మిర్చిలో తెగులు.. రైతుల్లో దిగులు
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:44 PM
గత ఏడాది సిరులు కురిపించిన మిర్చి ఈ ఏడాది కూడా అదే స్థాయిలో లాభాలు తెచ్చి పెడుతుందని ఆశపడిన రైతులకు తీవ్ర నిరాశే ఎదురైంది..
తెగుళ్లతో ఎండిపోయిన తోటలు
తుఫాన్‌తో పంటకు తీవ్ర నష్టం
భారీగా పెట్టుబడులు.. నిరాశాజనకంగా దిగుబడులు
జూలూరుపాడు, డిసెంబరు 26: గత ఏడాది సిరులు కురిపించిన మిర్చి ఈ ఏడాది కూడా అదే స్థాయిలో లాభాలు తెచ్చి పెడుతుందని ఆశపడిన రైతులకు తీవ్ర నిరాశే ఎదురైంది.. గత ఏడాది అనుభవంతో అధిక విస్తీర్ణంలో మిరపసాగు చేసిన రైతుల అంచనాలు ఒక్కసారిగా తా రుమారయ్యాయి. అధిక పెట్టుబడులు పెట్టి మిర్చి పంట సాగు చేయగా వాతావరణ పరిస్థితుల కారణంగా పంట తెబ్బతింది. తెగుళ్లు ఆశించి పంట కాస్త ఎండిపోతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. భద్రాద్రి జిల్లాలో ఈ ఏడాది ఖరీ్‌ఫలో 35వేల ఎకరాల్లో మిరపసాగు చేపట్టారు. ఎకరానికి ఇప్పటికే లక్ష రూపాయల నుంచి రూ.2లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. కాగా పంటకు తెగుళ్లు ఆశించడంతో వివిధ రకాల మందులను పిచికారి చేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరానికి రెండు క్వింటాళ్లైనా పంట వస్తుందో రాదోనని అన్నదాతలు కలవరపడుతున్నారు.
ఒక వైపు మిచౌంగ్ ముంచగా.. మరో వైపు తెగుళ్లు
డిసెంబరు నెలలో వచ్చిన మిచౌంగ్ తుఫాన్ ప్రభావం మిరప పంటపై తీవ్రంగా పడింది. పంటను తుఫాన్ నిండా ముంచింది. వర్షానికి ఈదురు గాలులు తుడుకావడంతో మొక్కలు విరిగినేలరాలిపోయాయి. దీంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. అష్టకష్టాల పడి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి పైర్లను కాపాడుకునే సమయంలో పగపట్టినట్లుగా తుఫాన్ రైతులను దెబ్బతీసింది. ఇదిలా ఉండగా వేరుకుళ్లు, ఆకుముడత, నల్లి, గుబ్బ తెగుళ్లు పంటను ఆశించడంతో మొక్కలు ఎండిపోయాయి. తెగుళ్ల బెడద దిగుబడులపై ప్రభావం చూపడంతో రైతులు కుదేలవుతున్నారు.
అదుపులోకి రాని తెగుళ్లు..
జూలూరుపాడు, సుజాతనగర్, టేకులపల్లి, పాల్వంచ, చంద్రుగొండ, అన్ననపురెడ్డిపల్లి తదితర మండలాలకు చెందిన రైతులు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంట చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు మిరప పంటను తొలగించారు. కొంతమంది రైతులు తిరిగి కొత్త మిరప మొక్కలను కొనుగోలు చేసి నాటారు. కాగా రెండోసారి కూడా తెగుళ్లు ఆశించడంతో వాటి నివారణకు మందులు పిచికారి చసినా అదుపులోకి రాకపోవడంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితిలో రైతులు దిగాలు చెందుతున్నారు. రెండోసారి మిరపసాగు చేసిన తెగుళ్ల బెడద వదల్లేదు. దీంతో కొంతమంది రైతులు మిరప తోటలను దున్నేసి మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. అదనపు ఖర్చులు చేపట్టినప్పటికీ ఫలితం లేదని రైతులు వాపోతున్నారు.
ఐదు ఎకరాల మిర్చిపంట తొలగించాను..:
దుద్దుకూరి లక్ష్మణరావు రైతు, వెంగన్నపాలెం
మిర్చికి గత ఏడాది మార్కెట్‌లో మంచి డిమాండ్ పలకడంతో 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ఈ ఏడాది మిరపసాగు చేపట్టాను. ఎకరానికి రూ.1.50లక్షల చొప్పున పెట్టుబడి పెట్టాను. పంటకు గుబ్బతెగులు ఆశించడంతో ఎండిపోయింది. వైరస్ నివారణ కోసం మందుల కొనుగోలుకు రూ.5లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ ఉపయోగం లేకుండపోయింది. మిరప పంటను దున్నేసి మొక్కజొన్న పంట సాగు చేశారు.
కౌలుకు తీసుకుని మిరపసాగు చేశాను:
భూక్యా జవహర్‌లాల్, రైతు కొమ్ముగూడెం
మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మిరప సాగు చేపట్టాను. పంటకు వేరుకుళ్లు గుబ్బతెగుళ్లు ఆశించి దెబ్బతింది. ఇప్పటి వరకు రూ.4లక్షలు పెట్టుబడి పెట్టాను. దిగుబడులు వచ్చే అవకాశం లేదు. కనీసం పెట్టుబడులు దక్కుతావో లేదోనని ఆందోళనగా ఉంది. తెగుళ్లు మిరప రైతులను నిండా ముంచాయి.
Updated Date - Dec 26 , 2023 | 11:44 PM