ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Revanth Reddy: కేసీఆర్‌ కుటుంబం తినేది రక్తపు కూడు

ABN, Publish Date - Dec 28 , 2023 | 03:18 AM

కేసీఆర్‌ కుటుంబం దగ్గర ఉన్న ఆస్తి.. స్వేదం చిందించి సంపాదించింది కాదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు.

ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పిచేసి సంపాదించారు

లక్ష కోట్లు అవినీతి చేసి.. తిరిగి ఇచ్చింది రూ.లక్ష మాత్రమే!

బాగున్న భవనాలను కూలగొట్టి కడితే సంపద సృష్టించినట్లా?

అధికారం కోల్పోయిన బాధతో మాట్లాడుతున్న కేటీఆర్‌

2024 డిసెంబరు 9లోపు 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

ఖజానాలో చిల్లి గవ్వలేదు.. కేసీఆర్‌ అంతా తుడిచి తీసుకెళ్లారు

లంకె బిందెలు ఉన్నాయనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయి

విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని రప్పించేందుకే ప్రజా పాలన

గ్రామసభలు ముగిశాక కూడా దరఖాస్తులు స్వీకరిస్తాం

ప్రజాపాలన దరఖాస్తు లోగో ఆవిష్కరణలో ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ కుటుంబం దగ్గర ఉన్న ఆస్తి.. స్వేదం చిందించి సంపాదించింది కాదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పిచేసి సంపాదించుకున్నారని, వారు తినేది రక్తపు కూడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూ.లక్ష కోట్ల అవినీతి చేశారని, తిన్నదంతా కక్కిస్తామని ప్రకటించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రజా పాలన అభయ హస్తం గ్యారెంటీలకు శ్రీకారం చుట్టే కార్యక్రమ ‘లోగో’ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రజావాణి కార్యక్రమానికి ఒక ఆడబిడ్డ వచ్చింది.. మీరు పట్టించుకోకపోతే నేను పట్టించుకొని లక్ష రూపాయలు ఇచ్చానంటూ కేటీఆర్‌ ప్రకటించినట్లు చూశాను. కేటీఆర్‌! నీవు అక్రమంగా సంపాదించిన రూ.లక్ష కోట్లలో నుంచి ఇప్పుడు నీ మెడలు వంచి లక్ష రూపాయలు పేదలకు ఇప్పించగలిగామంటే ప్రజావాణి విజయవంతమైనట్లే కదా!’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేటీఆర్‌ అక్రమంగా సంపాదించిన రూ.లక్ష కోట్ల నుంచి ఒక లక్ష రికవరీ అయ్యిందని, ఇంకా రూ.99,99,999 లక్షలు ఆయన వద్దే ఉన్నాయని తెలిపారు. మిగిలినవి కూడా పంచాల్సిన గత్యంతరంలేని పరిస్థితి వారికి కల్పిస్తామని, దోచుకున్న సొమ్మును పంచక తప్పదని స్పష్టం చేశారు. మేనేజ్‌మెంట్‌ కోటాలో రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్‌కు ఏమీ తెలియదని, అసెంబ్లీలో టైమ్‌ ఇస్తే మాట్లాడలేదని, ఇంటికి పోయి ఏదో అరుస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బావాబావమరుదుల తాపత్రయం తప్ప.. ఒక్క సభ్యుడు కూడా వాళ్లు మాట్లాడేదాన్ని సమర్థించలేదని చెప్పారు.

ఉన్న దానిని కూలగొట్టి కట్టడం సంపదా?

పదేళ్లలో సంపద సృష్టించామని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని, కానీ.. బాగా ఉన్నవాటిని కూలగొట్టి కొత్తవి కట్టి సంపద సృష్టించినట్లు చెబుతున్నారని సీఎం రేవంత్‌ ఎద్దేవా చేశారు. పాత సెక్రటేరియట్‌ గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడిందని, 2012లో ఎల్‌అండ్‌ టీ కంపెనీ కట్టిన భవనాలు కూడా ఉన్నాయని, 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, రాష్ట్రం విడిపోయిన తర్వాత సరిపోను భవనాలు ఉండేవని తెలిపారు. అద్దెభవనాల్లో కొనసాగుతున్న ఇతర ప్రభుత్వ కార్యాలయాలకో, హాస్పిటల్‌కో, ఇతర అవసరాలకో వినియోగించుకోవాల్సి ఉండగా దానిని నేలమట్టం చేశారని విమర్శించారు. ఒకవేళ పాత సెక్రటేరియట్‌ భవనం వారికి అచ్చిరాలేదనుకుంటే.. కొత్తగా వేరే చోట సెక్రటేరియట్‌ కట్టాల్సి ఉండేదని అన్నారు. ఉన్నదానిని కూలగొట్టి కొత్తది కడుతున్నారంటేనే దాని వెనుక ఉద్దేశమేంటో అర్థం చేసుకోవాలన్నారు. కేటీఆర్‌ అధికారం కోల్పోయిన బాధలో ఏవేవో మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘మందు కల్లు తాగినోడికి సడెన్‌గా మందు కల్లు దొరకకపోతే.. పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తరు. అప్పుడు కుటుంబ సభ్యులే తాళ్లు కట్టి మంచానికి కట్టేస్తారు. అధికారం పోయిన విత్‌డ్రాయల్‌ సిమ్టమ్స్‌తో కేటీఆర్‌ పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. కొంతకాలం తర్వాత కుటుంబ సభ్యులే ఆయనను కాళ్లు మంచానికి కట్టే పరిస్థితి వస్తుంది. అధికారం కోల్పోయిన బాఽధతోనో, భయంతోనో ఆయనమాట్లాడుతున్నారు’’ అని రేవంత్‌ ఎద్దేవా చేశారు.

షాడో టీమ్‌తో ఏం చేస్తారు?

అసెంబ్లీలో మైకు ఇస్తేనే కేటీఆర్‌ మాట్లాడలేదని, నిర్ణయాలను విశ్లేషించమని అవకాశమిస్తే వినియోగించుకోలేదని సీఎం రేవంత్‌ అన్నారు. ఇప్పుడు వెనక షాడో టీమ్‌ పెట్టుకొని చేసేదేముందని ప్రశ్నించారు. ‘‘నిన్నటివరకు మంత్రులుగా పనిచేసిన వాళ్లు మీ వద్దనే ఉన్నారు కదా! వాళ్లనే పనిచేయమనండి. అప్పుడు ఒళ్లు వంచలేదు. ఇప్పుడైనా ఒళ్లు వంచి ప్రజలకోసం పనిచేయండి.’’ అని రేవంత్‌ సూచించారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణ పనులు, అవినీతిపై విచారణకు ఆదేశించామని, అలాగే ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం, యాదాద్రి- భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టుల మీద కూడా జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించామని తెలిపారు. రెవెన్యూ రికవరీ యాక్టుతో అంతా రికవరీ అవుతుందని అన్నారు. ఎల్‌అండ్‌టీ పాత్ర ఏంటో, హరీశ్‌రావు, కేసీఆర్‌, అధికారుల పాత్ర ఏంటో అన్నీ జ్యుడీషియల్‌ విచారణలో బయటకి వస్తాయన్నారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఇంకా 30 రోజులు కూడా కాలేదు. ఇప్పుడే ఏమైంది? ముందుంది ముసళ్ల పండుగ’’ అని వ్యాఖ్యానించారు.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఉంటేనే నియామకాలు

పరీక్షల నిర్వహణ, ఫలితాలు ప్రకటన, ఉద్యోగ నియామకాలు చేయాలంటే తప్పనిసరిగా టీఎ్‌సపీఎస్సీకి చైౖర్మన్‌ ఉండాలని, లేకపోతే ఈ ప్రకియ్ర జరగకపోవడంతోపాటు చట్టపరంగా చెల్లదని సీఎం తెలిపారు. గత చైర్మన్‌, సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించారని, గతంలో గవర్నర్‌ వద్దకు వచ్చిన ఫిర్యాదులమేరకు వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. ఆ తర్వాత కొత్త చైర్మన్‌, సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, తాము విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగా ఏడాది తిరిగేలోపు 2024 డిసెంబరు 9వ తేదీ లోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీలను భర్తీచేస్తామని ప్రకటించారు.

ప్రజావాణి పటిష్టంగా పనిచేస్తోంది..

ప్రజావాణి వ్యవస్థ పటిష్ఠంగా పనిచేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అక్కడ ఒక ఐఏఎస్‌ అధికారి ఉన్నారని, శాఖలవారీగా అప్లికేషన్లు పంపిస్తున్నారని పేర్కొన్నారు. సెల్‌ నంబరుకు సమాచారం ఇస్తున్నామని వివరించారు. స్థానికంగా పరిష్కరించే సమస్యలపై దరఖాస్తులు హైదరాబాద్‌లో ఇచ్చినా తిరిగి ఎమ్మార్వో ఆఫీసుకే పంపించాల్సి ఉంటుందన్నారు. రైతుబంధు నిధుల జాప్యంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘రైతుబంధు నిధులను గత ప్రభుత్వం మార్చి వరకు రైతుల ఖాతాల్లో జమచేసింది. ఈసారి డిసెంబరు 9 రోజే జమ చేసినం. కానీ, విచిత్రంగా.. బావా బావమరుదులు తోక తెగిపడిన బల్లుల్లాగా దుంకులాడుతున్నారు. అన్ని ఖాళీ చేసిపోయారు. ఇక్కడ ఏమీలేదు. మేము లంకె బిందెలున్నాయనుకొని వస్తే.. ఖాళీ కుండలు కనిపిస్తున్నాయి. కేసీఆర్‌ అంతా ఊడ్చి పెట్టుడు కాదు.. తూడ్చి పెట్టారు. ఖజానా మొత్తం డ్రై అయిపోయింది’’ అని రేవంత్‌ అన్నారు. అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధులకోసం ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశామని, ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పటానికి శ్వేతపత్రం విడుదలచేశామని పేర్కొన్నారు.

రైతుబంధుకు సీలింగ్‌ లేదు

రైతుబంధు పథకానికి ఇప్పటివరకు ఎటువంటి సీలింగ్‌ విధించలేదని సీఎం రేవంత్‌ చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల్లో చర్చ పెడతామని, అందరి అభిప్రాయాలు తీసుకొని ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు వంద రోజుల సమయం ఉందన్నారు. గవర్నర్‌తో సంబంధాలు ఇప్పుడు ఉన్నట్లుగానే భవిష్యత్తులోనూ కొనసాగుతాయన్నారు. కేంద్రాన్ని బుల్లెట్‌ ట్రెయిన్‌ అడగలేదని బీఆర్‌ఎస్‌ నేత వినోద్‌కుమార్‌ చేసిన విమర్శలపై సీఎం స్పందిస్తూ.. ఓసారి అద్దంలో ముఖం చూసుకొని మాట్లాడాలన్నారు. ఇక రేషన్‌ కార్డు లేకుండా సంక్షేమ పథకాలను అమలుచేయటం కష్టమని, కానీ రేషన్‌ కార్డులు లేనివారికి ఇస్తామని అన్నారు. ప్రధాని మోదీని తెలంగాణ ప్రజల తరఫున కలిశామని, తమకు ఏ రహస్య ఎజెండా లేదని రేవంత్‌ స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై అడిగామే తప్ప.. కేసులు మాఫీ చేయాలని గానీ, అవినీతి చేసిన వాళ్లని ఉపేక్షించమని గానీ అడగలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోడ్రైవర్ల ఆదాయానికి గండిపడుతుందని ఊహించే.. ఆర్థిక సాయం ప్రకటన చేశామని సీఎం గుర్తు చేశారు. అవినీతిని, దుబారాను నియంత్రిస్తే.. రాష్ట్రం మిగులు బడ్జెట్‌లోకి వస్తుందన్నారు. కేసీఆర్‌ సర్కారు అవినీతి, దుబారాతోనే నష్టం జరిగిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ రెండు చేయదని చెప్పారు. కేంద్రంతో పేచీలు పెట్టుకోబోమని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం ఉండదు..

ప్రజలు ప్రయాణ ఖర్చులు, ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటూ హైదరాబాద్‌ రావాల్సిన అవసరం ఇకపై ఉండదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు గ్రామసభల ద్వారా ప్రజల మధ్యకు వస్తారని చెప్పారు. ప్రతి అధికారి రోజుకు రెండు గ్రామాలకు వెళ్తారని, జనాభా ఎక్కువ ఉన్న గ్రామాల్లోనైతే.. ఎక్కువ కౌంటర్లు తెరిచేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. 2023 డిసెంబరు 28 నుంచి 2024 జనవరి 6వ తేదీ వరకు ప్రతి గ్రామ పంచాయతీలో కార్యదర్శినిగానీ, అంగన్‌వాడీ టీచర్‌ను గానీ అందుబాటులో ఉంచుతామని సీఎం చెప్పారు. గ్రామసభలో దరఖాస్తులు ఇవ్వలేకపోయినవారు.. ఈ పనిదినాల్లో ఏరోజైనా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇంకా ఎవరైనా నిజమైన లబ్ధిదారులు మిగిలి ఉంటే.. ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తులు ఇచ్చేలా వెసులుబాటు కల్పిస్తామని, గ్రామసభల్లో దరఖాస్తులు ఇవ్వకపోతే సంక్షేమపథకాలు అందవేమోననే ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. కాగా, ప్రజాపాలన దరఖాస్తు ఫారాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి సందేశం పోస్టర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రజాపాలన పోస్టర్‌ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు.

ప్రజలకు మేలు కోసం మీడియా సహకరించాలి..

రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి మీడియా కూడా సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథిలా, సమస్యల పరిష్కార సారథులుగా మారాలని కోరారు. గత ప్రభుత్వం మీడియాపై విధించిన ఆంక్షలను, సచివాలయంలోకి ప్రవేశాన్ని నిషేదించిన విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. సచివాయలయంలో ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి సమావేశంలో కూర్చుంటామని ఊహించి ఉండరని, తాను ప్రజాప్రతినిఽధిగా (ఎంపీ) ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకుంటే సచివాలయం బయటి నుంచి వెళ్లిపోయిన అనుభవం తనకు ఉందని గుర్తు చేశారు. భవిష్యత్తులో సెక్రటేరియట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మీడియా సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు.. ప్రభుత్వం తరఫున ఏ అధికారిక కార్యక్రమం చేపట్టినా ఇక్కడే పత్రికా సమావేశం నిర్వహించేలా మీడియా కాన్ఫరెన్స్‌ హాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం మీడియాకు స్వేచ్ఛను ఇస్తుందని, మీడియా కూడా ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా చాలాకాలం నుంచి పేరుకుపోయాయని, త్వరలోనే వాటిపై దృష్టి పెడతామని హామీ ఇచ్చారు.

గడీల పాలనను ప్రజల ముంగిట్లోకి తెస్తున్నాం..

తండాలు, గూడేలు, మారుమూల పల్లెల్లోని నిరుపేదలకు ప్రభుత్వ పథకాలను చేరవేసే లక్ష్యంతోనే ప్రజా పాలన గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్‌ తెలిపారు. నిస్సహాయులకు సాయం అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంతో ప్రజలను హైదరాబాద్‌కు రప్పించుకోకుండా.. గడీల ముందు, గడీల లోపల ఉన్న ప్రభుత్వాన్ని ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రజా పాలన అభయ హస్తం గ్యారెంటీలకు శ్రీకారం చుట్టే కార్యక్రమ ‘లోగో’ను ముఖ్యమంత్రి ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ప్రజావాణిలో తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు వేలాది మంది ప్రజలు సుదూర ప్రాంతాల వ్యయ ప్రయాసలకోర్చి నుంచి దరఖాస్తులు చేతబట్టుకొని ప్రజాభవన్‌కు ముందురోజు రాత్రే తరలి వస్తున్నారని తెలిపారు. ఇందుకు కారణం.. పదేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం, పరిపాలన ప్రజల వద్దకు చేరకపోవడమేనని అన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వాలు మోయలేనంత భారంగా మారాయని, వారంలో రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమం చేపడితే దాదాపు 24 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటన్నింటిపై విశ్లేషించి ఆయా శాఖలకు పంపించి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించుకోవడం కాకుండా.. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా వారికి న్యాయం చేయవచ్చని భావించి ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు.

Updated Date - Dec 28 , 2023 | 08:30 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising