వైభవంగా రథోత్సవం
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:10 PM
పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
- అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
మక్తల్, డిసెంబరు 26 : పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు అధిక సంఖ్య లో తరలివచ్చి పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించి దాసంగాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. జాతర మైదానం, రాంలీలా మైదానం, నెహ్రూగంజ్, రాఘవేంద్రకాలనీ, శబరికాలనీ, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో స్వామివారి దర్శనానికి మూడు, నాలుగు గంటల సమయం పట్టింది. ఉదయం నుంచి ఆలయం వద్ద భక్తుల రద్దీ కనిపించింది. పుర చైర్మన్ బాల్చెడ్ పావని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి స్వామివారికి తల నీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఊరేగించారు. అంతకు ముందు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికరెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, పుర చైర్‌పర్సన్ బాల్చెడ్ పావనీ, జడ్పీ చైర్‌పర్సన్ వనజ, వైస్ చైర్మన్ అఖిల, బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రాజుల ఆశిరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.
Updated Date - Dec 26 , 2023 | 11:10 PM