ఎన్నికలకు ముందే కిషన్‌రెడ్డి అస్త్రసన్యాసం
ABN, First Publish Date - 2023-11-06T04:54:26+05:30
‘‘బక్కపలుచని కేసీఆర్‌ను ఓడిచేందుకు ఢిల్లీ నుంచి మహామహులు దిగుతున్నారు.
కాంగ్రెస్, బీజేపీల్లో సమర్థ నేతలే లేరు
కేసీఆర్‌ను ఓడించేందుకు పొరుగు నేతలు
ఎందరు తీస్మార్‌ఖాన్‌లు వచ్చినా బేఫికర్
గుజరాత్, ఢిల్లీ దొరలు అవసరమా?
ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ వ్యాఖ్యలు
ఆమనగల్లు/షాద్‌నగర్ అర్బన్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘‘బక్కపలుచని కేసీఆర్‌ను ఓడిచేందుకు ఢిల్లీ నుంచి మహామహులు దిగుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో సమర్థ నాయకులు లేక పొరుగు రాష్ట్రాల నుంచి మందల్లా వస్తున్నారు.ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, 15 మంది బీజేపీ ముఖ్యమంత్రులు, ఇతర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నుంచి సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, ఖర్గే, సిద్దరామయ్య, డీకే శివకుమార్ తదితరులు ఇక్కడికి ప్రచారానికి వస్తున్నారు. అయినా సింహం సింగిల్‌గా వస్తుంది. కేసీఆర్ ప్రజాభిమానం ముందు ఎంత మంది తీస్మార్‌ఖాన్‌లు వచ్చినా ఏమీ చేయలేరు’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కల్వకుర్తి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో, షాద్‌నగర్ చౌరస్తాలో అభ్యర్థి అంజయ్యయాదవ్‌తో కలిసి నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. ఒక్క చాన్స్ ఇవ్వండి అంటున్న కాంగ్రె్‌సకు గతంలో ప్రజలు 11సార్లు ఇస్తే ఏం సాధించారని ప్రశ్నించారు. వారి పాలనలో కరెంట్ లేక రైతులు, తాగు నీరు దొరకక మహిళలు అష్టకష్టాలు పడ్డారన్నారు. రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. కాంగ్రెస్ నేతలు ఐదు గంటల కరెంటు చాలు అనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న యుద్ధం అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ లేకుండాపోయిందని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎన్నికలకు ముందే అస్త్రసన్యాసం చేశారన్నారు. యుద్ధం చేసే ధైర్యం లేక బరిలో నిలువకుండా పారిపోయాడని విమర్శించారు. తెలంగాణలో గులాబీ జెండా ఉండగా గుజరాత్, ఢిల్లీ రాజుల పాలన మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ ఒంటరి పోరాటమే చేసి, మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - 2023-11-06T04:54:27+05:30 IST