సింహానిదే సింహాసనం
ABN, First Publish Date - 2023-12-05T23:48:31+05:30
సింహానిదే సింహాసనం.... కాంగ్రెస్ అధిస్ఠానం మంగళవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డిని ప్రకటించగానే సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టు ఇది...
సీఎం పీఠంపై రేవంత్
ప్రతిష్టాత్మక పోటీలో బూర్గుల తర్వాత ముఖ్యమంత్రి అవుతున్న పాలమూరు బిడ్డ
సామాన్య జీవనం నుంచి రాష్ట్ర స్థాయి సేవలకు...
జడ్పీటీసీ సభ్యుడి నుంచి సీఎం వరకు ఆసక్తికర ప్రయాణం
సింహానిదే సింహాసనం.... కాంగ్రెస్ అధిస్ఠానం మంగళవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డిని ప్రకటించగానే సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టు ఇది... మారుమూల పల్లె కొండారెడ్డి పల్లిలో జన్మించి సాధారణ విద్యార్థిగా తన చదువు కొనసాగించి, ఉపాధి కోసం అందిన పనులన్నీ చేసి రాజకీయాల్లో ప్రవేశించింది మొదలు ప్రతీ సందర్భాన్ని సవాల్‌గా స్వీకరించి అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన రేవంత్‌రెడ్డిని రాష్ట్రంలో అత్యున్నత పదవి వరించిందనే ఆనందంలో రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు చేసుకున్న సంబురాలకు నిదర్శనం ఈ హడావుడి.
మహబూబ్‌నగర్, డిసెంబరు 5 (ఆంధ్ర జ్యోతి ప్రతినిధి): నిజాం సంస్థానం నుంచి విముక్తి అనం తరం హైదరాబాద్ రా ష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ బూరు గుల రామకృష్ణారావుకి అవకాశం దక్కితే, మళ్లీ 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ ఛాన్స్ అనుముల రేవంత్‌రెడ్డికి దక్కింది. సామాన్య రైతు కుటుం బంలో జన్మించిన రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎది గారు. నల్లమలలోని వంగూరు మం డలం కొండా రెడ్డిపల్లి రేవంత్ స్వగ్రామం. బీఏ వరకు చదివిన ఆయన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి.. ఆటుపోట్లు, ఎత్తులు, పైఎత్తులతో హేమాహేమీలను ఢీకొట్టి మరీ క్రమంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. వలసల జిల్లాగా, వెను కబడిన ప్రాంతంగా పేరున్న పాలమూరు నుంచి రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా ఎదగడం రాజకీయ చైతన్యానికి, రేవంత్ పట్టుదలతో ఎది గిన తీరుకు నిదర్శనం. పాలమూరు జిల్లా చరిత్రలో దీన్ని మైలు రా యిగా పేర్కొంటు న్నారు.
జడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం
విద్యార్థి దశలో ఏబీవీపీలో పని చేసిన రేవంత్‌రెడ్డి అనంతరం హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ సొసైటీ అధ్యక్షుడిగా పని చేశారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో ఆపార్టీలో క్రియాశీలకంగా పని చేసిన రేవంత్ 2004లో కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా అవకాశం దక్కలేదు. అనంతరం టీఆర్‌ఎస్‌ను వీడి, 2006లో మిడ్జిల్ జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 2007లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగానే గెలుపొందారు. గెలిచిన అనంతరం అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీలో చేరారు. పదునైన ప్రసంగాలు, చురుకైన కార్యనిర్వహణతో ఎమ్మెల్సీగా అందరి దృష్టిని ఆకర్షించిన రేవంత్‌కు 2009లో కొడంగల్ ఎమ్మెల్యే సీటు దక్కింది. ఆ ఎన్నికల్లో చివరి నిమిషంలో టికెట్ పొందిన ఆయన కేవలం 17 రోజుల్లోనే రాజకీయ దిగ్గజ నాయకుడైన కాంగ్రెస్ అభ్యర్థి గుర్నాథ్‌రెడ్డిపై సంచలన విజయం సాధించారు. అనంతరం 2014 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి రెండోసారి విజయం సాధించారు. తొలుత టీడీఎల్‌పీ ఉపనేతగా, ఆ తర్వాత టీడీ ఎల్‌పీ నేతగా పని చేశారు. అసెంబ్లీలో నిత్యం సమరం సాగిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఆ తర్వాత టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు. 2017లో టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొడంగల్‌లో పోటీ చేసిన రేవంత్ స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆరు నెలల్లో 2019లో మల్కాజ్‌గిరి ఎంపీగా గెలుపొందారు. ఆతర్వాత పరిణామాల్లో రెండేళ్ల క్రితం పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌పై అలుపెరగని పోరుసల్పి, రాష్ట్రంలో ప్రధాన నాయకుడిగా ఎదిగారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అన్నీతానై నడిపిన ఆయన 88 నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో ప్రసంగించారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలను విజయవంతం చేశారు. తాజా ఎన్నికల్లో కొడంగల్ నుంచి మరోసారి బంపర్ మెజార్టీతో గెలిచిన రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌లో ప్రతిష్ట పెరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 65 ఎమ్మెల్యే సీట్లు రావడం, ఎమ్మెల్యేల్లో సింహభాగం రేవంత్‌కు అనుకూలంగా ఉండడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.
ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు
కొడంగల్ నుంచి మూడోసారి గెలుపొందిన రేవంత్‌రెడ్డి సీఎంగా నియమితులవడం పట్ల ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులతో పాటు, ప్రజల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. పాలమూరు వాసే సీఎం కావడంతో జిల్లా అభివృద్ధికి అవకాశముంటుందని ఆశిస్తున్నారు. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు, పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతారనే ఆశాభావం ఇక్కడ వ్యక్తమవుతోంది.
సంబురం అంబరం
రేవంత్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం సీఎంగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో మునిగితేలుతున్నారు. బాణసంచా కాల్చడంతో పాటు కేక్‌లు కట్ చేశారు. స్వీట్లు పంచిపెట్టారు. రేవంత్ స్వగ్రామం వంగూరు మండలం కొండారెడ్డిపల్లితో పాటు మహబూబ్‌నగర్, కొడంగల్, గద్వాల, అచ్చంపేట, కొల్లాపూర్, నారాయణపేటలలో వేడుకలు మిన్నంటాయి.
Updated Date - 2023-12-05T23:48:32+05:30 IST