‘స్మార్ట్‌సిటీ’ పనులపై రాజకీయ దుమారం
ABN, Publish Date - Dec 22 , 2023 | 12:16 AM
నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరీంనగర్ టౌన్, డిసెంబరు 21: నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018లో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు కరీంనగర్‌ను ఎంపిక చేయగా 1845 కోట్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసి విడుతల వారిగా 934 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు పనులను ప్రారంభించారు. వీటిలో కొన్ని పనులు వంద శాతం పూర్తికాగా, మరికొన్ని పనులు 50శాతం, ఇంకొన్ని పనులు 40శాతం, కొన్ని పనులు 20 శాతం జరిగాయి. ఇవన్నీ పురోగతిలో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన బిల్లుల్లో 514 కోట్ల రూపాయలను సదరు కాంట్రాక్టు ఏజెన్సీకి చెల్లించా. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం 257 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటాగా 257 కోట్లు కాంట్రాక్టు ఏజెన్సీకి ఇచ్చారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద దశలవారీగా రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌లు, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఇలా అనేక రకాల అభివృద్ధి పనులను పూర్తి చేశారు. స్మార్ట్‌సిటీ పనులపై ఇప్పటికే పలు సంస్థలు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీలు అనేక రకాల విమర్శలు చేశాయి. నాణ్యత పాటించడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారని, నత్తనడకన పనులు చేపడుతున్నారనే విమర్శలతో కూడిన ఫిర్యాదులను ఉన్నతాధికారులకు చేశారు.
2018లో టెండర్లు
2018లో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కాంట్రాక్టు ఏజెన్సీని నియమించి, మొదటి దశ టెండర్లను పూర్తిచేసిన ఏడాది వరకు పనులు ప్రారంభించలేదు. దీనిపై అప్పట్లో అనేక రకాల విమర్శలు ఆనాటి పాలకవర్గంపై చేశారు. ఆ తర్వాత కొలువుతీరిన ప్రస్తుత పాలకవర్గం సగానికిపైగా పనులను పూర్తి చేయించింది. మరో సగం పనులు పురోగతిలోనే ఉన్నవి. ఈనేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్మార్ట్‌సిటీ పనులపై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి.
రూ. 130 కోట్ల అవినీతి జరిగిందని ఫిర్యాదు
కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలతోపాటు నగరపాలక సంస్థలో పాలకవర్గంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ కూడా స్మార్ట్‌సిటీ పనుల్లో 130 కోట్ల భారీ కుంభకోణం జరిగిందంటూ ఫిర్యాదు చేయడం నగరపాలక సంస్థలో హాట్ టాపిక్‌గా మారింది. స్మార్ట్‌సిటీలో ఎలాంటి అక్రమాలు, అవినీతి జరుగలేదని, ఎక్కడైనా అవినీతి జరిగినట్లుగానీ, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసినట్టు ఆధారాలతో నిరూపించాలని లేనిపక్షంలో తప్పును ఒప్పుకొని నేలకు ముక్కురాసి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ మేయర్ యాదగిరి సునీల్‌రావు డిమాండ్ చేయడం రాజకీయ వివాదంగా మారింది. ఐదేళ్లుగా సాగుతున్న స్మార్ట్‌సిటీ పనులపై ఇప్పుడు తాజాగా విమర్శలు, ప్రతి విమర్శలు, అన్నీ పార్టీలు చేయడంతో అసంపూర్తిగా, ప్రగతిలో ఉన్న పనులు పూర్తవుతాయో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామంటూ పదేపదే చెబుతున్న నేపథ్యంలో కరీంనగర్ స్మార్ట్‌సిటీ పనులతోపాటు ఇతర నిధులతో చేపట్టిన పనులపై కూడా విచారణ జరిపించవచ్చనే భావన వ్యక్తమవుతోంది.
