అవినీతికి తావిస్తే చర్యలు
ABN, Publish Date - Dec 30 , 2023 | 11:02 PM
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన కొనసాగుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం అధికారులు డబ్బు ఆశిస్తూ అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు.
జనవరి 15వ తేదీలోపు ప్రతీ ఇంట్లో సిలిండర్ ఉండాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, డిసెంబరు 30: కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన కొనసాగుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం అధికారులు డబ్బు ఆశిస్తూ అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. శనివారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ఆరో వార్డులో కౌన్సిలర్ మేకల రమ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్ర జాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి కాలనీ మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రజాపాలన కార్యక్రమానికి హాజరైన మహిళలతో మంత్రి జూపల్లి నేరుగా మాట్లాడారు. రెండు సంవత్సరాల నుంచి సిలిండర్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంత వరకు ఇవ్వలేదని, రూ.4,500 అడుగుతున్నారని రాములమ్మ మంత్రి జూపల్లి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి వెంటనే సంబంధిత భారత్ గ్యాస్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సిలిండర్ కనెక్షన్ కోసం అధిక ధరలు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనవరి 15వ తేదీలోపు ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్ ఉండేలా ప్రజాప్రతినిధులే చొరవ చూపాలని మంత్రి చెప్పారు. లేదంటే వారికి భవిష్యత్ ఎన్నికల్లో టికెట్లు రావని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సంక్షేమ పథకాల అమలు కోసం అధికారులు ఎవరైనా డబ్బులు ఆశిస్తే బాధితులు నేరుగా తనకు ఫిర్యాదు చేయొచ్చని, ప్రజాపాలన దరఖాస్తులను విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
భూమి విరాసత్ కోసం లంచం అడిగారు
కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లిలో తమ భూమి విరాసత్ చేసేందుకు రెవెన్యూ అధికారుల చుట్టూ తొమ్మిది నెలలుగా తిరిగినా ఫలితం లేదని, విరాసత్ చేసేందుకు లంచం అడిగారని ఆరో వార్డుకు చెందిన సరిత ప్రజా పాలనలో మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే కొన్ని డబ్బులు ఇచ్చానని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. మంత్రి స్పందిస్తూ వెంటనే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, ఆధారాలు తనకిస్తే విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానన్నారు. రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడటంపై తహసీల్దార్ శ్రీకాంత్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో నాగరాజు, ఎంపీపీ భోజ్యానాయక్, మునిసిపల్ వైస్ చైర్‌పర్సన్ మహెముదాబేగం, కౌన్సిలర్ శ్రీదేవి గౌతంగౌడ్, నరసింహరావు, ఎండీ నయీమ్, మునిసిపల్ కమిషనర్ సొంటె రాజయ్య, తహసీల్దార్ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పగిడాల శ్రీనివా్‌సరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ పస్పుల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
కొల్లాపూర్‌ను అభివృద్ధి చేస్తా
పెద్దకొత్తపల్లి: పెద్దకొత్తపల్లి మం డలం దేవునితిర్మలాపూర్ గ్రామంలోనూ ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో శాయశక్తులా పని చేస్తానని అన్నారు. అంతకు ముందు గ్రామంలోని వేంకటేశ్వరస్వామికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.
Updated Date - Dec 30 , 2023 | 11:02 PM