రెవెన్యూ ఉద్యోగులను బద్నాం చేసి భూములను మాయం చేసిన కేసీఆర్
ABN, First Publish Date - 2023-12-11T03:42:48+05:30
మాజీ సీఎం కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగులను బద్నాం చేసి.. అన్ని రకాల భూములను మాయం చేశారని ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. సమాజం ముందు రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించి భూములను కాజేశారని ఆరోపించారు.
భూ పరిపాలనలో సమూల మార్పు రావాలి: కోదండరాం
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగులను బద్నాం చేసి.. అన్ని రకాల భూములను మాయం చేశారని ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. సమాజం ముందు రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించి భూములను కాజేశారని ఆరోపించారు. నేడు ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, ఇబ్బందులకు కారణం రెవెన్యూ ఉద్యోగులు కాదని నిరూపించుకోవాల్సిన దుస్థితికి తెచ్చారని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఆత్మీయ సమ్మేళనం బేగంపేటలో జరిగింది. దీనికి హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. భూ పరిపాలన వ్యవస్థలో సమూలమైన మార్పు రావాలన్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి భూ సమస్యలను పరిష్కరించేలా మార్పులు ఉండాలన్నారు. రెవెన్యూ వ్యవస్థలో రావాల్సిన మార్పులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూలోని 124 చట్టాలన్నింటినీ కలిపి ఒకే చట్టం చేయాలని భూమి సునీల్ కుమార్ సూచించారు.
డిప్యూటీ కలెక్టర్ల సంఘం నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా వి.లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శలుగా కె.రామకృష్ణ, ఎన్.ఆర్.సరిత, సెక్రటరీ జనరల్‌గా రమేష్ రాథోడ్, కోశాధికారిగా కె.వెంకట్‌రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్స్‌గా ఎం.కృష్ణారెడ్డి, చిన్న వెంకటస్వామి, రమాదేవి, ఎం.జనార్దన్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పి.పద్మప్రియ, ఎన్.రాజేందర్‌రెడ్డి, షేక్ అమీద్, ఎం.విజయకుమారి, ఎల్.అలివేలు ఎన్నికయ్యారు.
రేవంత్‌ను కలిసిన కోదండరాం
సీఎం రేవంత్‌రెడ్డిని ప్రొఫెసర్ కోదండరాం ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కోదండరాం వెంట టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, అంబటి శ్రీనివాస్ తదితరులున్నారు.
Updated Date - 2023-12-11T03:42:49+05:30 IST