కోటి విలువైన గంజాయి స్వాధీనం
ABN, Publish Date - Dec 17 , 2023 | 04:47 AM
ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను బాలానగర్ ఎస్‌ఓటీ, జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు.
ఇద్దరు అంతర్రాష్ట్ర సరఫరాదారుల అరెస్టు..
లారీలో నర్సరీ మొక్కల మధ్య తరలింపు
రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు వెళ్తుండగా 400 కిలోల గంజాయి, లారీ సీజ్
హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల/ఘట్‌కేసర్ రూరల్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను బాలానగర్ ఎస్‌ఓటీ, జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అరెస్టు చేయడంతోపాటు రూ.కోటి విలువైన 400 కిలోల గంజాయి, ఓ లారీ, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ డీసీపీ శ్రీనివా్‌సరావు శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన బబ్లూఖారే(23), మహారాష్ట్రలోని అమరావతికి చెందిన గోవింద్ పాటీదార్(42) లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ స్నేహితులుగా మారారు. బబ్లూఖారే ఓ లారీ (ఎంపీ 09 హెచ్‌జీ 3599)ని రూ.2.50 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నాడు. వారిద్దరూ తరచూ ఏపీ, ఒడిశాలకు కిరాయిలకు వెళ్తుండేవారు. సంపాదన సరిపడకపోవడంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశారు. గంజాయి అక్రమ రవాణా ద్వారా డబ్బు సంపాదించవచ్చని భావించి వారిద్దరూ ఒడిశాకు చెందిన బబ్లూను సంప్రదించారు. అప్పటికే గంజాయి రవాణాలో ఆరితేరిన బబ్లూ వారిద్దరినీ తన వద్ద సరఫరాదారులుగా పనిచేయాలని సూచించాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని లాతూర్‌లో అరవింద్ అనే వ్యాపారికి 400 కిలోల గంజాయి సరఫరా చే యాలని, అందుకు భారీ మొత్తంలో డబ్బు ఇస్తానని వారికి చెప్పాడు. ఈ నెల 14న రాజమండ్రికి చేరుకున్న బబ్లూ అడ్వాన్సు రూపంలో వారికి రూ.75 వేలు ఇచ్చాడు. సంగారెడ్డి వరకు చేరుకోగానే అక్కడ అరవింద్ కలుస్తాడని, అతని ద్వారా లాతూర్‌కు చేరుకోవాలని ఆదేశించాడు. అదే రోజు బబ్లూఖారే, గోవింద్‌లు రాజమండ్రి శివారు ప్రాంతంలో 40 సంచుల్లో నింపిన గంజాయిని లారీలో లోడ్ చేసి, పోలీసులు గుర్తించకుండా గంజాయి సంచుల చుట్టూ నర్సరీ మొక్కలను నింపారు. గురువారం రాత్రి గంజాయి లోడుతో బయలుదేరిన వారిని జీడిమెట్ల వద్ద పోలీసులు అడ్డుకుని, తనిఖీలు నిర్వహించగా విషయం బయటపడింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, 400 కిలోల గంజాయి, ఓ లారీ, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. బబ్లూ, అరవింద్‌ల కోసం గాలిస్తున్నారు.
చర్లపల్లిలో 42 కిలోల గంజాయి పట్టివేత
చర్లపల్లి రైల్వేస్టేషన్ బయట పోలీసులు తనిఖీలు చేస్తుండగా ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి, బ్యాగులు తనిఖీ చేయగా 21 ప్యాకెట్లలో 42కిలోల గంజాయిని గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు బిహర్‌లోని ముజాల్టర్‌పూర్‌కు చెందిన అమిత్రకుమారి, ఢిల్లీలోని జేజే కాలనీకి చెందిన మంజుశర్మ, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన రవీంద్ర బిప్రచంద్ పాత్రోలుగా గుర్తించారు. ఈ ముగ్గురు విశాఖపట్నం నుంచి గంజాయిని కొని హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిపారని ఎక్సైజ్ సీఐ మల్లయ్య తెలిపారు.
Updated Date - Dec 17 , 2023 | 04:48 AM