కాంగ్రెస్‌లో దామోదర్ కలకలం
ABN, First Publish Date - 2023-11-07T23:32:26+05:30
మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, సీడబ్యూసీ సభ్యుడు దామోదర్ రాజనర్సింహ రాజీనామా హెచ్చరిక కాంగ్రె్‌సలో కలకలం రేపింది.
పటాన్‌చెరు, నారాయణఖేడ్ అభ్యర్థులను మార్చకపోతే రాజీనామా చేస్తానని అధిష్ఠానానికి వార్నింగ్
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, నవంబరు 7 : మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, సీడబ్యూసీ సభ్యుడు దామోదర్ రాజనర్సింహ రాజీనామా హెచ్చరిక కాంగ్రె్‌సలో కలకలం రేపింది. పటాన్‌చెరు, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం జిల్లా రాజకీయాలలో ఆసక్తి రేపింది. పటాన్‌చెరు నుంచి కాటా శ్రీనివా్‌సగౌడ్, నారాయణఖేడ్ నుంచి పి.సంజీవరెడ్డికి టికెట్ ఇవ్వాలని దామోదర్ మొదటి నుంచి పట్టుబడుతున్నారు. వీరిద్దరూ అభ్యర్ధులైతే ఆయా నియోజకవర్గాలలో బీఆర్‌ఎ్‌సకు గట్టిపోటీ ఉంటుందని, విజయం కూడా సాధించవచ్చని ఆయన చెప్తున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ఇటీవలే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరి టికెట్ కోసం ప్రయత్నించిన విషయం తెలిసిందే. నీలం మధుకు జిల్లాకు చెందిన ఒకరిద్దరు పార్టీ నాయకులు వద్దతుగా నిలవడం దామోదర్‌ను అసంతృప్తికి గురిచేసింది. నారాయణఖేడ్ టికెట్ సంజీవరెడ్డికి ఇవ్వాలని దామోదర్ పట్టుపట్టగా.. అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ సురే్‌షషెట్కార్ తీవ్రంగా పోటీపడి టికెట్ సాధించుకున్నారు. తాను సూచించినవారికి కాకుండా నీలం మధు, సురే్‌షషెట్కార్‌లకు పటాన్‌చెరు, నారాయణఖేడ్ టికెట్లు వచ్చే అవకాశాలున్నాయని దామోదర్ ముందే ఊహించారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఎట్టి పరిస్ధితులలోనూ వీరికి టికెట్లు ఇవ్వరాదని పట్టుదలతో ఉన్న ఆయన శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్లారు. పటాన్‌చెరు నుంచి కాటా శ్రీనివా్‌సగౌడ్, నారాయణఖేడ్ నుంచి పి.సంజీవరెడ్డికి టికెట్లు ఇవ్వాల్సిందేనని, లేకపోతే తాను కూడా పోటీ చేయనని పార్టీ పెద్దలను హెచ్చరించి సోమవారం హైదరాబద్ వచ్చేశారు.
దామోదర్ సూచనలు బేఖాతారు
దామోదర్ రాజనర్సింహ అభ్యర్ధుల ఎంపికపై చేసిన సూచనలు అధిష్ఠానం బేఖాతరు చేసింది. పటాన్‌చెరు టికెట్ నీలం మధుకు, నారాయణఖేడ్ టికెట్ మాజీ ఎంపీ సురే్‌షషెట్కార్‌కు కేటాయిస్తున్నట్టు సోమవారం రాత్రి ప్రకటించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కాటా శ్రీనివా్‌సగౌడ్, సంజీవరెడ్డి వర్గీయులు ఆందోళనలు చేశారు. కాటా శ్రీనివా్‌సగౌడ్ వర్గీయులు మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఆందోళనకు దిగారు.
ఠాక్రే కాల్‌తో ఆగిన దామోదర్
తాను సూచించిన అభ్యర్థులకు టికెట్లు రాకపోవడంతో దామోదర్ రాజనర్సింహ అధిష్ఠానం తీరుపై ఒకింత అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. వెంటనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే దామోదర్‌కు కాల్ చేసి రాజీనామా విషయంలో తొందరపడవద్దని కోరారు. ఈ రెండు నియోజకవర్గాల పరిస్థితులను చక్కబెడతానని ఠాక్రే ఆయనకు చెప్పారు. దీంతో సమస్య పరిష్కరించిన తర్వాతే తనతో మాట్లాడాలని దామోదర్ తేల్చిచెప్పి మునిపల్లి మండలంలో ప్రచారానికి వెళ్లారు. బుదేరా వద్ద ఉండగా ఆయనకు కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఫోన్ చేయడంతో హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
శ్రీనివాస్ గౌడ్‌కు భరోసా
రాహుల్‌గాంధీ జోడో యాత్ర పర్యటన సమయంలో కాటా శ్రీనివాస్ గౌడ్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారని దామోదర్ అంటున్నారు. అలాంటి శ్రీనివాస్ గౌడ్‌కు కాకుండా నిన్నగాక మొన్న వచ్చిన నీలం మధుకు టిక్కెట్టు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎలాగైనా శ్రీనివాస్ గౌడ్‌కే టిక్కెట్టు వస్తుందని, అంతవరకు ఓపిక పట్టాలని ఆయన భార్య సుధారాణికి దామోదర్ కాల్ చేసి నచ్చ చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో పార్టీ సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాజీనామా చేసే యోచనలో శ్రీనివాస్ గౌడ్ ఉన్నట్టు తెలుస్తుంది.
నేడు సంజీవరెడ్డి భవిష్యత్ కార్యాచరణ
నారాయణఖేడ్ టిక్కెట్టు ఆశించిన డాక్టర్ పి.సంజీవరెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను బుధవారం నాడు ప్రకటించనున్నారు. ఇందుకోసం ఆయన నారాయణఖేడ్‌లోని మా పంక్షన్‌హాలులో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. ఏమైనా నారాయణఖేడ్, పటాన్‌చెరు కాంగ్రెస్ టిక్కెట్ల వ్యవహారం పార్టీలో గందరగోళానికి దారి తీసినట్లయింది.
దామోదర్‌కు జగ్గారెడ్డి హెచ్చరిక
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, నవంబరు 7: పటాన్‌చెరు కాంగ్రెస్ టికెట్‌ను నీలం మధుముదిరాజ్‌కు కేటాయించడంతో తనపై దుష్ప్రచారం చేయించడం మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహకు తగదని సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి హెచ్చరించారు. ఈమేరకు ఆయన మంగళవారం రాత్రి ప్రకటన చేశారు. నీలం మధుకు టికెట్ విషయంలో కాటా శ్రీనివా్‌సగౌడ్, ఆయన భార్యతో దామోదర్ తనను బద్నాం చేయిస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించడం సరికాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇది మంచి పద్ధతి కాదని, దమ్ముంటే రాజకీయంగా తేల్చుకుందామని సవాల్ విసిరారు.
Updated Date - 2023-11-07T23:32:27+05:30 IST