‘పల్లా’కు పలు సవాళ్లు!
ABN, Publish Date - Dec 17 , 2023 | 10:48 PM
పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై కొట్లాడి జనగామ నియోజకవర్గం అభివృద్ధికి ఏమేరకు నిధులు సాధిస్తారో చూడాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నిధులు సాధిస్తారా?
చేర్యాల రెవెన్యూ డివిజన్ హామీ సంగతేంటో?
మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలతో మొదటి పరీక్ష
త్వరలోనే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు
చేర్యాల, డిసెంబరు 17 : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి నియోజకవర్గ అభివృద్ధి అంశం సవాల్‌గా మారనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా ఇక్కడ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా గెలిచారు. దీంతో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై కొట్లాడి జనగామ నియోజకవర్గం అభివృద్ధికి ఏమేరకు నిధులు సాధిస్తారో చూడాలి.
అసమ్మతి సద్దుమణిగించేనా?
జనగామ, చేర్యాల మున్సిపాలిటీల్లో నెలకొన్న అసమ్మతి రూపంలో ఎమ్మెల్యేగా పల్లాకు మొదటి పరీక్ష ఎదురుకానుంది. గతేడాది సొంత పార్టీ నేతలే అవిశ్వాసానికి తెర దీశారు. ప్రస్తుతం మళ్లీ పావులు కదుపుతున్నారు. దీనికి తోడు గ్రామపంచాయతీ ఎన్నికలు మరోసవాల్‌గా మారనున్నది. వార్డుసభ్యులు, సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటారో చూడాలి. గతంలో 90 శాతానికిపైగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే ఉన్నారు. ప్రస్తుతం ఈ స్థానాలను కాపాడుకోవాల్సి ఉంటుంది.
నిధులు తేవడం సాధ్యమయ్యేనా?
పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి నిధులు తీసుకురావడంలో ఏమేర సఫలీకృతుడవుతారో చూడాలి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్ మేనిఫెస్టోతో పాటు వ్యక్తిగత హామీలను సైతం ఇచ్చారు. ఆ హామీల అమలుకు సైతం నిధులు కావాల్సి ఉంటుంది. పల్లా ఇచ్చిన హామీలలో ప్రభుత్వాన్ని ఒప్పించి జీవోలు తీసుకురావాల్సినవి చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు. రెండుసార్లు కేసీఆర్ సభలు పెట్టించి ప్రకటన ఇప్పించారు. అంతేకాకుండా జనగామలో ఫుడ్‌ప్రాసెసింగ్ పార్కు, టైక్స్‌టైల్ తదితర పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. వీటితో పాటు పాలిటెక్నిక్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ తీసుకువస్తానని మాట ఇచ్చారు. ఇవన్నీ పల్లాకు సవాల్‌గా నిలవనున్నాయి.
Updated Date - Dec 17 , 2023 | 10:48 PM