నిథమ్‌లో.. అవినీతి
ABN, Publish Date - Dec 17 , 2023 | 04:44 AM
పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో గచ్చిబౌలిలో ఏర్పాటైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్(నిథమ్) ప్రతిష్ఠ మసకబారుతోంది.
ప్రతిష్ఠాత్మక సంస్థలో రూ.కోట్లు గోల్‌మాల్
రాజకీయ అండతో డైరెక్టర్ నియామకం
హైదరాబాద్, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో గచ్చిబౌలిలో ఏర్పాటైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్(నిథమ్) ప్రతిష్ఠ మసకబారుతోంది. పర్యాటక, హోటల్ నిర్వహణలో అంతర్జాతీయ ప్రమాణాలతో తరగతులు నిర్వహించాల్సిన సంస్థలో అడ్డూఅదుపూలేని అవినీతి నెలకొంది. పర్యాటక, ఆతిథ్య రంగంలో స్థిరపడాలనుకునే యువతకు డిప్లొమా, డిగ్రీ, పీజీ స్థాయి కోర్సుల్లో అత్యున్నత స్థాయి శిక్షణ ఇప్పించి సుప్రసిద్ధ స్టార్ హోటళ్లలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో స్థాపించిన నిథమ్‌లో రాజకీయ నేతల పెత్తనం వల్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి పాలక మండలి చైర్మన్‌గా వ్యవహరించే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలో రూ.కోట్ల నిధులు దుర్వినియోగమైనట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 2004 లో గచ్చిబౌలి సమీపంలో సుమారు 30ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిథమ్‌ను స్థాపించారు. ఇందులో బీబీఏ, ఎంబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్), బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్), డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ (చె్‌ఫ) కోర్సులను నిర్వహిస్తున్నారు. అయితే తరగతుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో ప్రమాణాలు కొరవడి ప్రవేశాల సంఖ్య పడిపోయింది. ప్లేస్‌మెంట్లు సైతం నిలిచిపోయాయి. ప్రభుత్వ నిధులతోపాటు విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులతో భారీగా ఆదాయ వనరులు పెరగడంతో నిథమ్ జాతీయ స్థాయిలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రతిష్ఠాత్మక సంస్థగా గుర్తింపు పొందింది. అయితే, ఆదాయ వనరులు పెరగడంతో రాజకీయ పైరవీకారుల కన్నుపడి సంస్థ ప్రతిష్ఠ తగ్గింది. సంబంధిత రంగంలో పేరు ప్రతిష్ఠలు గలవారిని సంస్థ డైరెక్టర్‌గా నియమించేందుకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమిస్తే.. కమిటీ ప్రమేయం లేకుండానే రాజకీయ సిఫారసులతో దొడ్డిదారిన చిన్నంరెడ్డి డైరెక్టర్‌గా నియమితులైనట్టు ఆరోపణలున్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సోదరుడైన చిన్నంరెడ్డి నిథమ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనేక అవకతవకలు చోటు చేసుకున్నట్టు ఫిర్యాదులున్నాయి.
బహిర్గతం చేసిన కాగ్
టూరిజం, హాస్పిటాలిటీ కోర్సుల ప్రమాణాలను పెంచాల్సిన డైరెక్టర్ తరగతుల నిర్వహణను విస్మరించి నిధులను మింగేసే పనులపై దృష్టి కేంద్రీకరించినట్టు ఆరోపణలున్నాయి. నిబంధనలకు తిలోదకాలిచ్చి రూ.1.03 కోట్లను దుర్వినియోగం చేసినట్టు ఇటీవల కాగ్ నివేదిక స్పష్టం చేసింది. సంస్థ పాలక మండలి అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టు పేర్కొంది. వివిధ సంస్థల నుంచి నిథమ్‌కు రావాల్సిన సుమారు రూ.1.47 కోట్లను వసూలు చేయకుండా వదిలివేసినట్టు కాగ్ వెల్లడించింది. వసూలు చేసిన నిధులను ఖాతాలో జమచేయకుండా దారిమళ్లించినట్టు ఆరోపణలున్నాయి. అనుమతి లేకుండా సంస్థ ప్రాంగణంలోని చెరువు నీటిలో నిర్మాణాలు చేపట్టినట్టు ఫిర్యాదులున్నాయి. అక్రమ నిర్మాణాలపై నోటీసులు రావడంతో పనులు నిలిపివేశారు. దీంతో రూ.లక్షల విలువైన నిర్మాణ సామగ్రి నీటి పాలైంది. అనుమతులు లేకుండానే నిథమ్ స్థలాన్ని స్టార్ హోటల్ నిర్మాణానికి లీజుకు ఇచ్చి భారీ ఎత్తున మామూళ్లు వసూలు చేసినట్టు ఫిర్యాదులున్నాయి. ఇక విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజు రూ.51.9 లక్షల గోల్‌మాల్‌పై ఆరోపణలున్నాయి. బతుకమ్మ పండుగ పేరుతో ఖర్చు చేసిన నిధులకు అదనంగా రూ.2.5లక్షల వరకు బోగస్ బిల్లులు సమర్పించినట్టు తెలిసింది. అనుమతి లేకపోయినా డైరెక్టర్.. కారును కొనుగోలు చేసినట్టు ఫిర్యాదులున్నాయి. నిథమ్ ఖాతాలోని రిజర్వ్ ఫండ్ రూ.3 కోట్ల నిధులు సైతం ఖర్చు చేసినట్టు తెలిసింది. స్టోర్ రూంలో తనిఖీలు నిలిపివేయడంతో భారీ మొత్తంలో వస్తు సామగ్రి అదృశ్యమైనట్టు సమాచారం. విద్యార్థి, విద్యార్థినుల హాస్టళ్లకు వేర్వేరు పర్యవేక్షకులను నియమించాల్సి ఉండగా ఒక్కరినే నియమించి జీతభత్యాలను కాజేసినట్టు తెలిసింది. సంస్థకు అవసరమైన ఔట్ సోర్సింగ్ మాన్య్‌పవర్ సప్లై ఏజెన్సీ ఎంపికలో సైతం అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు, జీత భత్యాల చెల్లింపుల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేసిన విద్యార్థులను సైతం పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నట్టు సమాచారం.
Updated Date - Dec 17 , 2023 | 04:44 AM