ఫ రూ.133 కోట్ల పనులపై విజిలెన్సు విచారణ జరిపి బిల్లులు రికార్డు చేయాలి
- మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్
కరీంనగర్ టౌన్: ఇటీవల జరిగిన 133 కోట్ల రూపాయల విలువ చేసే పనుల టెండర్లలో నగరపాలక సంస్థ అధికారుల ప్రమేయం ఉన్నందున, ఆ పనుల నాణ్యతను విజిలెన్సు ద్వారా విచారణ జరిపించిన తర్వాతనే బిల్లులు రికార్డు చేయాలని మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఈమేరకు గురువారం ఆయన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 60 రోజుల్లో 60 కోట్ల పనుల బిల్లులు తయారు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారని, ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున పనులు చేయడం అసాధ్యమని అన్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపి బిల్లులు రికార్డుచేయాలని కోరారు. పనులు జరిగిన డివిజన్లకు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులను పక్కనబెట్టి వారి పర్యవేక్షణ లేకుండా వేరే అధికారులతో నాణ్యతను పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పటి వరకు బిల్లులు రికార్డు చేయకుండా నిలిపివేయాలని కోరారు. స్మార్ట్‌సిటీ పనుల్లో భాగంగా ఆర్‌అండ్‌బీ రోడ్లపై డ్రైనేజీ నిర్మాణం చేశారని, ఇందుకు బాద్యులైన అధికారులపై కూడా చర్య తీసుకోవాలని, ఆ డ్రైనేజీ నిర్మాణానికి చేసిన ఖర్చును ఆయన నుంచి రికవరీ చేయాలని కోరారు.
కలెక్టర్‌ను కలిసిన రవీందర్‌సింగ్
నగరపాలక సంస్థ అవినీతి, అక్రమాలపై చేసిన ఫిర్యాదుకు స్పందించిన జిల్లా కలెక్టర్ ఇకపై నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన పనులను ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో పరిశీలించిన తర్వాతే బిల్లులు రికార్దు చేయాలని ఆదేశించారు. దీంతో మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ కలెక్టర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. స్మార్ట్‌సిటీ పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి అందుకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కెమసారం తిరుపతి ఉన్నారు.
రోడ్లు వేయకుండా బిల్లులు ఎక్కడ తీసుకున్నారో నిరూపించాలి
మేయర్ సునీల్‌రావు
కరీంనగర్ టౌన్: స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో రోడ్లు వేయకుండానే బిల్లులు తీసుకున్నారని, 130 కోట్ల భారీ అవినీతి కుంభకోణం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదంటూ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ ఆరోపణలు చేయడం దురదృష్టకరమని మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు. ఎక్కడ ఎవరికి 130 కోట్లు ఇచ్చారో ఆధారాలతో నిరూపించాలని, లేకపోతే టవర్‌సర్కిల్‌లో ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని రవీందర్‌సింగ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.2018లో కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా రాగా, ఆనాటి పాలకవర్గం స్మార్ట్‌సిటీ డీపీఆర్‌ను రూపొందించి పీఎంసీ నియామకం చేసి ప్రాజెక్టులకు అగ్రిమెంట్ చేసి మొదటి దశ పనుల్లో ప్యాకేజీ 1,2తోపాటు పలు ప్రాజెక్టులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసిందని అన్నారు. టెండర్లు పూర్తయిన ఏడాది వరకు స్మార్ట్‌సిటీ పనులు చేపట్టలేదని, పనులు ఎందుకు జరుగలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయలేదన్నారు. ఎన్‌ఐటీ వరంగల్, ఽథర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్ పరిధిలోనే పనులు జరిగాయని, ప్రతి పనిని కోర్ కటింగ్ చేసి నాణ్యత చెక్ చేసి రిపోర్టు ఇచ్చిన తర్వాతనే బిల్లులు ఇస్తున్నారని, ఎక్కడ కూడా నాణ్యత లేమి లేదని స్పష్టం చేశారు. మూడు సంస్థల నుంచి రిపోర్టు తీసుకున్న తర్వాతే బిల్లుల చెల్లించామన్నారు. ఇప్పటి వరకు 514 కోట్ల రూపాయలను మాత్రమే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన నిధులు ఇచ్చాయన్నారు. ఆయన హయాంలో ఏడాది పాటు పనులు చేయకపోతే తమ హయాంలో పనులు జరిగితే ఓర్వలేక, స్మార్ట్‌సిటీ పనుల్లో అవినీతి జరిగిందంటూ నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్‌గా తాను గౌరవ వేతనం తీసుకోవడం లేదని, కార్పొరేటర్‌గానే వేతనం తీసుకుంటానని ప్రకటించిన రవీందర్‌సింగ్ రెండు చోట్ల గౌరవ వేతనం తీసుకున్నారని, నీతి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా పాలకవర్గంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న రవీందర్‌సింగ్‌పై బీఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని సునీల్‌రావు తెలిపారు. స్మార్ట్‌సిటీ పనుల్లో జరిగిన అవినీతిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని, అభండాలు వేస్తే మాత్రం ఊర్కోబోమని హెచ్చరించారు.
Updated Date - Dec 22 , 2023 | 12:16 AM