Madigadda with the sitting judge : మేడిగడ్డపై సిటింగ్ జడ్జితో విచారణ
ABN, Publish Date - Dec 17 , 2023 | 03:50 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగినట్లు ప్రజలకు సందేహాలున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
అక్రమార్కులపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటాం..
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మేడిగడ్డకు తీసుకెళ్తాం
రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలులోకి తెస్తాం..
చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించేందుకు చర్యలు
మెగా డీఎస్సీ వేసి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం..
శాసనమండలిలో ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగినట్లు ప్రజలకు సందేహాలున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దీనిని తేల్చేందుకు సిటింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని, అక్రమార్కులుగా తేలితే చట్టపరిధిలో చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పనులు అప్పగించిన నాటి ముఖ్యమంత్రి, మంత్రులు, కాంట్రాక్టర్లు, దళారులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామన్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. దశాబ్దాలు గడిచినా అవి నిటారుగా నిలబడి ఉన్నాయి. లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి. కానీ, గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇసుక మీద బ్యారేజీలు కట్టారు. ఇసుక పోగానే.. బ్యారేజీ కుంగిపోయింది. ప్రపంచంలో ఎక్కడా ఇసుక మీద బ్యారేజీలు కట్టిన దాఖలాలు లేవు’’ అని సీఎం వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకెళ్తామని, చట్టసభల సభ్యులకు ఉన్న అపోహలు, అనుమానాలు తొలగించుకునే అవకాశం కల్పిస్తామని అన్నారు. శనివారం.. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. నిజాం షుగర్స్‌తోపాటు ప్రభుత్వరంగ చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించటానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మంత్రులతో ఓ కమిటీని, అధికారులతో ఓ కమిటీని నియమించి, ఆ కమిటీల నివేదికలు రాగానే ఫ్యాక్టరీలను తెరిచే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. పంటల బీమా(క్రాప్ ఇన్సూరెన్స్) పథకాన్ని అమలు చేస్తామని, ప్రకృతి విపత్తుల ద్వారా పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, పెట్టుబడి రాయితీ అందిస్తామని వివరించారు. వ్యవసాయం దండగలా మారిందని, పండుగలా మారుస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం.. గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో రైతులకు చేసిందేమీలేదని అన్నారు. రైతుబీమా లెక్కల ప్రకారం 1,21,965 మంది రైతులు మృతి చెందారని, ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం... రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండోస్థానంలో ఉందని వెల్లడించారు. ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే రైతుల ఆత్మహత్యలు జరిగేవికావని అన్నారు. అత్యధికంగా మేఘాలయలో రైతుల తలసరి ఆదాయం అత్యధికంగా రూ.29,348 ఉంటే తెలంగాణ లో రైతుల ఆదాయం రూ.9,403 మాత్రమే ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు.ఉచిత ఎరువుల హామీని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదని సీఎం రేవంత్ అన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని, మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి స్పెషల్ కారిడార్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
శాసనమండలిని కూడా శాసనసభ పక్కన ఉన్న హాల్‌కు తరలిస్తే.. ఉభయసభలు ఒకే చోట ఉంటాయని, పార్లమెంటు తరహాలో మధ్యలో సెంట్రల్ హాల్ ఉంటుందని, ముఖ్యమంత్రి, మంత్రులు శాసనమండలికి తరచుగా వచ్చే అవకాశం కూడా ఉంటుందని రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. మండలి చైర్మన్ సహా సభ్యులంతా ఆమోదం తెలపటంతో... పెద్దల సభను తరలించే ప్రక్రియను మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు కుదలైపోయాయని రేవంత్ అన్నారు. టీఎ్‌సపీఎ్‌ససీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్నారు. త్వరలో మెగా డీఎస్సీ వేస్తామని, రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామన్నారు.
కేసీఆర్ మండలిలో సభ్యుడు కాదు
శాసనమండలిలో సీఎం రేవంత్ మాట్లాడుతున్న సందర్భంలో ఆసక్తికర చర్చ జరిగింది. గత ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం రేవంత్ మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం... ఈ ప్రభుత్వం అని పలుమార్లు అన్నారు. పక్కన ఉన్న మంత్రులు గత ప్రభుత్వం అనాలని సీఎంకు సూచించారు. బీఆర్‌ఎస్ సభ్యులు కూడా రన్నింగ్ కామెంట్రీ చేస్తుండగా... వాళ్లను వీళ్లను కూడా నేరుగా కేసీఆర్‌నే అంటా! అని రేవంత్‌రెడ్డి అన్నారు. సభలో లేని వారి పేరు తీసుకోకూడదని అనటంతో... అయితే కేసీఆర్ మండలిలో సభ్యుడు కాదు కదా? ఇకమీదట కేసీఆర్ పేరు ఎత్తకూడదు. ఆ పేరును సభలో నిషేధించాలి! అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
మండలితో ప్రత్యేక అనుబంధం
చట్టసభల్లో ప్రవేశం శాసన మండలి నుంచే మొదలైందని... చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్‌లతోపాటు పలువురు మేధావుల నుంచి ఎన్నో విషయలు నేర్చుకున్నానని రేవంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా మొదలైన రాజకీయ ప్రస్థానం... నేడు ముఖ్యమంత్రిగా ఇదే సభలో నిలబడి మాట్లాడే స్థాయికి చేరుకున్నానని అన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 03:50 AM