ప్రజల భాగస్వామ్యంతోనే శాంతిభద్రతల పరిరక్షణ
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:05 PM
ప్రజల భాగస్వామ్యంతోనే శాంతిభద్రతలు పరిరక్షించబడతాయని రాచకొండ పోలీస్ కమినషరేట్ సీపీ సుధీర్‌బాబు అన్నారు.
రాచకొండ కమిషనరేట్ సీపీ సుధీర్‌బాబు
మంచాలలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ప్రారంభం
మంచాల, డిసెంబర్ 26 : ప్రజల భాగస్వామ్యంతోనే శాంతిభద్రతలు పరిరక్షించబడతాయని రాచకొండ పోలీస్ కమినషరేట్ సీపీ సుధీర్‌బాబు అన్నారు. మంచాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ కెమెరాలను మంగళవారం మంచాల పోలీస్ స్టేషన్‌లో ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, దాతల సహాయంతో 15 గ్రామపంచాయతీల్లో 136 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మంచాల పోలీస్‌స్టేషన్ నుండి ఈ సీసీ కెమెరాల మానిటరింగ్‌ను చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణం నెలకొంటేనే ఏ ప్రాంతమైనా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అందుకోసం ముందుగా శాంతిభద్రతలు పరిరక్షించబడాలని అభిప్రాయపడ్డారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు అత్యంత ప్రాధాన్యత వహిస్తున్నాయని చెప్పారు. దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి తక్కువ సమయంలోనే నిందితులను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. సీసీ కెమెరాలతో గ్రామాల్లో అల్లర్లు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. యువత డ్రగ్స్‌కు బానిసలు కావద్దని సూచించారు. డ్రగ్స్‌తో యువత ఉత్సాహాన్ని కోల్పోయి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని హితవు పలికారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది సామాన్య ప్రజలకు మాత్రమేనని.. చట్ట వ్యతిరేకులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ సత్యనారాయణ, డీసీపీ శ్రీనివాస్‌రావు, ఏసీపీ శ్రీనివాస్, ఉమామహేశ్వర్‌రావు, సీఐ కాశీవిశ్వనాథ్, సైదయ్య, ఎస్సైలు రవినాయక్, లాలయ్య, సతీష్, వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 11:05 PM