ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP: కమలం.. సంచలనం

ABN, First Publish Date - 2023-03-18T02:47:41+05:30

ఉమ్మడి మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ సంచలనం సృష్టించింది. తొలిసారిగా చేసిన పోటీలోనే విజయదుందుభి మోగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీకి పోటీ చేసిన తొలిసారే విజయదుందుభి

గెలుపొందిన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి

ఇది చరిత్రాత్మక విజయం: అమిత్‌ షా

టీచర్లకు నా సెల్యూట్‌: బండి సంజయ్‌

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ/ఎల్‌బీనగర్‌, న్యూఢిల్లీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ సంచలనం సృష్టించింది. తొలిసారిగా చేసిన పోటీలోనే విజయదుందుభి మోగించింది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీని ఖంగుతినిపించింది. అటు ఉమ్మడి ఏపీ చరిత్రలో.. ఇటు తెలంగాణ చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపరచిన అభ్యర్థిగా పోటీచేసిన ఎ.వెంకట నరసింహారెడ్డి (ఏవీఎన్‌ రెడ్డి) తన సమీప ప్రత్యర్థి పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డిపై 1150 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ నెల 13న జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 25,146 ఓట్లు పోలవగా.. 452 ఓట్లు చెల్లలేదు. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఏ అభ్యర్థికీ ఆధిక్యం దక్కకపోవడంతో ఎలిమినేషన్‌ పద్ధతిలో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. అన్ని ప్రాధాన్య ఓట్లూ కలిపి ఏవీఎన్‌ రెడ్డికి 13,436 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ బలపరచిన అభ్యర్థి కాటేపల్లి జనార్దన్‌ రెడ్డి ఓడిపోయారు.

ఉపాధ్యాయ బదిలీలు అస్తవ్యస్తంగా జరగడం, పైరవీలు చేసుకున్నవారికి కోరుకున్న చోట పోస్టింగులు దక్కడం, 317 జీవో బదిలీలపై గందరగోళం.. వంటివి బీఆర్‌ఎస్‌ బలపరచిన అభ్యర్థి ఓటమికి కారణాలుగా చెబుతున్నారు. దీనికితోడు పదోన్నతుల్లో అన్యాయం జరిగిందని చాలామంది టీచర్లు ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. ప్రతి నెలా జీతాలు ఆలస్యం కావడం టీచర్ల అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. కాగా.. ఏవీఎన్‌ రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, సీనియర్‌ నాయకులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ‘రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. బీజేపీ అభ్యర్థికి ఓటువేసిన ఉపాధ్యాయులందరికీ నా సెల్యూట్‌’ అని సంజయ్‌ చెప్పారు. ఎ.వి.ఎన్‌.రెడ్డి విజయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్‌ నేతలు ఎన్‌.రాంచందర్‌రావు, ఎన్‌. ఇంద్రసేనారెడ్డిని సంజయ్‌ ప్రత్యేకంగా సన్మానించారు. కాగా, సంజయ్‌ సారథ్యం వల్లే తాను విజయం సాధించినట్లు ఎ.వి.ఎన్‌.రెడ్డి పేర్కొన్నారు. ఇక, వివాదాస్పద జీవో 317కు వ్యతిరేకంగా బండి సంజయ్‌ చేపట్టిన పోరాట ఫలితంగానే ఉపాధ్యాయులంతా తమ పార్టీకి అండగా నిలిచారని బీజేపీ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు జీవో 317తో తీవ్ర ఇబ్బంది పడ్డారు. సకాలంలో జీతాలు అందకపోవడం.. పదోన్నతులు నిలిచిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిలో వారికి అండగా సంజయ్‌ ఉద్యమం చేపట్టి జైలుకు కూడా వెళ్లారు. దీంతో, ఉపాధ్యాయవర్గమంతా మా పార్టీ చిత్తశుద్ధిని గుర్తించింది’’ అని సీనియర్‌ నేత ఒకరు వివరించారు.

ఇది చరిత్రాత్మక విజయం: అమిత్‌షా

ఎమ్మెల్సీగా ఎ.వి.ఎన్‌.రెడ్డి విజయం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. దీన్ని చరిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. ఎ.వి.ఎన్‌.రెడ్డిని, బండి సంజయ్‌ని, రాష్ట్ర పార్టీ నేతలను అమిత్‌ షా ప్రత్యేకంగా అభినందించారు. ‘‘తెలంగాణలో అవినీతి ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారు.. ప్రధాని మోదీ నాయకత్వంలోని పారదర్శక బీజేపీ పాలనను కోరుకుంటున్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం దీనికి నిదర్శనం’’ అని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

ఇంతకుముందు ఎమ్మెల్సీలు ఉన్నా..

బీజేపీ తరఫున ఇంతకుముందు ఎమ్మెల్సీలు ఉన్నా.. వారు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం సాధించడం బీజేపీకి ఇదే తొలిసారి. దీంతో, ఏడాది అనంతరం, మండలిలో బీజేపీ ప్రాతినిధ్యం ఉండనుంది. ఇంతకుముందు, పట్టభద్రుల నియోజకవర్గం(హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌) నుంచి పార్టీ నేత ఎన్‌. రాంచందర్‌రావు మండలిలో కొనసాగిన సంగతి తెలిసిందే. కొద్దినెలల కిందట జరిగిన ఈ నియోజకవర్గ ఎన్నికలో ఆయన ఓడిపోయారు.

నైతిక విజయం పీఆర్‌టీయూదే

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో నైతిక విజయం పీఆర్‌టీయూటీఎ్‌సదేనని యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావులు అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని విధ్వంసం చేయటానికి కార్పొరేట్‌ శక్తులు పన్నిన కుట్రలో భాగంగా ఈ ఎన్నికలు జరిగాయని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డబ్బు పంపిణీతో ఫలితాలు తారుమారయ్యాయని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ సహకారంతో కృషిచేస్తామని వారు తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణలో..బీజేపీ పుంజుకునే అవకాశం లేదు

అమిత్‌ షాతో ఈటల, రాజగోపాల్‌

న్యూఢిల్లీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పుంజుకునే అవకాశం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు.. ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వివరించారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ను ఢీ కొట్టేందుకు మరింత పటిష్ఠమైన వ్యూహాలు అవసరమని, దీని కోసం నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని షాను కోరినట్లు తెలిసింది. తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. అమిత్‌ షాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. రెండు రోజులపాటు ఇక్కడే మకాం వేసిన నేతలు షా తో కీలక చర్చలు జరిపారు. రాష్ట్ర బీజేపీలో ఇప్పుడున్న వారికే సరైన ప్రాధాన్యం లభించడం లేదని తెలంగాణ నేతలు షా దృష్టికి తీసుకువెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరే వారి పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలోకి చేరికలు పెరగాలంటే వచ్చే వారికి నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలిసింది. అయితే.. ఈ అంశాలన్నింటినీ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళతానని ఈటల, రాజగోపాల్‌ రెడ్డికి అమిత్‌ షా హామీ ఇచ్చినట్లు సమాచారం.

Updated Date - 2023-03-18T03:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising