎంపిక చేయనున్నారు. ప్రతి మండలంలో నిత్యం రెండు గ్రామపంచాయతీల్లో గ్రామసభలను నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక కార్యక్రమ పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా కొండా సురేఖను నియమించింది.
పర్యవేక్షకులుగా నోడల్ అధికారులు
ప్రజా పాలన కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ఒక మండల ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి హుస్నాబాద్ ఆర్డీవో బెనిషాలెం, సిద్దిపేట నియోజకవర్గానికి సిద్దిపేట ఆర్డీవో రమే్‌ష బాబు, గజ్వేల్ నియోజకవర్గానికి గజ్వేల్ ఆర్డీవో బన్సీలాల్, దుబ్బాక నియోజకవర్గానికి డీఆర్‌డీవో పీడీ జయదేవ్ ఆర్య, జనగామ నియోజకవర్గ పరిధిలోని మండలాలకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీరామ్‌రెడ్డిని నియమించారు.
3.35 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు
జిల్లాలో సుమారు 3.35 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దాదాపుగా 200 యూనిట్లు వినియోగించుకునే ఇళ్లు 1.05 లక్షలు. వీటితో పాటు గృహజ్యోతి పథకం కింద దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య అధికంగా ఉండనున్నది. అయితే ప్రభుత్వం పెట్టిన కొన్ని షరతుల వల్ల వల్ల దరఖాస్తుల పరిశీలనలో కొన్ని తగ్గే అవకాశమూ లేకపోలేదు.
3.45 లక్షల మంది రైతులు
సిద్దిపేట జిల్లాలో 3.45 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ రైతుబంధు వస్తుంది. ప్రజాపాలన లో భాగంగా వీరందరి నుంచి రైతు భరోసా కింద దరఖాస్తులు స్వీకరించనున్నారు.
సొంతింటికి..
జిల్లాలో గతంలో దాదాపు 16వేల డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కేటాయించారు. ఇందులో 5వేల మందికి ఇళ్లను అందించారు. అలాగే గృహలక్ష్మి కింద 16వేల ఇళ్లు మంజూరవ్వగా 12,811 మందికి మంజూరు పత్రాలను అందించారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల సహాయం అందించేలా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
4.80 లక్షలకు పైగా మహిళలు
జిల్లాలో 4.80 లక్షల పైగా మహిళలు ఉన్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు దివ్యాంగులను తీసేయగా.. దాదాపుగా 1.5 లక్షల మహిళలు మహాలక్ష్మి పథకానికి అర్హులుగా ఉండనున్నారు.
దాదాపు 2.1 లక్షల మందికి పెన్షన్లు
జిల్లాలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళల, బీడీ కార్మికుల, ఇతర పెన్షన్‌దారులు కలిపి 2.1 లక్షల మంది ఉన్నారు. కొత్తవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతుండడంతో చేయూత పథకానికి పెన్షన్‌దారులు పెరగే అవకాశం ఉంది.
Updated Date - Dec 28 , 2023 | 12:00 AM