దరఖాస్తుల స్వీకరణకు వేళాయె
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:51 AM
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు పథకాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మిగతా పథకాలను ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుక ప్రణాళిక రూపొందించింది.
- 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రజాపాలన సదస్సులు
- డిసెంబరు 31, జనవరి 1న గ్రామసభలకు సెలవు
- ఆరు గ్యారెంటీలపై దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లు
- గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ఏర్పాటు
- ప్రతీరోజు ఆన్‌లైన్ ద్వారా రిపోర్టు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు పథకాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మిగతా పథకాలను ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ప్రజాపాలన పేరుతో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు సదస్సులు నిర్వహించనున్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి పారదర్శకంగా ఉండే విధంగా ప్రజాపాలన పేరుతో సభలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలి దశలో గురువారం నుంచి ప్రతీ రోజు రెండు గ్రామాల చొప్పున మున్సిపాలిటీల్లో వార్డు చొప్పున ప్రజాపరిపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం పది విభాగాలకు సంబంధించిన అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో ప్రజాపాలన సభలు కొనసాగనున్నాయి. ఇందుకోసం జిల్లాలో బృందాల ఏర్పాటు, సంబంధిత షెడ్యూల్ కోసం అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గ్రామసభ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసింది. సదస్సుకు ముందు రోజే ప్రచారం చేయడం, కౌంటర్లు, ఇతర ఏర్పాట్లు చేయనున్నారు. గ్రామస్థాయి అధికారుల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు చేశారు.
వంద కుటుంబాలకు ఒక కౌంటర్
జిల్లాలోని 12 మండలాలు 255 గ్రామ పంచాయతీలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ప్రతీ రోజు రెండు గ్రామ పంచాయతీల్లో ఉదయం మధ్యాహ్నం ప్రజాపాలన సదస్సులు నిర్వహిస్తారు. సదస్సుల వద్ద వంద కుటుంబాల నుంచి ప్రభుత్వం ప్రకటించిన మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించనున్నారు. స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి ఆధార్, తెల్లరేషన్‌కార్డు జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు దారుడికి రసీదును తప్పనిసరిగా అందిస్తారు. అందిన దరఖాస్తులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌లో రోజువారీగా నమోదు చేయనున్నారు.
ఆరు గ్యారెంటీలపై ఆశలు
జిల్లాలో వచ్చే వంద రోజుల్లో అమలు చేస్తామన్నా ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించారు. ప్రస్తుతం పింఛన్ లేని మహిళలకు ప్రతీ నెల రూ.2500 చొప్పున చెల్లించనున్నారు. జిల్లాలో 18 ఏళ్లు దాటిన మహిళలు దాదాపు 2 లక్షల మంది పింఛన్ అందుకునే అవకాశం ఉంది. దీంతోపాటు గ్యాస్ సిలెండర్ రూ.500కు అందించనున్నారు. జిల్లాలో 1.49 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా 46,896 సిలిండర్లను వినియోగిస్తున్నారు. రూ.500కు సిలిండర్ ఇవ్వడంతో లబ్ధిదారులకు రూ.2.21 కోట్లు ఆదా కానుంది. దీంతోపాటు ఇందిరమ్మ ఇళ్లు పథకం కోసం అర్హులైన వారు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో గతప్రభుత్వం గృహలక్ష్మి పథకం మొదటి విడత కోసం 22,126 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం లేనివారికి స్థలంతోపాటు రూ.5 లక్షలు అందించనున్నారు. గృహజ్యోతి పథకంలో ప్రతీ కుటుంబానికి రూ.200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నారు. యువ వికాసం పేరిట అందించే గ్యారెంటీలు విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు అందించనున్నారు. అంతేకాక ప్రతీమండల కేంద్రంలో తెలంగాణ ఇంటర్నేషనల్ పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో పదోతరగతి వరకు 48028 మంది విద్యార్థులు ఉన్నారు. వీరితోపాటు ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, నర్సింగ్, ఇతర చదువులు చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. రైతులకు అందుతున్న రైతు బంధు పెట్టుబడి సాయం కూడా పెంచనున్నారు. జిల్లాలో 1,34,725 మంది రైతులు 132.50 కోట్ల మేరకు రైతుబంఽధు సాయం అందుకుంటున్నారు. ప్రస్తుతం ఒక ఎకరానికి రూ.10 వేలు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని వానాకాలం సీజన్ నుంచి ఎకరానికి రూ.15 వేలు అందించనున్నారు. జిల్లాలో కౌలు రైతులు కూడా దాదాపు 80 వేల మంది వరకు ఉన్నారు. వీరికి కూడా ఎకరానికి రూ.12 వేలు అందించనున్నారు. పేద కుటుంబాలకు సంబంధించి గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లు ఉచితంగా అందించనున్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం పరిధిలో 2.64 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ అవసరాలకు సంబంధిచి 1.64 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వీరికి 200 యూనిట్లు ఉచితంగా అందనుంది. మరో గ్యారెంటీ చేయూత ద్వారా రూ.2016 చొప్పున అందిస్తున్న పింఛన్‌ను రూ.4 వేలకు పెంచనున్నారు. జిల్లాలో 1.19 లక్షల మంది పింఛన్ దారులు ఉన్నారు. వీరికి అదనంగా రెట్టింపు పింఛన్ అందించాల్సి ఉంది. దీంతోపాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం అందించనున్నారు.
కొత్త రేషన్ కార్డులపై ఆసక్తి
జిల్లాలో రేషన్ కార్డుల కోసం అర్హులైన లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. కార్డులు లేక ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు. జిల్లాలో 40 వేలకు పైగా తెల్లరేషన్ కార్డు అర్హులు ఉన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1.73 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డులు రాకపోగా కనీసం చేర్పులు, మార్పులకు సంబంధించిన దరఖాస్తులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. చేర్పులు, మార్పులకు సంబంధించిన దరఖాస్తులు 20,606 పెండింగ్‌లో ఉన్నాయి. ప్రజాపాలన సదస్సుల్లో రేషన్ కార్డుల దరఖాస్తులే ఎక్కువగా రానున్నాయి. రేషన్ కార్డులు వస్తేనే ప్రభుత్వ పథకాలు వస్తాయని భావిస్తున్న లబ్ధిదారులు రేషన్ కార్డులపైనే ఆసక్తి పెంచుకున్నారు.
Updated Date - Dec 26 , 2023 | 12:51 AM