ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంగ్రెస్‌ హుషారు.. జోరు తగ్గని కారు

ABN, First Publish Date - 2023-12-04T01:12:45+05:30

రాష్ట్రమంతా కాంగ్రెస్‌ గాలి వీచినా.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మాత్రం గులాబీదళం హవా కొనసాగింది.

- ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఏడు స్థానాల్లో బీఆర్‌ఎస్‌ హవా

- జనగామలోనూ గులాబీ గుబాళింపు

- జగ్గారెడ్డి చేజారిన సంగారెడ్డి

- కొత్తగా నాలుగింటిని దక్కించుకున్న కాంగ్రెస్‌

- మానకొండూరూ హస్తం ఖాతాలోకే

- మెదక్‌, అందోల్‌, హుస్నాబాద్‌, నారాయణఖేడ్‌, మానకొండూరును కోల్పోయిన బీఆర్‌ఎస్‌

- దుబ్బాకను నిలుపుకోలేని బీజేపీ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, నర్సాపూర్‌, డిసెంబరు 3 : రాష్ట్రమంతా కాంగ్రెస్‌ గాలి వీచినా.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మాత్రం గులాబీదళం హవా కొనసాగింది. ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లో అందోలు, మెదక్‌, నారాయణఖేడ్‌ను కోల్పోయినా మిగతా ఏడు స్థానాల్లో కారు పట్టు నిలుపుకుంది. మిగతా మూడు స్థానాలతో పాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధి నుంచి సిద్దిపేట జిల్లాలో చేరిన హుస్నాబాద్‌నూ బీఆర్‌ఎస్‌ వదులుకోగా ఈ నాలుగింటినీ కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకుంది. జిల్లా పరిధిలో పాక్షికంగా ఉన్న జనగామ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ విజయం సాధించగా, మానకొండూరులో మాత్రం కాంగ్రెస్‌కు వదులుకోవాల్సి వచ్చింది.

జిల్లాల వారీగా పరిశీలిస్తే..

సిద్దిపేట జిల్లాలో ఫలితం వన్‌సైడ్‌గానే నిలిచింది. జిల్లాలో నాలుగు నియోజకవర్గాలుండగా మూడింటిలో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక స్థానాన్ని కాంగ్రెస్‌ దక్కించుకుంది. గజ్వేల్‌లో కేసీఆర్‌, సిద్దిపేటలో హరీశ్‌రావు తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపొందగా, హ్యాట్రిక్‌ విజయాన్ని ఆశించిన హుస్నాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ మాత్రం ఆ సీటును గెలవలేక కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ వశం చేశారు. నిన్నమొన్నటి దాకా బీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ పాగా వేయడం ఆ పార్టీ శ్రేణుల్లో హుషారు నింపింది.

తిరుగులేని మామా అల్లుళ్లు..

గజ్వేల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 45,031 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై విజయం సాధించారు. మొత్తం 2,31,086 ఓట్లు పోలవ్వగా కేసీఆర్‌కు 1,11,684 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ఈటలకు 66,653 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి తూంకుట నర్సారెడ్డికి 32,568 ఓట్లు, బీఎస్పీ నుంచి సంజయ్‌కు 2,743 ఓట్లు పోలయ్యాయి. ప్రతిరౌండ్‌లోనూ కేసీఆరే ఆధిక్యం ప్రదర్శించారు. కేసీఆర్‌పై విజయం సాధిస్తానని ధీమాగా ఉండడమే కాకుండా సవాల్‌ విసిరిన ఈటలకు నిరాశే మిగిలింది. సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి హరీశ్‌రావు 82,308 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 1,78,420 ఓట్లు పోలవ్వగా హరీశ్‌రావుకు 1,05,514 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి పూజల హరికృష్ణకు 23,206 ఓట్లు, బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్‌రెడ్డికి 23,201 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి చక్రధర్‌గౌడ్‌కు 16,610 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్‌ నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించిన హరీశ్‌రావుకు ఈ దఫా మెజారిటీ తగ్గిపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో ఆయనకు 1,18,699 ఓట్ల మెజారిటీ దక్కిన విషయం విదితమే. అయినా ఈసారీ ప్రత్యర్థులకు డిపాజిట్‌ దక్కకుండా ఓట్లు సాధించడం హరీశ్‌రావు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

మళ్లీ బీఆర్‌ఎస్‌కే దుబ్బాక

రామలింగారెడ్డి ఆకస్మిక మరణానంతరం బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుచుకున్న దుబ్బాక నియోజకవర్గాన్ని ఈసారి మెదక్‌ ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి 53,513 ఓట్ల మెజార్టీతో దక్కించుకున్నారు. నియోజకవర్గంలో 1,73,366 ఓట్లు పోలయ్యాయి. కొత్త ప్రభాకర్‌రెడ్డికి 97, 879 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 44,366 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివా్‌సరెడ్డికి 25,235 ఓట్లు, నోటాకు 2,269 ఓట్లు పోలవడం విశేషం. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధించాలనుకున్న హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ 19,344 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 2,05,017 ఓట్లు పోలవగా పొన్నంకు 1,00,955 ఓట్లు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సతీ్‌షకుమార్‌కు 81,611 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీరాంచక్రవర్తికి 8,338 ఓట్లు పోలయ్యాయి. నాలుగోస్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి గద్ద సతీ్‌షకు 5104 ఓట్లు పోలయ్యాయి. పొన్నం ప్రభాకర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు నుంచి 22వ రౌండ్‌ దాకా ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కేవలం రెండు రౌండ్లలోనే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సతీశ్‌కుమార్‌కు స్వల్ప ఆధిక్యం లభించింది.

సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. కౌంటింగ్‌ సమయంలో నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో నువ్వా-నేనా అన్నట్లుగా ఇరుపార్టీల మధ్య ఫలితం దోబూచులాడింది. చివరికి నారాయణఖేడ్‌, అందోల్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, జహీరాబాద్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించాయి. బీఆర్‌ఎస్‌ రెండు సిట్టింగ్‌ స్థానాలను, కాంగ్రెస్‌ తనకున్న ఒక్క సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం.

నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ పి.సంజీవరెడ్డి 6,547 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్‌ గెలుపు కోసం సంజీవరెడ్డి వర్గం, మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్‌ వర్గం కలిసి పనిచేసి సత్ఫలితాలను సాధించారు. దాదాపు 19 ఏళ్ల పాటు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే ఎం.విజయపాల్‌రెడ్డి కలిసి పనిచేసినా ఆ పార్టీకి ఫలితం దక్కకపోవడం గమనార్హం.

- అందోల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి మాజీ ఉప ముఖ్యమంత్రి సి. దామోదర్‌ రాజనర్సింహ 28,193 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తున్నందన్న అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రజాఆశీర్వాద సభతో బీఆర్‌ఎస్‌ కొత్త జవసత్వాలు నింపుకున్నది. అప్పటినుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ ప్రచారంలో ముందంజలో నిలిచారు. చివరకు ఫలితాలు మాత్రం దామోదరకే అనుకూలంగా వచ్చాయి.

- జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి డాక్టర్‌ కె.చంద్రశేఖర్‌పై 12,790 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం తనకు టికెట్‌ ప్రకటించకముందే చంద్రశేఖర్‌ నియోజకవర్గంలో రెండు నెలలుగా విస్తృత ప్రచారం చేశారు. ఆయన స్థానికుడు కాదన్న బీఆర్‌ఎస్‌ ప్రచారం, మాణిక్‌రావు వ్యక్తిత్వం అతని విజయానికి దోహదపడ్డాయి.

- సంగారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఓడిపోవడం ఆ పార్టీ వర్గాలను ఆందోళనకు గురిచే సింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి ఆయన ప్రచారానికి రాకపోవడం, డబ్బు ఖర్చు చేయకపోవడం వల్లే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి జగ్గారెడ్డి, సమీప బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ చేతిలో 8,217 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

- పటాన్‌చెరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి కాట శ్రీనివాస్‌గౌడ్‌పై 7428 ఓట్ల మెజార్టీతో హ్యాట్రిక్‌ విజయం సాధించారు. నియోజకవర్గంలో మొత్తం 2,76,510 ఓట్లు పోలయ్యాయి. గూడెం మహిపాల్‌రెడ్డికి 1,05,166 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు 97,738 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 7428 ఓట్ల మెజార్టీతో మహిపాల్‌రెడ్డి విజయం సాధించారు. బీఎస్పీ నుంచి పోటీ చేసిన నీలం మధు ముదిరాజ్‌ మూడో స్థానంలో నిలిచి 46,059 ఓట్లు సాధించగా నాలుగో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి నందీశ్వర్‌కు 19,879 ఓట్లు వచ్చాయి.

మెదక్‌ జిల్లా విషయానికి వస్తే.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర అవతరణ తరువాత రెండుసార్లు తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి.. ఇటీవలే రాజకీయారంగేట్రం చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు చేతిలో ఓడిపోయారు. 76,969 ఓట్లతో పద్మాదేవేందర్‌రెడ్డి రెండోస్థానంలో నిలవగా, బీజేపీ నుంచి బరిలో దిగిన పంజా విజయ్‌కుమార్‌ 13,657 ఓట్లను సాధించి మూడో స్థానంలో నిలిచారు. 22 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న పద్మాదేవేందర్‌రెడ్డిని రాజకీయాలకు కొత్తవాడైన 26 ఏళ్ల మైనంపల్లి రోహిత్‌రావు ఓడించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. రోహిత్‌రావు10,157 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఎంబీబీఎస్‌ చదివి రెండు బంగారుపతకాలను సాధించిన మైనంపల్లి రోహిత్‌ తమ స్వచ్ఛంధ సంస్థ ద్వారా సేవలందిస్తున్నారు. కొడుకు టికెట్‌ కోసం తండ్రి హన్మంతరావు టీఆర్‌ఎస్‌ను వీడి తనయుడితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. చివరకు తండ్రి కృషి ఫలించి కొడుకు విజేతగా నిలిచాడు. ఇక.. నర్సాపూర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై 8,855 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆదివారం మెదక్‌లోని వైపీఆర్‌ కళాశాలలో మొదట పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించగా ఆవుల రాజిరెడ్డి మెజారిటీ సాధించారు. రౌండురౌండుకూ విజయం దోబూచులాడి చివరకు విజయం సునితారెడ్డిని వరించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డికి 79,555 ఓట్లు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతారెడ్డి 88,410 ఓట్లు వచ్చాయి. పెద్దమొత్తంలో ఓట్లు దక్కించుకుంటాడని భావించిన బీజేపీ అభ్యర్థి మురళీధర్‌ 22,713 ఓట్లకు పరిమితమై మూడోస్థానంలో నిలిచారు.

Updated Date - 2023-12-04T01:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising