నిరీక్షణ తొలగేనా?
ABN, First Publish Date - 2023-12-11T00:16:49+05:30
యాంత్రిక జీవనం నుంచి సేద తీరేందుకు ఏర్పాటు చేసిన సిరిసిల్ల అర్బన్ పార్కు అందుబాటులోకి రావడం లేదు.
- అర్బన్ పార్కు ప్రారంభోత్సవానికి ఎదురుచూపులు
- అడవి అందాలకు మోక్షమెప్పుడో
- రూ.3 కోట్లతో 200 ఎకరాల్లో పార్కు అభివృద్ధి
- రూ.1.40 కోట్లతో ఆక్సిజన్ పార్కు
- మూడున్నరేళ్లుగా సాగుతున్న పనులు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
యాంత్రిక జీవనం నుంచి సేద తీరేందుకు ఏర్పాటు చేసిన సిరిసిల్ల అర్బన్ పార్కు అందుబాటులోకి రావడం లేదు. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలు అర్బన్ పార్కు పనులు పూర్తికాకపోవడంతో నిరీక్షించాల్సి వస్తోంది. ప్రకృతి అందాల మధ్య ఆహ్లాదకరమైన వాతా వరణంలో సిరిసిల్ల అర్బన్ ప్రజలకోసం పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో ప్రకృతి ప్రేమికులు నిరుత్సాహానికి గురవుతున్నారు. సిరిసిల్ల - కామారెడ్డి ప్రధాన రహదారిలో పోతిరెడ్డిపల్లె అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న అర్బన్ పార్కు పనులు మూడున్నరేళ్లుగా కొనసాగుతున్నాయి. పనులు చివరి దశకు చేరుకున్నా ప్రజలకు మాత్రం అందుబాటులోకి రాకపోవడం లేదు. దీంతో ప్రారంభోత్సవానికి మోక్షం ఎప్పుడా? అని ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వమైనా చొరవ చూపాలని కోరుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కంపా నిధులు, హరితహారంలో భాగంగా సిరిసిల్ల ప్రజల కోసం అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి చేపట్టారు. 26 జూన్ 2020న అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి అప్పటి మంత్రి కేటీఆర్ పనులను ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ప్రజలకు పార్కు అందుబాటులోకి వస్తుందని భావించారు. ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం పూర్తి కావడం లేదు. సిరిసిల్లకు మున్సిపల్‌కు 10 కిలోమీటర్ల దూరంలో సిరిసిల్ల - కామారెడ్డి రోడ్డులో పోతిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో రూ.3 కోట్ల వ్యయంతో 200 ఎకరాల్లో అర్బన్ పార్కు పనులను చేపట్టారు. దీంతోపాటు రూ. 1.40 కోట్లతో అదనంగా ఆక్సిజన్ పార్కు, చిల్డ్రన్ పార్కు రూపకల్పన చేస్తూ నిధులు మంజూరు చేశారు. అనేక వృక్షాల మధ్య 200 ఎకరాల్లో పికినిక్ స్పాట్ ఏర్పాటు చేశారు. వనాలు, బట్టర్‌ఫ్లై పార్కు, ఔషధ మొక్కలు, వంటివాటితో విభిన్నమైన రీతిలో పార్కును రూపొందిస్తున్నా అందుబాటులోకి ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మరోవైపు పనులు నిర్లక్ష్యంగా సాగుతున్నాయనే విమర్శలూ ఉన్నాయి.
ఆకర్షణీయంగా అర్బన్ పార్కు అందాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మండలంలోని పోతిరెడ్డిపల్లి సమీపంలో 581 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. 200 హెక్టార్లలో దట్టమైన చిట్టడవిని పెంచుతూ 10 హెక్టార్లలో ప్రజలకు అవసరమైన వసతులను ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా ఆడుకోవడంతోపాటు ఆహ్లాదం పొందేందుకు చిల్డ్రన్ ప్లే ఏరియా, గజిబో, కార్తీకవనం, పిక్నిక్ ఏరియా, కల్చరల్ పార్కు, అర్బల్ గార్డెన్, వాచ్ టవర్, ట్రికింగ్ పార్కు, యోగా షెడ్డుల నిర్మాణాలను చేపట్టారు. గజిబో, యోగా కేంద్రం, ఎంట్రెన్స్ ప్లాజా, లోటస్ పాండ్, రక్షణ కంచెలు, చెక్‌డ్యాం పనులు పూర్తయ్యాయి. ఇతర మొక్కలు పెంచడం, అదనంగా మరికొన్ని పనులు చేపట్టినా నత్తనడకగానే సాగుతున్నాయి. ప్రారంభోత్సవానికి ఇప్పటికైనా ఏర్పాట్లు చేయాలని సిరిసిల్ల ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2023-12-11T00:16:53+05:30 IST