ఏ నుంచి ఏ ప్లస్ గ్రేడ్‌కు
ABN, Publish Date - Dec 23 , 2023 | 11:31 PM
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల న్యాక్ ఏ గ్రేడ్ నుంచి ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపును సాధించింది.
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపు
రాష్ట్రంలోనే రెండో స్థానం కైవసం
ఇప్పటికే కళాశాలకు అటానమస్ హోదా
0.01 సీజీపీఏ తేడాతో ఏ ప్లస్ గ్రేడ్ మిస్
సిద్ధిపేట క్రైం, డిసెంబరు 23 : సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల న్యాక్ ఏ గ్రేడ్ నుంచి ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపును సాధించింది. ఐదు రోజుల క్రితం న్యాక్ టీం డిగ్రీ కళాశాలను సందర్శించి కాలేజీలోని వసతులు, సౌకర్యాలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం గురువారం వెలువరించిన ఫలితాలలో 3.5 సీజీపీఏతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఏ++తో ఖమ్మం కాలేజీ ముందుండగా, సిద్దిపేట డిగ్రీ కాలేజీ ఏ+ గ్రేడ్‌తో రెండో స్థానం కైవసం చేసుకున్నది.
ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కాలేజీ
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రత్యేకతలు కలిగిన కాలేజీగా రాష్ట్రంలోనే పేరొందింది. 1956 సంవత్సరంలో బీఎస్సీ, బీఏ గ్రూపుతో 30మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ప్రస్తుతం 41 కోర్సులు, 10 పీజీ కోర్సులతో 4,500 మంది చదువుతున్నారు. ఈ కళాశాలకు జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి ఎంతో మంది విద్యార్థులు వచ్చి విద్యనభ్యసిస్తున్నారు. 2015 సంవత్సరం నుంచి స్వయం ప్రతిపత్తి (అటానమస్) సాధించి ఇప్పటివరకు 35 సర్టిఫికెట్ కోర్సులు నడుస్తుండగా సంవత్సరానికి 2000 మంది వినియోగించుకుంటున్నారు. 87 మంది ఎన్‌సీసీ విద్యార్థులు ఉన్నారు. ఒక్కో యూనిట్‌కు వందమంది చొప్పున మొత్తం 700 మంది వలంటీర్లు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్‌లో విద్యార్థులకు హైదరాబాద్ సోహం అకాడమీ వారి సహాయంతో రోబోటిక్స్ ట్రైనింగ్ ఇచ్చారు. పూర్తి చేసిన విద్యార్థులు జూనియర్ కాలేజీలు, హైస్కూల్లో ఉన్న విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు.
న్యాక్ టీం పరిశీలనలో 3,403 మార్కులు
న్యాక్ బృందం రెండు రోజుల సందర్శనలో కాలేజీ మౌలిక వసతులు, విద్యార్థుల సౌకర్యాలు, ల్యాబ్‌లు వివిధ అంశాలలో కాలేజీకి మొత్తం 3,888 మార్కులకుగాను 3,403 మార్కులు ఇచ్చారు. ముఖ్యంగా ఏడు అంశాలను పరిగణలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. కోర్సుల నిర్వహణ, ల్యాబ్ కార్యక్రమాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, విద్యార్థుల ఫలితాలు, సేవా కార్యక్రమాలు, డిజిటల్ తరగతులు, లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ సౌకర్యాలు ముందంజలో ఉండడానికి ఉపకరించాయి. అయితే ఐదేళ్లకోసారి ప్రతీ డిగ్రీ కాలేజీ న్యాక్ గుర్తింపు పొందాల్సి ఉంటుంది. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 2005లో 2.89 సీజీపీఏతో బీ+ గ్రేడ్, 2011లో 3.01 సీజీపీఏతో ఏ గ్రేడ్, 2017లో 3.14 సీజీపీఏతో ఏ గ్రేడ్, 2023లో 3.50తో ఏ+ గ్రేడ్‌లో నిలిచింది. అయితే ఏ++ గ్రేడ్ సాధించడానికి కాలేజీ అధ్యాపక బృందం శ్రమించారు. చివరకు 0.01 సీజీపీఏ తేడాతో ఏ++ కోల్పోయింది. అది కూడా భవన నిర్మాణం లోపల చిన్న సమస్యలతో న్యాక్ టీమ్ సంతృప్తి వ్యక్తపరచలేదు. దీంతో రాష్ట్రంలో మొదటి స్థానం దక్కలేదు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. అధ్యాపకుల కృషిని అభినందించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Dec 23 , 2023 | 11:31 PM