చీలిక భయం
ABN, First Publish Date - 2023-08-22T15:26:53+05:30
నగరం నడిబొడ్డున ఉన్న గోషామహల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ హైకమాండ్‌ను టెన్షన్ పెట్టిస్తోంది.
బీఆర్‌ఎ్‌సకు ‘గోస’మహల్
టికెట్ రేసులో అరడజను మంది
ఒకరికి టికెటిస్తే మరికొందరు దూరం
ఏంచేయాలో పాలుపోక టికెట్ పెండింగ్
చివరి వరకు వేచి చూసే యోచన ?
లోకల్, నార్త్ ఇండియన్ వర్గాలుగా కార్యకలాపాలు
విస్మరిస్తే బీఆర్‌ఎ్‌సకు ఓటమి తప్పదు : ఉద్యమకారులు
గులాబీ పార్టీకి తలనొప్పిగా మారిన నియోజకవర్గం
మంగళ్‌హాట్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): నగరం నడిబొడ్డున ఉన్న గోషామహల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ హైకమాండ్‌ను టెన్షన్ పెట్టిస్తోంది. ఇక్కడి నుంచి అరడజను మంది పోటీలో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఒకరికి టికెట్ కేటాయిస్తే మరికొందరు పార్టీని వీడిపోయే ప్రమాదం ఉండడంతో బీఆర్‌ఎస్ తొలిజాబితాలో గోషామహల్ అభ్యర్థిని ప్రకటించలేదని తెలుస్తోంది. లోకల్, ఉత్తర భారతీయులు ఎవరికి వారు పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టికెట్ తనకంటే తనకేనని జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆది నుంచి పార్టీలో ఉన్న ఉద్యమకారులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. తమకు కేటాయించకుంటే ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను ఓడించి తీరుతామని అంటున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున చివరి క్షణంలో ప్రేమ్‌కుమార్ ధూత్‌కు టికెట్ దక్కగా ఘోర పరాజయం పాలయ్యారు. తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో ప్రేమ్‌సింగ్ రాథోడ్‌కు టికెట్ దక్కినప్పటికీ ఆయన బీజేపీ అభ్యర్ధి రాజాసింగ్‌కు పెద్దగా పోటీ ఇవ్వకుండా రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. రెండు పర్యాయాలు ఘోర పరాజయాన్ని చవిచూసిన అధికార బీఆర్‌ఎస్ ఈసారి బీజేపీని ఓడించాలనే ఉద్దేశంతో ప్రజాదరణ ఉన్న నాయకుడిని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
టికెట్ కోసం పోటాపోటీ
గోషామహల్‌లో రెండుసార్లు వరుసగా బీజేపీ ఘనవిజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా అప్పటి టీఆర్‌ఎస్ హవా కొనసాగినప్పటికీ ఇక్కడ మాత్రం బీజేపీ నుంచి రాజాసింగ్ గెలుపొందారు. ఇటీవల ఆయన ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యలతో బీజేపీ అధిష్టానం పార్టీ నుంచి బహిష్కరించింది. రాజాసింగ్‌కు బీజేపీ టికెట్ ఇవ్వకపోయే అవకాశం ఉండగా, కనీసం పార్టీలోకి కూడా తీసుకునే చాన్స్ లేదని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో రాజాసింగ్ మినహా గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఎవరు పోటీచేసినా అది బీఆర్‌ఎ్‌సకు కలిసొచ్చే అవకాశం ఉంది.
సుమారు అరడజను మందిపైనే..
బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసేందుకు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివా్‌సయాదవ్, ఆశి్‌షకుమార్ యాదవ్, నందకిషోర్ వ్యాస్, ఉద్యమ నాయకులు రాజశేఖర్, మమత సంతోష్ గుప్తాతోపాటు మరో ఇద్దరు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నందకిషోర్ వ్యాస్, గడ్డం శ్రీనివా్‌సయాదవ్, ఆశి్‌షకుమార్ యాదవ్ తదితరులు ప్రజల్లోకి వెళ్లి తమకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ఏడాదిగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. యాదవ సామాజికవర్గానికి బీఆర్‌ఎస్ టికెట్ కేటాయిస్తే ఉత్తర భారతీయులు, మంగళ్‌హాట్, గోషామహల్ డివిజన్లలో అధికంగా ఉన్న లోథా క్షత్రియులు పార్టీకి దూరమయ్యే అవకాశాలున్నాయి. ఉత్తర భారతీయుడిగా పేరున్న నందకిషోర్ వ్యాస్‌కు టికెట్ కేటాయిస్తే స్థానికంగా ఉన్న యాదవులు, ఉద్యమకారులతోపాటు స్థానిక నాయకులు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉండడంతో అధిష్ఠానం గోషామహల్ టికెట్‌ను పెండింగ్‌లో పెట్టినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.
అభ్యర్థిని ప్రకటిస్తే చీలికలే..
బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నందకిషోర్ వ్యాస్‌పై గతంలో భూవ్యవహారాల్లో తలదూర్చినందుకు కేసులు నమోదు కావడం, స్థానికంగా కొంతమందితో విభేదాలు రావడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తన కూతురు పూజావ్యా్‌సకు బీఆర్‌ఎస్ టికెట్ ఇప్పించుకొని గెలిపించుకోలేకపోయారు. కార్పొరేటర్‌ను గెలిపించుకోలేని వ్యక్తి ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తాడని ఆ పార్టీ నేతలే బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉత్తర భారతీయుడికి టికెట్ కేటాయిస్తే స్థానికంగా కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీల వైపు వెళ్లే ప్రమాదం ఉందని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.
Updated Date - 2023-08-22T15:26:53+05:30 IST