ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సొంతింటిపై ఆశలు

ABN, Publish Date - Dec 18 , 2023 | 10:19 PM

సొంతింటి కల నెరవేర్చుకోవడంపై పేద, మధ్యతరగతి వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవలే కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో ఆపథకంపై ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

దివిటిపల్లిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు(ఫైల్‌)

ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు

గృహలక్ష్మి పథకంపై సందిగ్ధం

పాలమూరులో తెరపైకి పాత పట్టాలు

ఇళ్లైనా ఇవ్వాలి.. లేకపోతే స్థలమైనా చూపాలని విన్నపాలు

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సొంతింటి కల నెరవేర్చుకోవడంపై పేద, మధ్యతరగతి వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవలే కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో ఆపథకంపై ఆశావహులు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం కింద స్వీకరించిన దరఖాస్తులను యధాతథంగా ఆమోదిస్తారా? లేక ఇందిరమ్మ పథకానికి ప్రత్యేకంగా మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తారా? అనే అంశం తేలాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఈ పథకంపై ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలేవీ రాకపోయినా ప్రజలు మాత్రం ప్రభుత్వ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. సోమవారం జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ప్రజావాణిలో ఇళ్ల కోసం దరఖాస్తులు ఇస్తున్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో 2014కు ముందు ఇందిరమ్మ పథకంలో ఇళ్ల స్థలాలు పొందిన పేదలు ఇప్పుడు తమకు తమ స్థలాల్లో ఇళ్లు కట్టించాలని కోరుతూ ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తుండటం గమనార్హం.

సందిగ్ధంలో గృహలక్ష్మి లబ్ధిదారులు

గత ప్రభుత్వం 2023 బడ్జెట్‌లో పేర్కొన్న ప్రకారం సొంత జాగా ఉన్న పేదలకు గృహలక్ష్మి పథకం కింద రూ.మూడు లక్షల నిధులివ్వాలని నిర్ణయించింది. ఈ పథకం కింద ఆగస్టులో దరఖాస్తులు స్వీకరించారు. అప్పటి ఎమ్మెల్యేల సూచనల మేరకు సెప్టెంబరులో నియోజకవర్గానికి 1,000 నుంచి 1,200 మంది వరకు లబ్ధిదారులను ఎంపిక చేసి, వారికి ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలు అందజేశారు. కొందరు లబ్ధిదారులు ఇళ్లను పాక్షికంగా ప్రారంభించారు. అయితే ఆ తర్వాత ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయి. బిల్లులు మాత్రం దాదాపు ఎవరికీ అందలేదు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ఈ పథకం కింద భారీగా దరఖాస్తులు వచ్చినప్పటికీ పరిశీలనల అనంతరం హౌజింగ్‌ అధికారులు అర్హత కలిగిన వారిగా గుర్తిస్తూ 26,520 మందిని అర్హులుగా గుర్తించి నమోదు చేశారు. వీరిలోనే తొలి దశలో కొందరికి మంజూరు పత్రాలు అందజేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారడం, ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రకటించడంతో ఈ గృహలక్ష్మి పథకం ఉన్నట్లా? లేనట్లా? అనే అంశం తేలాల్సి ఉంది. అయితే ఇందిరమ్మ పథకంలో కొత్తగా రూపొందించే మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపిక ఉంటుందనే చర్చ కొనసాగుతోంది.

ఇళ్ల కోసం ‘ప్రజావాణి’ల్లో దరఖాస్తుల వెల్లువ

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తమకు ఇంటిని మంజూరు చేయాలని కోరుతూ పేద వర్గాల మహిళలు ప్రజావాణిలో ఉన్నతాధికారులకు దరఖాస్తులు అందిస్తున్నారు. సోమవారం ఉమ్మడి జిల్లాలోని ఐదు కలెక్టరేట్ల వద్ద జరిగిన ప్రజావాణిల వద్ద ఈ పరిస్థితి కనిపించింది. ప్రతీ ఐదు దరఖాస్తుల్లో ఒక దరఖాస్తు ఇంటి కోసమే కావడం ఈపథకంపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది.

పాలమూరులో తెరపైకి పాత పట్టాలు

మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఇందిరమ్మ పథకం కింద గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాల అంశం మళ్లీ తెరమీదకు వస్తోంది. ఈ పథకం కింద పట్టణంలోని క్రిస్టియన్‌పల్లి సర్వే నెంబర్‌ 523లో అప్పటి ప్రభుత్వం 2011-12లో 1,250 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 60 చదరపు గజాల ఇళ్ల స్థలాలు పొజిషన్‌తో సహా అందజేశారు. లే అవుట్‌లో మరో 300 ఖాళీ స్థలాలు కూడా అప్పట్లో గుర్తించి, నమోదు చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పాటైన ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకాన్ని అమలు చేయడంతో ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆస్కారం లేకుండా పోయింది. ఈ సర్వే నెంబర్‌లో కూడా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టేందుకు ప్రభుత్వం ఇక్కడ స్థలాన్ని ఎంపిక చేసింది. ఇక్కడ పట్టాలు పొందిన పేదలకే ఇక్కడ ఇళ్లిస్తామన్న హామీని అప్పటి కలెక్టర్‌ సహా ఇతర ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిఽధులు ఇవ్వడంతో సుమారు 650 మంది పేదలు తమ పట్టాలను 2016లో సరెండర్‌ చేశారు. ఆ సమయంలో పట్టా సరెండర్‌ చేసిన ప్రతీ ఒక్కరికి ఒక రశీదు కూడా తహసీల్దార్‌ సంతకాలతో అందజేశారు. అనంతరం జిల్లాలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ అర్హుల జాబితాను రూపొందించిన అప్పటి కలెక్టర్‌ ఈ పట్టాలు సరెండర్‌ చేసిన వారి పేర్లు కూడా జాబితాలో చేర్చారు. అయితే ఇక్కడ నిర్మాణమైన 310 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లల్లో వీరికి పది మందికి కూడా ఇళ్లు దక్కలేదు. దీంతో వీరంతా తాజాగా తమకు పాత పట్టాల పేరుతో ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తున్నారు. స్థానికంగా ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు.

పట్టాలిచ్చిన చోటే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి

మాకు 2012లో క్రిస్టియన్‌పల్లిలో ఇంటి స్థలం పొజిషనతో సహా పట్టా ఇచ్చా రు. ఆతర్వాత ప్రభుత్వం మారిపోవడంతో ఇళ్లు ఇవ్వలేదు. 2016లో మా స్థలం వాపస్‌ తీసుకొని మాకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లిస్తామని కలెక్టర్‌ చెప్పారు. కానీ ఇల్లు రాలేదు. మాకు కనీసం ప్లాటయినా లేకుండా చేశారు. ఈ ప్రభుత్వమైనా మా ఇళ్ల స్థలంలో మాకు ఇళ్లివ్వాలని కోరుతూ దరఖాస్తు చేశాం.

- జహంగీర్‌, పాత పాలమూరు

మా జాగా కబ్జా చేశారు

మాకు ఇల్లు లేదు. మేం అద్దె ఇంట్లో ఉంటున్నాం. క్రిస్టియన్‌పల్లిలో ఇంటిస్థలం ఇచ్చారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. మా జాగా మాత్రం ఎవరో కబ్జా చేశారు. మాకు డబ్బులు లేకపోవడం వల్ల మేం ఇల్లు కట్టుకోలేకపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి.

- సుల్తానా బేగం, మేకలబండ, మహబూబ్‌నగర్‌

మాకిచ్చిన జాగా లేకుండా చేశారు

మేం కూలీ చేసుకొని బతికేవాళ్లం. మాకు అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇళ్ల జాగా ఇచ్చింది. మావద్ద డబ్బు లేకపోవడంతో మేం ఇల్లు కట్టుకోలేకపోయాం. ఆతర్వాత మా జాగాలో ఎవరో వేరే వాళ్లు ఇల్లు కట్టుకున్నారు. నాకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. మా పిల్లలు కూలీపనులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం మా జాగా మాకు ఇప్పించాలి.

- జహీరాబీ, మేకలబండ, మహబూబ్‌నగర్‌

Updated Date - Dec 18 , 2023 | 10:19 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising