నీటి విడుదలపై ప్రతిపాదనలు
ABN, Publish Date - Dec 18 , 2023 | 10:21 PM
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద 2023-24 యాసంగికి ఇదివరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా సవరించిన షె డ్యూల్ ప్రకారం నీటిని ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపనున్నట్లు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశం నిర్ణయించింది.
గవర్నమెంట్ నిర్ణయం మేరకు నీరిస్తాం: కలెక్టర్ జి.రవినాయక్
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు సాగునీటిపై సలహా బోర్డు సమావేశం
మహబూబ్‌నగర్(కలెక్టరేట్), డిసెంబరు 18: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద 2023-24 యాసంగికి ఇదివరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా సవరించిన షె డ్యూల్ ప్రకారం నీటిని ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపనున్నట్లు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశం నిర్ణయించింది. ప్రాజెక్టు కింద ఆయకట్టు అంతటికి సాగు నీరు ఇచ్చే విషయంలో జూరాల ప్రాజెక్టు నుంచి అదనంగా ఒక టీఎంసీ నీటిని కోయిల్‌సాగర్‌కు ఎత్తిపోసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, అనుమతి వచ్చిన తర్వాతే నీటిని ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఉపాధి హామీ పథకం కింద ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల్లోని ఒండ్రు మట్టి, చెట్ల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు సూచనలు చేశారు. ముందుగా ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు మాట్లాడుతూ ప్రస్తుతం కోయిల్ సాగర్‌లో నీటి లభ్యత, దాని ద్వారా సాగయ్యే ఆయకట్టు, నీటి విడుదల షెడ్యూల్డ్‌ను తెలిపారు. కలెక్టర్ జి.రవినాయక్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, రైతులు సలహాలు చెప్పాలన్నారు. ముందుగా దేవరకద్ర శాసన సభ్యుడు జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు కింద గతంలో మాదిరిగానే ఈ యాసంగిలోనూ పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు జూరాల ప్రాజెక్టు నుంచి అదనంగా ఒక టీఎంసీ నీటిని లిఫ్ట్ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. జనవరి మొదటి వారంలో నీటిని విడుదల చేసి, ఏప్రిల్ మూడో వారం వరకు ఇచ్చేలా చూడాలన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణాసుధాకర్ రెడ్డి మాట్లాడుతూ యాసంగిలో ఎలాంటి సమస్యలు లేకుండా చివరి ఆయకట్టు వరకు నీరిచ్చేలా చూడాలన్నారు. నీరు వృథా కాకుండా సద్వినియోగం చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రాజెక్టు పూర్వపు చైర్మన్ ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టులో గత సంవత్సరం ఈ సీజన్‌లో 32 ఫీట్ల వద్ద నీరు ఉం దని, ఈ సంవత్సరం కూడా అంతే నీరు ఉ న్నందున నాలుగు నుంచి ఐదు తడుల నీరిచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాలువలను ఆధునికీకరించేందుకు క్రాస్ రె గ్యులేటరీలు ఏర్పాటు చేయాలన్నారు. మహబూబ్‌నగర్‌కు మిషన్ భగీరథ కోసం 0.36 టీఎంసీల నీటిని కోయిల్ సాగర్ ద్వారా కా కుండా శ్రీశైలం తిరుగు జాలల నుంచి ఇచ్చేలా భవిష్యత్‌లో చర్యలు తీసుకోవాలని కోరారు.
కాలువల్లో ఒండ్రును తొలగించాలి
సమావేశానికి హాజరైన నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, పలువురు రైతులు మాట్లాడుతూ ప్రాజెక్టు కింద పాత ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్నారు. కుడి, ఎడమ కాలువల్లో పేరుకు పోయిన ఒండ్రును, చెట్లను తొలగించాలన్నారు. కుడి కాలువ కింద 3, 8, 19 స్లూయి్‌సలలో చెట్లు, ఇతర అడ్డంకులను తొలగించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద చెట్లు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. చిన్న నీటి పారుదల శాఖ సూపరింటెండెంట్ చక్రధర్ మాట్లాడుతూ నారాయణపూర్ నుంచి ఇన్‌ఫ్లో తగ్గిపోతుందని, వేసవిలో ఉండదని, కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద సాధ్యమైనంతవరకు ఆరుతడి పంటలు వేసుకోవాలని అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్, ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, ఇరిగేషన్ ఈఈ ప్రతాప్ సింగ్ తమ అభిప్రాయాలను తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రాజెక్టు కింద నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాలువల్లో ఒండ్రు, చెట్ల తొలగింపునకు క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించి, అంచనాలు రూపొందించాలని డీఆర్‌డీవో యాదయ్యను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు, ఆర్డీవో అనిల్ కుమార్, నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 10:21 PM