పెరిగిన చలి తీవ్రత..
ABN, Publish Date - Dec 29 , 2023 | 11:40 PM
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. శుక్రవారం వికారాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోనే కనిష్ఠ స్థాయిలో పడిపోయాయి.
ఉమ్మడి జిల్లాలో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
గ్రామాలు, రహదారులను కమ్ముకుంటున్న మంచు తెరలు
మర్పల్లిలో 10.4 డిగ్రీలు, తాళ్లపల్లిలో 10.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. శుక్రవారం వికారాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోనే కనిష్ఠ స్థాయిలో పడిపోయాయి. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తాళ్లపల్లిలో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మౌలాలిలో 12.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. గాలిలో తేమశాతం పెరగడంతో ఉదయం వేళల్లో చాలా గ్రామాల్లో పొగమంచు కమ్ముకుంటోంది. తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 8 గంటల వరకు గ్రామాలతో పాటు రహదారులను మంచు తెరలు కమ్మేస్తున్నాయి. పొగమంచు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరో రెండు రోజులు చలి తీవ్ర ఎక్కువగానే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జనవరి 1 తర్వాత చలి మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చలి తీవ్రం కావడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఉన్ని దుస్తులు వినియోగించాలని సలహాలు ఇస్తున్నారు.
Updated Date - Dec 29 , 2023 | 11:40 PM