సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి
ABN, First Publish Date - 2023-11-14T00:19:45+05:30
రాష్ట్రంలో ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని.. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుందనడం అసత్య ప్రచారమేనని.. ఆ పార్టీకి ఓటు వేసి వృధా చేసుకోవద్దని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ముస్లిం మైనార్టీలకు పిలుపునిచ్చారు.
- కాంగ్రెస్ గాలి అసత్య ప్రచారం
- హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
- శాంతిభద్రతల పరిరక్షణ, అభివృద్ధిని చూసి ఓటు వేయండి
- బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, నవంబర్ 13: రాష్ట్రంలో ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని.. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుందనడం అసత్య ప్రచారమేనని.. ఆ పార్టీకి ఓటు వేసి వృధా చేసుకోవద్దని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ముస్లిం మైనార్టీలకు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి నగరంలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటేనని, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ని గెలిపించుకునేందుకే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పనిచేస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముస్లిం, హిందువులు కలిసిమెలిసి ఒక్కటిగా జీవిస్తున్నారన్నారు. కరీంనగర్‌లో గడిచిన 10 ఏళ్ళలో శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని, కులమతాలకతీతంగా కలిసి జీవిస్తున్నారని, దీనితో ఇక్కడ గంగుల కమలాకర్, వినోద్‌కుమార్ కృషితో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమ సాధ్యమని, కాంగ్రెస్, బీజేపీలు చెప్పే కహానీలకు మోసపోయి ఓటును వృధా చేసుకోవద్దని సూచించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు రెండు ఒక్కతాను ముక్కలేనని, బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ గాలీ వీస్తుందంటూ అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్‌రావు, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అక్బర్‌హుస్సేన్, జమీలొద్దీన్, అమ్జద్ అలీ పాల్గొన్నారు.
ఫ బీఆర్‌ఎస్‌లో పలువురిచేరిక
కరీంనగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో వివిధ పార్టీలకుచెందిన నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాలకుచెందిన వారు బీఆర్‌ఎస్‌లో చేరారు. సోమవారం మంత్రి నివాసంలో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌తోకలిసి పార్టీలో చేరిన వారికి గులాబీకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కొట్లాడి సాధించిన తెలంగాణను కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమేకాకుండా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌లోకి చేరికలు పెరిగాయన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్, బీజేపీ చేతిలోపెడితే తెలంగాణకు తీరని నష్టం తప్పదని భావించి పార్టీలో చేరి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తున్నారన్నారు. కొత్తపల్లి మండలం రేకుర్తి, మల్కాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులతోపాటు ఎస్సారార్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, వాకర్స్ మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరి గంగుల కమలాకర్‌కు మద్దతుప్రకటించారు.
ఫ బీజేపీ, కాంగ్రెస్ వస్తే పథకాలన్నీ మాయం
కరీంనగర్ రూరల్: బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్ని మాయమవుతాయని రాష్ట్ర మంత్రి, కరీంనగర్ అసెంబ్లి నియోజక వర్గం బిఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కొత్తపల్లి మండలం చింతకుంటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంపదను దోచుకునేందకు ఆంధ్రా నాయకులు కుట్రలుపన్నుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లి కరెంట్ కష్టాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్టల కరుణరవీందర్, సర్పంచ్ మంజులసమ్మయ్య, ఎంపిటీసీలు పట్టెం శారదలక్ష్మినారాయణ, తిరుపతి నాయక్, జయప్రకాశ్, పల్లి మహేష్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
Updated Date - 2023-11-14T00:19:50+05:30 IST