‘ప్రజాపాలన’ను పకడ్బందీగా నిర్వహించాలి
ABN, Publish Date - Dec 26 , 2023 | 10:40 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ కోయ శ్రీహర్ష
- ప్రజాపాలన కార్యక్రమంపై అధికారులకు అవగాహన
నారాయణపేట టౌన్, డిసెంబరు 26 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా అధికారులను ఆదేశించారు. 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణపై జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, మండల, గ్రామ, వార్డు అధికారులకు స్థానిక అంజనా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సూచనలు, సలహాలు చేశారు. జిల్లాలో వారం రోజులు కొనసాగే ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. 28న ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని, గ్రామాలు, వార్డుల్లో ఉదయం ఎనిమిది గంటలకు కార్యక్రమం ప్రారంభించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగ్ నియోజక వర్గంలోని కోస్గి, మద్దూర్, గుండుమల్, కొత్తపల్లి మండ లాలు మన జిల్లా పరిధిలో ఉన్నాయని ఆయా మండలాల్లో ప్రజాపాలన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఐదు పథకాలు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈ వారం రోజుల్లో ప్రజల నుంచి దరఖా స్తులు స్వీకరించాలన్నారు. ఇంటికి ఒకే దరఖాస్తు ఇచ్చి అదే ఐదు పథకాలకు సంబంధించి లబ్ధికోసం ఆధార్, రేషన్‌కార్డు జిరాక్స్ పత్రాలు తప్పక దరఖాస్తుతో జత చేయాలని కలెక్టర్ ప్రజలను కోరారు. ప్రతీ దరఖాస్తును సున్నితంగా పరిశీలించి స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం గ్రామాలు, వార్డులకు వెళ్లాలని, ముందుగానే గ్రామాలకు వెళ్లాలని ప్రజాపాలన నిర్వహనలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించొద్దు అన్నారు. గ్రామ సభలు నిర్వహించే ప్రదేశాల్లో తాగునీరు, టెంట్లు, క్యూలైన్ ఏర్పాటు చేయాలని, ప్రజాపాలనకు సంబంధించి గ్రామాల్లో ముందుగానే టాంటాం వేయించాలని సూచించారు. ప్రజాపాలనలో అధికారులకు తోడుగా తహసీల్దార్, ఎంపీడీవోలు, ఎస్‌ఐలు సమన్వయం చేసుకొని కార్యక్ర మాన్ని విజయవంతం చేసేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు జాన్ సుధాకర్, మురళి, మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 10:40 PM