ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వరంగల్‌ బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ?

ABN, Publish Date - Dec 30 , 2023 | 02:57 AM

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థుల ఎంపిక కొత్త సమీకరణాలకు తెర తీయబోతోంది.

ఎమ్మార్పీఎస్‌ నేతకు టికెట్‌పై బీజేపీ సర్వే

ఇక్కడ కాంగ్రెస్‌ టికెట్‌ రేసులో జిల్లా రిజిస్ట్రార్‌

నిజామాబాద్‌ కాంగ్రెస్‌ టికెట్‌ దిల్‌ రాజుకు!

బరిలోకి దింపేందుకు టీపీసీసీ యోచన

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలకు బీజేపీ గాలం!

లోక్‌సభ ఎన్నికల్లో కొత్త సమీకరణాలు

అభ్యర్థుల ఎంపికలో బీఆర్‌ఎస్‌ ఆచితూచి

అడుగులు.. 3 నుంచి సన్నాహక భేటీలు

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థుల ఎంపిక కొత్త సమీకరణాలకు తెర తీయబోతోంది. ఆయా పార్టీల్లో అంతర్గతంగా చోటుచేసుకుంటున్న ఘటనలు ఎన్నికల బరిలో అనూహ్య పరిణామాలకు దారి తీయబోతున్నాయి. తాము కొనసాగుతున్న పార్టీ నుంచి పోటీకి అవకాశం దక్కకపోతే మరో పార్టీలోకి జంప్‌ అయ్యేందుకు కూడా కొంతమంది సీనియర్‌ నేతలు ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో సినీ నిర్మాతలు, బ్యూరోక్రాట్ల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో మాదిగల ఓటుబ్యాంకును ఎక్కువ శాతం కైవసం చేసుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించాలని భావిస్తోంది. ఆయన పోటీకి సంబంధించి సర్వే నిర్వహిస్తోంది. మాదిగలకు బీజేపీ అండగా ఉంటుందని, వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ఇటీవల పరేడ్‌గ్రౌండ్స్‌ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే న్యాయపరంగా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పా టు చేసిందని కమలం పార్టీ చెబుతోంది. ఈ క్రమంలోనే మందకృష్ణను లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించితే మాదిగల ఓట్లు తమకే పడతాయన్న నమ్మకంతో బీజేపీ నేతలు ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి మాజీ ఐపీఎస్‌ కృష్ణప్రసాద్‌, పార్టీ సీనియర్‌ నేతలు చింతా సాంబమూర్తి, శ్రీధర్‌ కూడా టికెట్‌ ఆశిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలతో బీజేపీ ముఖ్యుల మంతనాలు !

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కనీసం 10 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న కమలం పార్టీ.. కొన్ని నియోజకవర్గాల్లో తమకు గట్టి అభ్యర్థులు లేకపోవడంతో ప్రత్యర్థి పార్టీ నేతలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలతో అంతర్గత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీకి చెందిన ఇద్దరు సిటింగ్‌ ఎంపీలతో బీజేపీ ముఖ్యనేతలు మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే ఈ చర్చలు కొలిక్కి రాలేదని తెలిసింది. అయితే సదరు ఎంపీ బీజేపీ తరఫున పోటీ చేస్తే.. ఆ పార్టీ టికెట్‌ కోసం ఇప్పటికే శ్రమిస్తున్న సీనియర్‌ నేత ఒకరు కాంగ్రెస్‌ గూటికి చేరే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు నాగర్‌కర్నూలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎంపీ రాములు.. కాంగ్రె్‌సలోకి వెళ్లబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తనయుడు భరత్‌ కోసం బీజేపీ నేతలు ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. బీజేపీలో తనకు అవకాశం వస్తుందో, లేదోనన్న అనుమానంతో పార్టీ సీనియర్‌ నేత ఒకరు కాంగ్రెస్‌ వైపు దృష్టి సారించారు.

3 నుంచి బీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశాలు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌.. లోక్‌సభ ఎన్నికల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులుగా ఎవరెవరు బరిలోకి దిగుతారన్న దానిపై అంచనాకు రావాలని, అందుకు తగ్గట్లుగా తమ అభ్యర్థులను ఎంపిక చేయాలని బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం భావిస్తోంది. అయితే కొందరు సిటింగ్‌ ఎంపీలకు మాత్రం మళ్లీ టికెట్‌ ఇచ్చే యోచనలో ఉంది. మిగిలిన చోట్ల పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు, అభ్యర్థుల ఎంపికపై నిర్ధారణకు వచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జనవరి 3 నుంచి 21 వరకు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప శాతం ఓట్ల తేడాతో చేజారిన నియోజకవర్గాలపై ఈసారి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. రెండు విడతల్లో చేపట్టే సమావేశాలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివా్‌సరెడ్డి, జగదీశ్‌ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి తదితర ముఖ్యనాయకులు నిర్వహించనున్నారు. జనవరి 3న ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంతో సమావేశాలను ప్రారంభిస్తారు.

నిజామాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా దిల్‌ రాజు!

వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఉమ్మడి వరంగల్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న హరికోట్ల రవి కూడా ప్రయత్నం చేసుకుంటున్నారు. తనకు టికెట్‌ ఖరారైతే ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలోకి దిగుతానని తన సన్నిహితుల వద్ద రవి చెబుతున్నారు. మరోవైపు నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రముఖ సినీనిర్మాత దిల్‌ రాజు (వెంకట్రామిరెడ్డి)ను బరిలోకి దింపాలన్న ప్రతిపాదన కాంగ్రె్‌సలో ఉంది. దిల్‌రాజును గత ఎన్నికల్లోనే పోటీ చేయించాలని బీఆర్‌ఎస్‌ భావించినా.. ఆయన అప్పుడు పోటీకి నిరాకరించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసే అంశంపై ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే నిజామాబాద్‌ టికెట్‌ను మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కూడా ఆశిస్తున్నారు.

Updated Date - Dec 30 , 2023 | 02:57 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising