ప్రజాపాలన సభలు షురూ..
ABN, Publish Date - Dec 29 , 2023 | 12:39 AM
ప్రజాపాలన గ్రామ, పట్టణ సభలు ప్రారంభమయ్యాయి.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ప్రజాపాలన గ్రామ, పట్టణ సభలు ప్రారంభమయ్యాయి. మహాలక్ష్మి, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత పథకాల ద్వారా ప్రయోజనం పొందేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఒకే నమూనా ఫారంలో ప్రజలు దరఖాస్తు చేసుకోగా, రేషన్ కార్డులు లేనటువంటి వాళ్లు ఒక తెల్ల కాగితంపై దరఖాస్తు చేసుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో నివాసం ఉంటున్న వాళ్లే గాకుండా, ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లు సైతం గ్రామాలకు వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. తొలిరోజైన గురువారం జిల్లాలోని 48 గ్రామపంచాయతీలు, 18 మున్సిపల్ డివిజన్, వార్డుల్లో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు. తొలిరోజు నిర్వహించిన గ్రామాలు, వార్డుల్లో 39,179 కుటుంబాలు ఉండగా, 25,097 దరఖాస్తులు వచ్చాయని జిల్లా అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో 26,586 కుటుంబాలకు 15,633, పట్టణాల్లో 12,593 కుటుంబాలకు 9,464 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫారాలు గ్రామసభలకు వచ్చిన అధికారులు తమ వెంటనే తీసుకవచ్చారు. అప్పటికప్పుడే వాటిని పంపిణీ చేశారు. ఒక గంటసేపటికే దరఖాస్తులను ప్రజలు తీసుకవెళ్లారు. కానీ ప్రభుత్వం ముద్రించి ఆయాగ్రామాలు, పట్టణాలకు పంపించిన దరఖాస్తులు ఏమాత్రం సరిపోలేదు. చాలామంది జిరాక్స్ సెంటర్లలో దరఖాస్తులను కొనుగోలు చేశారు. ఇదే అదనుగా భావించిన జిరాక్స్ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తు ఫారాలను 10 నుంచి 30 రూపాయలకు విక్రయించడం గమనార్హం. పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అదనపు కలెక్టరేట్ శ్యాంప్రసాద్‌లాల్‌తో కలిసి పెద్దపల్లి మండలం హన్మంతునిపేట, సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామాల్లో గ్రామసభలను ప్రారంభించి దరఖాస్తులను స్వీకరించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ కార్పొరేషన్ 29వ డివిజన్ పరిధిలోని బాపూజీనగర్‌లో సభను ప్రారంభించి ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామసభను ఆరంభించి దరఖాస్తులు స్వీకరించారు. ఉపాధిరీత్యా వివిధ పట్టణాలు, ప్రాంతాలకు వలసవెళ్లిన వాళ్లు సైతం తమ సొంత గ్రామాలకు వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. ఆధార్‌కార్డు ఎక్కడ నమోదై ఉన్నదో అక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారం నిర్వహించిన గ్రామ, పట్టణ సభల ద్వారానే గాకుండా ఈ సభలు ముగిసేలోపు వచ్చే దరఖాస్తులను కూడా స్వీకరిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
దరఖాస్తులపై అనుమానాలు..
ఒకే దరఖాస్తు ఫారంపై ఐదు గార్యంటీ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, మంజూరు ఎలా చేస్తారనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దరఖాస్తులను ఎలా పరిశీలిస్తారు, ఎలా ఆ పథకాలను అమలుచేస్తారనే విషయమై ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఒక ఇంటిలో రెండు కరెంట్ మీటర్లు ఉంటే రెండింటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తారా లేక రెండింటింకి అందిస్తారా అనే విషయమై ఎవరూ చెప్పడంలేదు. 500 రూపాయలకే వంట గ్యాస్ తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న వారికే ఇస్తారా, గ్యాస్‌కనెక్షన్ ఉన్న వారందరికీ ఇస్తారా అనే విషయమై స్పష్టత లేదు. రైతు భరోసాకు పెట్టుబడి సాయాన్ని పట్టాదారులందరికీ ఇస్తారా, కేవలం వ్యవసాయం చేసే రైతులకే ఇస్తారా అనే విషయం తెలియడం లేదు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 రూపాయలు స్వశక్తి సంఘాల్లో ఉండే మహిళలకే ఇస్తారా, తెల్లరేషన్ కార్డు కలిగిన మహిళలకే ఇస్తారా అనే విషయమై స్పష్టత లేదని అంటున్నారు. అధికారులు తీసుకున్న దరఖాస్తులన్నింటినీ కార్యాలయాల్లో కంప్యూటర్లలో వివరాలను నమోదు చేస్తున్నారు. రేషన్ కార్డులకు సంబంధించి ఒక ఫ్రొఫార్మా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Updated Date - Dec 29 , 2023 | 12:39 AM