రుణమాఫీపై ఆశలు
ABN, First Publish Date - 2023-12-06T00:41:52+05:30
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పెండింగులో ఉన్న రుణమాఫీ సొమ్ముపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లక్ష రూపాయల వరకు రుణమాఫీ ప్రకటించింది.
- అందరు రైతులకు డబ్బులు ఇవ్వని బీఆర్‌ఎస్ ప్రభుత్వం
- జిల్లాలో పెండింగులో రూ.257.24 కోట్లు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పెండింగులో ఉన్న రుణమాఫీ సొమ్ముపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లక్ష రూపాయల వరకు రుణమాఫీ ప్రకటించింది. ఆ సొమ్మును నాలుగేళ్లలో విడతలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. కానీ రుణమాఫీ సొమ్మును విడుదల చేయడంతో అప్పటి ప్రభుత్వం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శించింది. కేవలం 25వేల రూపాయల వరకు రుణాలు మాఫీ అయిన వారికే మాత్రం జమచేసి, మిగతా వారిని విస్మరించింది. ఇప్పుడు, అప్పుడు అంటూ రైతులను ఊరిస్తూ వచ్చింది. దీంతో ప్రభుత్వ తీరుపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించడంతో జూలై నెలాఖరు నుంచి బడ్జెట్‌ను బట్టి రైతుల ఖాతాల్లో రుణ మాఫీ సొమ్మును జమచేస్తూ వచ్చారు. సెప్టెంబర్ రెండవ వారం వరకు మాత్రమే జమ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత చేతులెత్తేసింది. మొత్తం సొమ్మును విడుదల చేస్తామని ప్రకటించినా చేయలేదు. బీఆర్‌ఎస్ ఓటమి చెందేందుకు ఇదొక కారణంగా చెబుతున్నారు.
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు..
జిల్లాలో 25 వేల రూపాయల వరకు 15,397 మంది రైతులు 22కోట్ల 28లక్షల రుణాలు తీసుకున్నారని బ్యాంకు అధికారులు గుర్తించారు. 25,001 నుంచి 50 వేల రూపాయల వరకు 21,888 మంది రైతులు 80 కోట్ల 56 లక్షల రూపాయలు, 50,001 నుంచి 99,999 రూపాయల వరకు 33,234 మంది రైతులు 243 కోట్ల 49 లక్షల రూపాయలు, లక్ష రూపాయల వరకు 23,123 మంది రైతులకు 219 కోట్ల 11 లక్షల రూపాయలు, మొత్తం 93,642 రైతులకు 565 కోట్ల 44 లక్షల 68 వేల 300 రూపాయలు మాఫీచేసింది. కానీ 57,095 మంది రైతులకు 308కోట్ల 20లక్షల 22వేల 751రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకా 36,547 మంది రైతులకు 257కోట్ల 24 లక్షల 45 వేల 549 రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉన్నది. పెండింగు డబ్బుల కోసం రైతులు జిల్లా వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయారు. సాంకేతిక సమస్యల వల్ల ఖాతాల్లో నిలిచిపోగా, సంబంధిత రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నప్పటికీ, వాటిని కూడా క్లియర్ చేయలేదు.
రైతుల ఎదురుచూపులు..
ప్రభుత్వం మారడంతో రైతులు ఆశలు చిగురిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని, రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 డిసెంబర్ 11వ తేదీ వరకు ఉన్న పంట రుణాల్లో లక్ష వరకు గత ప్రభుత్వం మాఫీ చేసింది. వాటిని సకాలంలో ఇవ్వని కారణంగా రైతులు ఇబ్బందులు పడ్డారు. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాళ్లు ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీతోపాటు, పెండింగులో ఉన్న సొమ్మును కూడా విడుదల చేస్తుందనే ఆశల్లో రైతులు ఉన్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సమయం పట్టే అవకాశాలున్నాయి. ముందుగా రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని విడుదల చేసిన తర్వాత రుణమాఫీ గురించి ఆలోచన చేయనున్నదని తెలుస్తున్నది. అయితే ముందుగా పెండింగులో ఉన్న రుణమాఫీ సొమ్మును తమ ఖాతాల్లో జమచేయాలని మాఫీ పొందిన రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Updated Date - 2023-12-06T00:42:01+05:30 IST