నిరీక్షణకు తెర
ABN, First Publish Date - 2023-12-03T00:39:59+05:30
అసెంబ్లీ ఎన్నికల అంకం తుది దశకు చేరింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
అసెంబ్లీ ఎన్నికల అంకం తుది దశకు చేరింది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితో ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. ఆదివారం ఓట్ల లెక్కింపునకు ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మరికొద్ది గంటల్లోనే ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు తెరపడనున్నది. ఈనెల 30న జరిగిన ఎన్నికలపై మూడు రోజుల నుంచి ఓటింగ్ సరళిపై లెక్కలతో కుస్తీ పడుతున్న అభ్యర్థులు, పార్టీలు గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను లెక్కించేందుకు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లా కేంద్రాల్లో మూడంచెల భద్రతతో కౌటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలను చేర్చి 14 టేబుల్స్‌పై ఓట్లను లెక్కించే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో కరీంనగర్, మానకొండూర్, హుజురాబాద్, చొప్పదండి నియోజకవర్గాల ఓట్లను లెక్కించనున్నారు.
- కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు మరో 24 మంది, మొత్తం 27 మంది బరిలో నిలిచారు. నియోజకవర్గపరిధిలోని 390 పోలింగ్ కేంద్రాల్లో 3,55,054 మంది ఓటర్లు ఉండగా 2,24,504 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓట్లను లెక్కించడానికి 22 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 28 మంది కౌంటింగ్ అసిస్టెంటర్లు, 22 మంది మైక్రో అబ్జర్వర్లు, 16 మంది రిజర్వుతో కలుపుకొని మొత్తం 88 మందిని నియమించారు.
- మానకొండూర్ నియోజకవర్గంలో 10 మంది అభ్యర్థులు పోటీ పడగా, 2,21,613 మంది ఓటర్లకుగాను 1,84,413 మంది 316 పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 17 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 20 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 17 మంది మైక్రో అబ్జర్వర్లను, 14 మంది రిజర్వుతో కలుపుకొని 68 మందిని కౌటింగ్ కోసం నియమించారు.
- హుజూరాబాద్ నియోజకవర్గంలో 22 మంది బరిలో ఉండగా, 2,49,558 మందికిగాను 2,07,609 మంది 305 పోలింగ్ కేంద్రాల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కోసం 17 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 20 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 17 మంది మైక్రో అబ్జర్వర్లను, 15 మంది రిజర్వుతో కలుపుకొని 69 మందిని నియమించారు.
- చొప్పదండి నియోజకవర్గంలో 14 మంది పోటీ పడగా, 2,32,990 మంది ఓటర్లకుగాను 1,81,194 మంది 327 పోలింగ్ కేంద్రాల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్లను లెక్కించడానికి 16 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 18 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 16 మంది మైక్రో అబ్జర్వర్లను, 14 మంది రిజర్వుతో కలుపుకొని 64 మందిని మొత్తంగా 305 మందిని నియమించారు.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌటింగ్ షురూ....
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియతో కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్లను రౌండ్ల వారీగా లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌లో 14 టేబుళ్లపై ఓట్లను లెక్కించి ఎప్పటికప్పుడు వాటి వివరాలను ప్రకటిస్తారు. 10.30 గంటల వరకు మొదటి రౌండ్ ఫలితాలు రావచ్చని, సాయంత్రం 4 గంటల వరకు ఓట్ల లెక్కింపు పూర్తికావచ్చని భావిస్తున్నారు.
Updated Date - 2023-12-03T00:40:02+05:30 IST