పల్లెపోరుకు కసరత్తు
ABN, First Publish Date - 2023-12-11T00:04:56+05:30
అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. త్వరలోనే పల్లె పోరుకు తెరలేవనుంది. పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం 2024 ఫ్రిబవరి1తో ముగియనుంది.
ఫిబ్రవరి 1తో ముగియనున్న పంచాయతీల పదవీ కాలం
సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు
మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు, 4,086 వార్డులు
వార్డు మెంబర్ల రిజర్వేషన్ల సమాచారం కోరిన ఎస్‌ఈసీ
వార్డుల యూనిట్‌గా మూడు దశల్లో ఎన్నికలు
మెదక్‌అర్బన్, డిసెంబరు 10: అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. త్వరలోనే పల్లె పోరుకు తెరలేవనుంది. పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం 2024 ఫ్రిబవరి1తో ముగియనుంది. దీంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) సిద్ధమవుతున్నది. ఈ మేరకు ఎన్నికల కోసం అవసరమైన పోలింగ్ కేంద్రాలు, అధికారుల నియామకం, ఓటరు జాబితా తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30 లోపు అవసరమైన సిబ్బంది సర్దుబాటు చేసుకొని, వివరాలు టీ-పోల్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
జిల్లాలో 469 పంచాయతీలు
మెదక్ జిల్లావ్యాప్తంగా 20 మండలాల్లో 469 గ్రామపంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 4,086 వార్డులున్నాయి. వీటికి సర్పంచులు, వార్డుసభ్యుల ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సిబ్బందిని నియమించాలని ఆదేశించింది. మూడు దశల్లో ఎన్నికల నిర్వహించే అవకాశముంది. దీంతో రెండు విడతల ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న సిబ్బంది మూడో విడత ఎన్నికల్లో పాల్గొంటారు గ్రామ పంచాయతీలో ఒక్కో వార్డును ఒక్కో నియోజకవర్గంగా గుర్తించి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఒకే వార్డులో 650 మంది ఓటర్లకుపైగా ఉంటే రెండో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. జిల్లాలో 2019లో పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో 4,40,341 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా 17,061 మంది ఓటర్లు వచ్చారు.
సిబ్బంది నియామకం
ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులను నియమించాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. గెజిటెడ్ అధికారులను ప్రిసైడింగ్ అధికారులుగా నియమించాలి. సరిపోను గెజిటెడ్ అధికారులు లేకపోతే స్కూల్ అసిస్టెంట్‌ను నియమించాలని సూచించింది. ప్రతీ 200 ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అఽధికారి, ఒక పోలింగ్ అధికారి, 201-400 మంది ఓటర్ల వరకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు, 401-650 మంది ఓటర్ల వరకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించాలి. అత్యవసర పరిస్థితిలో 20 శాతం సిబ్బందిని అదనంగా అందుబాటులో ఉంచాలి.
రిజర్వేషన్లు కొనసాగేనా?
2018-2019లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా ఖరారు చేసి పంచాయతీలు ఎన్నికలు నిర్వహించింది. ఖరారు చేసి రిజర్వేషనుల్ల పదేళ్ల వరకు వస్తాయని స్పష్టం చేసింది. అప్పుడు జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని గ్రామ పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ వివరాలను పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఇప్పటికే తీసుకున్నారు. గత ఎన్నికల్లో జనరల్, మహిళ, ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల వివరాలను సేకరించారు. అయితే బీఆర్‌ఎస్ సర్కార్ తీసుకొచ్చిన 2018 గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా? లేక కొత్త ప్రభుత్వం నూతన చట్టం తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం
-సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి, మెదక్
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం కసరత్తు చేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా 20 మండలాల్లో 469 గ్రామపంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 4,086 వార్డులున్నాయి. ఇప్పటికే పంచాయతీలవారీగా వార్డులు, సర్పంచ్ స్థానాలు, ఓటర్ల జాబితా, అసరమైన సిబ్బంది సంఖ్య తదితర అంశాలపై ప్రాథమిక సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు అందజేశాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చానా పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం.
Updated Date - 2023-12-11T00:04:57+05:30 IST