స్వేచ్ఛగా అక్రమబద్ధీకరణ
ABN, Publish Date - Dec 28 , 2023 | 03:52 AM
ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని వాటిలో నివాసాలను ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారు..
ఖమ్మంలో జీవో 59 దుర్వినియోగం.. అక్రమార్కులతో అధికారుల కుమ్మక్కు
సుమారు రూ.100 కోట్ల స్థలాలు రెగ్యులరైజ్
గతంలో ఒకరి పేరుపై ఉన్న ఇంటి నంబర్లు
క్రమబద్ధీకరణలో ఇంకొకరి పేరుపై మార్పు
ఒకే ఇంటి నంబరుతో పలువురికి రిజిస్ట్రేషన్
కొన్నిచోట్ల నంబర్లు లేకుండానే రిజిస్ట్రేషన్లు
డాక్యుమెంట్లు, రికార్డులకు పొంతనలేని వైనం
ఖమ్మం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని వాటిలో నివాసాలను ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారు.. ఆ స్థలానికి తగిన మార్కెట్ ధరను చెల్లించి క్రమబద్ధీకరించుకోవచ్చంటూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో జీవో నం.59ని అమల్లోకి తీసుకొచ్చింది. అలా వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి రెగ్యులరైజ్ చేయాలని సూచించింది. దీంతో అప్పటి వరకు ఇష్టానుసారంగా కబ్జాలు చేసిన వారికి, గతంలో అధికార పార్టీ ముసుగులో అక్రమాలు చేసే వారికి రెక్కలు వచ్చినట్టయింది. అసలే అక్రమార్కులు.. ఆపై అధికారికంగా జీవో వెలువడటంతో తమకు కనిపించిన మేరలో అనుకూలంగా ఉన్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేశారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి క్రమబద్ధీకరించాల్సిన అధికారులు.. అక్రమార్కులకు అండగా నిలిచారు. నిబంధనలను గాలికొదిలేసి అందినకాడికి దండుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.కోట్లు విలువ చేసే భూములను రిజిస్ట్రేషన్ ఫీజుల్లో రాయితీ ఇచ్చి మరీ అక్రమార్కులకు కట్టబెట్టారు.
6వేల గజాలు అక్రమార్కుల చేతుల్లోకి..
ఖమ్మం మునిసిపాలిటీ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందినప్పటి నుంచి నగర పరిధిలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఖమ్మం నగర శివారులోనే మార్కెట్ ధర గజం రూ.30వేల వరకు పలుకుతుండగా.. నగరం నడిబొడ్డున ఉండే పలు ప్రాంతాల్లో రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఉంది. అలాంటి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్న రూ.కోట్ల విలువైన భూములను అధికారులు అతి తక్కువ ధరకు అక్రమార్కులకు కట్టబెట్టినట్టుగా తెలుస్తోంది. ఖమ్మం రెవెన్యూ పరిధిలో 59జీవో కింద 180 మందికి భూములను క్రమబద్ధీకరణ చేసినట్టుగా ప్రచారం జరుగుతుండగా అందులో ఒకరి పేరు మీద ఉన్న ఇంటి నంబరుతో మరొకరికి అదే ఆస్తి రిజిస్ట్రేషన్, అసలు ఇంటి నంబరు లేకుండానే రిజిస్ట్రేషన్.. వంటి అవకతవకలతో సుమారు 40మందికి ఆరు వేల గజాల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాని విలువ మార్కెట్‌లో రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆయా రిజిస్ట్రేషన్లకు చెందిన డాక్యుమెంట్ల వివరాలను సర్వే నంబర్ల వారీగా ‘ఆంధ్రజ్యోతి’ సేకరించింది. సంబంధిత డాక్యుమెంట్లలో అధికారులు రిజిస్ట్రేషన్ చేసిన ఇంటి నంబర్ల వివరాలను, ఖమ్మం నగరపాలక సంస్థలోని ఇంటి పన్నులకు సంబంధించిన వెబ్‌సైట్‌లో పరిశీలించి చూస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల బీఆర్‌ఎ్‌సకు చెందిన ఓ కార్పొరేటర్ అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని క్రమబద్ధీకరించుకున్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా సంచికలో ప్రచురించగా దానిపై కొందరు కాంగ్రెస్ నేతలు కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అనంతరం తీగ లాగితే డొంక కదిలిందన్న చందంగా క్రమబద్ధీకరణ అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
రికార్డుల్లో కనిపించని ఇంటి నంబర్లు..
ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఏళ్లుగా అక్కడే నివాసం ఉండే వారికి ఆ భూమిని క్రమబద్ధీకరించాలంటే సదరు వ్యక్తుల గుర్తింపు కార్డులతో పాటు, వారు అక్కడే ఉంటున్నట్టుగా ఏదైనా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఇంటి పన్ను రశీదులు, విద్యుత్ బిల్లు, నీటి పన్ను తదితర ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది. వాటిలో భూమి తమ ఆధీనంలో ఉందని చెప్పడానికి ప్రధాన ఆధారం ఇంటి పన్ను మాత్రమే. అయితే ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో క్రమబద్ధీకరించిన ఇంటి నంబర్లు మాత్రం పాత వ్యక్తుల పేరిట లేకపోవడం గమనార్హం. మరికొన్ని ఇంటి నంబర్లు అయితే అసలు రికార్డుల్లోనే లేవని మునిసిపల్ వెబ్‌సైట్ చూపిస్తోంది. అంతేనా మరికొన్ని డాక్యుమెంట్లలో అసలు ఇంటి నంబర్లు లేకుండానే రెగ్యులరైజ్ చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇవి కేవలం వెలుగులోకి వచ్చిన వాటిల్లో ఉదాహరణలు మాత్రమే. ఇవికాక కొందరు బీఆర్‌ఎస్ నేతలు బీనామీ పేర్లతో క్రమబద్ధీకరణ చేసుకున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, భార్య పేరుతో ఇంటి నంబరు ఉన్న స్థలాన్ని భర్త పేరిట, ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయగా.. అవన్నీ సర్వసాధారణమే అంటూ కొట్టిపారేస్తున్నారు కొందరు అధికారులు. అయితే ఇలాంటి అక్రమాలకు తావు ఉండొద్దన్న ఉద్దేశంతో క్రమబద్ధీకరణ సమయంలో ఖమ్మం కలెక్టర్ ప్రత్యేకంగా పలువురు అధికారులతో విచారణ కూడా చేయించారు. అయినా సదరు అధికారులు మాత్రం ఇంటి పన్నుల విషయాన్ని గాలికొదిలేశారన్న విమర్శలున్నాయి.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పాకబండ ప్రాంతంలో ఓ వ్యక్తికి 298 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించి
ఈ ఏడాది సెప్టెంబరులో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే సదరు ఇంటి నంబరు పురుషుడి పేరు మీద ఉండగా.. దానికి సంబంధించిన ఇంటి పన్ను ప్రకారం.. ప్రస్తుతం అది ఓ మహిళ ఆధీనంలో ఉన్నట్టుగా రికార్డుల్లో ఉంది. అంతేకాదు సదరు వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంటులోని ఇంటి ఫొటోకు, మునిసిపల్ రికార్డుల్లోని ఇంటి ఫొటోకు పొంతన లేకపోవడం విశేషం. శ్రీనగర్ కాలనీలో ఓ మహిళ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన 311 గజాల స్థలానికి సంబంధించిన ఇంటి నంబరు మునిసిపల్ రికార్డుల్లో పురుషుడి పేరిట ఉంది. ఎన్నెస్పీ క్యాంపులో బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన 415 గజాలకు చెందిన ఇంటి నంబరు 11-11-20/6 ఓ పురుషుడి పేరిట ఉంది. ఇలాంటి రిజిస్ట్రేషన్లు పదుల సంఖ్యలో ఉండగా.. ఆ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వ్యక్తులకు, మునిసిపల్ రికార్డుల్లో పేర్లు నమోదై ఉన్న వ్యక్తులకు అసలు సంబంధం లేకపోవడం గమనార్హం.
ఇందిరా నగర్‌లో రెండు ఇంటి నంబర్లకు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. అందులోనూ పురుషుడి పేరుమీద ఉన్న ఇంటి నంబరుతో ఓ మహిళకు 130 గజాలు రిజిస్ట్రేషన్ చేయగా.. మరో ఇంటి నంబరుతో సదరు పురుషుడికి 130, మరో మహిళకు 150 గజాలు.. మొత్తం 410 గజాలను క్రమబద్ధీకరణ చేసి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఒకే ఇంటి నంబరుతో ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లలో మాత్రం హద్దులు వేర్వేరుగా ఉండటం శోచనీయం. కొందరికి చిన్నపాటి రేకుల షెడ్లు ఉన్నా ఆ ఇంటి నంబర్లను ఆధారంగా చేసి ఒకరికి 317, మరొకరికి 387 గజాలను కట్టబెట్టిన ఘనత ఖమ్మం జిల్లా రెవెన్యూ అధికారులకే సొంతమైంది.
Updated Date - Dec 28 , 2023 | 03:52 AM